కాంగ్రెస్‌ కి సుష్మా.. ప్ర‌చారం చేస్తోందా ఏంటి?

Update: 2017-09-24 10:50 GMT
మ‌న ఆవేశ‌మే మ‌న‌కు శ‌త్రువు! అంటారు పెద్ద‌లు. ఇప్పుడు ఈ ఆవేశ‌మే బీజేపీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌ ను ఇర‌కాటంలోకి నెట్టింది. త‌మ పార్టీకి బ‌ద్ధ‌శ‌త్రువైన కాంగ్రెస్‌ ను ఆమె పేరు చెప్ప‌కుండానే విదేశీ గ‌డ్డ సాక్షిగా పొగిడేశారు. కాంగ్రెస్ మేధావుల‌ను త‌యారు చేస్తోంద‌ని కితాబు ఇచ్చేశారు. కాంగ్రెస్ హ‌యాంలో ఐఐటీలు - ఐఐఎంలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ విష‌యాన్ని గ‌మ‌నంలో పెట్టుకోలేక‌పోయిన సుష్మా.. త‌ప్పులో కాలేశారు. ``ఐఐటీల‌లో  మేం... మేధావుల‌ను త‌యారు చేస్తుంటే.. పాక్ మాత్రం ఉగ్ర‌మూక‌ను త‌యారు చేస్తోంద‌ని చెప్పుకొచ్చారు`` ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లే కాంగ్రెస్‌ లో జోష్ నింపుతుంటే.. బీజేపీలో దుమారం రేపాయి.

అమెరికాలో ఐక్య‌రాజ్య‌స‌మితి స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రుగుతోంది. 23న అంటే నిన్న సుష్మా స్వ‌రాజ్ ప్ర‌పంచ దేశాల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈసంద‌ర్భంగా ఆమె భార‌త్ ఎదుర్కొంటున్న ఉగ్ర స‌మ‌స్య‌ను బ‌లంగా లేవ‌నెత్తారు. ఈ స‌మ‌యంలో ఆమె పాకిస్థాన్‌ ను నిందించే  ప్ర‌క్రియ‌లో చేసిన వ్యాఖ్య‌లు ప‌రోక్షంగా ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌ ను అంత‌ర్జాతీయ వేదిక‌పై పొగిడిన‌ట్టు వినిపించాయి. ``భారతదేశం ఐఐటీ - ఐఐఎం వంటి  విద్యాసంస్థల్ని నెలకొల్పి మేధావులను తయారుచేస్తుంటే.. పాక్‌ మాత్రం ఉగ్రవాదుల్ని ఉత్పత్తి చేస్తోంది`` అని సుష్మా నిప్పులు చెరిగారు.

వాస్త‌వానికి దేశంలో ఐఐటీలు - ఐఐఎంలు కాంగ్రెస్ హ‌యాంలోనే ఏర్పాటయ్యాయి. ఈ విష‌యం గుర్తించ‌కుండా సుష్మా నోరు జారారు. ఇక‌ - దీనిపై కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  ‘‘సుష్మా గారు.. మీకు ధన్యవాదాలు. ఐఐటీ - ఐఐఎంల గురించి మీ ప్రసంగంలో ప్రస్తావించారు. కనీసం ఇలాగైనా మా పార్టీ గొప్పతనాన్ని గుర్తించారు ’’ అంటూ ఆదివారం త‌న ట్వీట్‌ లో రాహుల్‌ పేర్కొన్నారు.   కాగా, బీజేపీ నేత‌లు సుష్మా వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించ‌లేక‌, కాంగ్రెస్‌ కు స‌మాధానం చెప్ప‌లేక స‌త‌మ‌తం అవుతున్నారు. మ‌రి ప్ర‌ధాని మోదీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News