పొద్దుపొద్దున్నే రోడ్ల మీదకు ‘యువరాజు’

Update: 2016-11-21 09:46 GMT
ఏ మాటకు ఆ మాటే.. యువరాజు అని పిలుచుకున్న ముద్దుగానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరు కనిపిస్తుంది. తమ పార్టీ పవర్ లో ఉన్న పదేళ్లు ఆయన వైభోగం మాటల్లో చెప్పలేనిది. దేశం మొత్తం అతలాకుతలం అవుతున్నా.. ఆయన మాత్రం ఏం పట్టనట్లుగా ఉండేవారు. నిర్భయ ఉదంతంలో రాహుల్ తల్లి.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా స్పందించిన తర్వాత కానీ రాహుల్ కు స్పందించే సమయం చిక్కని పరిస్థితి.

అలాంటి రాహుల్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అధికారం చేజారిన తర్వాత.. దాని విలువ ఏమిటో ఆయనకు అర్థమయ్యే ఉంటుంది. పోయింది పోవటం తర్వాత.. ఏకుగా వచ్చిన మోడీ మేకుగా మారతాడని.. ప్రధాని పీఠాన్ని ఒక పట్టాన వదిలిపెట్టని మొండిఘటమన్న విషయం అర్థమవుతున్న కొద్దీ కాంగ్రెస్ యువరాజులో ఆందోళన అంతకంతకూ పెరిగిపోతున్నట్లుంది. తాజాగా ఆయన తీరు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది.

తాజాగా మోడీ తీసుకున్న నోట్ల రద్దు ఎపిసోడ్ ఆయనకు భారీ షాక్ ఇచ్చినట్లుగా కనిపిస్తున్నట్లుంది. ఎప్పుడూ ఏ విషయం మీద అదే పనిగా ఆందోళనలు.. నిరసనలు చేసే అలవాటు లేని రాహుల్.. రద్దు ఇష్యూలో మాత్రం అదే పనిగా.. తనకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు తెచ్చుకొని.. తనలాంటి వాడికి సైతం ఎంత కష్టాన్ని మోడీ తీసుకొచ్చాడన్న విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేసిన ఆయన.. తర్వాత కూడా తన ఆందోళన క్రమాన్ని వదిలిపెట్టటం లేదు.

తాజాగా ఆయన పొద్దుపొద్దున్నే ఢిల్లీ రోడ్ల మీదకు వచ్చేస్తున్నారట. తెలవారక ముందే రోడ్ల మీదకు వచ్చి.. ఏటీఎం వద్ద నిలుచున్న ప్రజలతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. మోడీ నిర్ణయం కారణంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్న తెలియజేసే క్రమంలో అంత చలిలోనూ రాహుల్ పడుతున్న కష్టం చూసినోళ్లు ఆశ్చర్యపోతున్న పరిస్థితి. మొత్తానికి సూరీడు రాక ముందే రాహుల్ ను రోడ్ల మీదకు తీసుకొచ్చిన ఘనత మోడీకి దక్కుతుందనటంలో సందేహం లేదని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News