మోదీని రాహులే మళ్లీ ప్ర‌ధానిని చేస్తారా?

Update: 2017-10-20 17:30 GMT
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు తీసుకుంటే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోదీకి విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే. అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకుని... తానే స్వ‌యంగా మోదీని గెలిపిస్తార‌ట‌. ఇప్ప‌టికే గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా మోదీకి గుణ‌పాఠం చెప్పాల్సిందేనన్న క‌సితో ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంటే... ఈ ప‌రాచిక‌పు మాట‌లేమిట‌నేగా మీ డౌటు? అయినా రాహుల్ గాంధీ ఏమిటీ?.. మోదీని మళ్లీ ప్ర‌ధానిని చేయ‌డ‌మేమిట‌నేగా మీ సంశ‌యం? ఇందులో పెద్ద‌గా బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకోవాల్సినంత ప‌నేమీ లేదంటున్నారు విశ్లేష‌కులు. విశ్లేష‌కులే కాదండోయ్‌... స్వ‌యంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లే ఈ విష‌యాన్ని త‌మ అంత‌రంగిక చ‌ర్చ‌ల్లో ఒప్పేసుకుంటున్నారు.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... గ‌డ‌చిన ఎన్నిక‌ల తీరును ఓ సారి ప‌రిశీలిస్తే... ఎలాంటి ప్ర‌భావం చూప‌లేని రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపి చాలా త‌ప్పే చేసింది. ఎందుకంటే... ప్ర‌జాక‌ర్ష‌ణ‌లో అప్ప‌టికే చాలా ఎత్తుకు ఎదిగిన మోదీకి రాహుల్ ఎలాంటి పోటీ కానే కాద‌న్న‌ది నాటి విశ్లేష‌కుల మాట‌. అంతేకాకుండా ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం లేకుండా నేరుగా ప్ర‌ధాని ప‌ద‌వికి పోటీ ప‌డ‌తారా? అంటూ రాహుల్ పై సెటైర్లు కూడా వెల్లువెత్తాయి. కేవ‌లం గాంధీ కుటుంబానికి చెందిన వారేన‌న్న ఒకే ఒక్క అర్హ‌త‌తో రాహుల్‌ ను ప్ర‌ధాని చేసేందుకు దేశ ప్ర‌జ‌ల్లో చాలా మంది ఆస‌క్తి చూప‌లేదు. అదే స‌మ‌యంలో త‌న‌దైన శైలిలో ప్ర‌చారాన్ని హోరెత్తించిన మోదీ ముందు నిజంగానే రాహుల్ గాంధీ చిన్న‌బోయారు. ఫ‌లితంగా లోక్‌ స‌భ‌లో క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అర్హ‌తకు అవ‌స‌ర‌మైన సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు.

ఇక ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే... గ‌డ‌చ‌ని సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో మోదీ ఆధ్వ‌ర్యంలో బ‌రిలోకి దిగిన బీజేపీ మెజారిటీ ఎన్నిక‌ల‌ను గెలుచుకుంది. అలా కుద‌ర‌ని కొన్ని చోట్ల మోదీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలు త‌మ‌దైన వ్యూహాలు ర‌చించి ఇత‌ర పార్టీల‌ను ద‌గ్గ‌రికి తీసుకుని అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మోదీ విజ‌యాన్ని ఎలాగూ ఆప‌లేని రాహుల్ క‌నీసం... ఈ త‌ర‌హా రాజ‌కీయ కుతంత్రాల‌ను కూడా నిలువ‌రించ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీ మోదీకి త‌గిన పోటీదారే కాద‌న్న వాద‌న బ‌ల‌ప‌డిపోయింది. ఇందుకు చాలా కార‌ణాలే వినిపిస్తుండ‌గా, కాంగ్రెస్ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు చెబుతున్న ఓ ఐదు అంశాల‌ను ప‌రిశీలిస్తేనే... రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌డితే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోదీ చాలా సునాయ‌సంగా విజ‌యం సాధిస్తార‌ని చెప్పేయొచ్చు.

ఆ అంశాల్లోని తొలి అంశం విష‌యానికి వ‌స్తే... ఇప్ప‌టిదాకా రాహుల్ గాంధీ పార్టీకి చెందిన‌ ఏ ఒక్క రాష్ట్ర బాధ్య‌త‌ల‌ను పూర్తిగా చేప‌ట్ట‌లేదు. అస‌లు ఆ విష‌యంపై ఆయ‌న ఆస‌క్తి క‌న‌బ‌రిస్తేనే ఒట్టు. ఇటీవ‌లే ముగిసిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మోదీ మేనియాకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రాహుల్‌ ను సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపాల‌ని యోచించింద‌న్న వాద‌న వినిపించింది. అయితే ఈ విష‌యంలో రాహుల్ ఎంత‌మాత్రం సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదు క‌దా... అస‌లు ఆ ఎన్నిక‌ల‌కు త‌న‌కు అంత ప్రాధాన్యం కాద‌నే ధోర‌ణితోనే వ్య‌వ‌హ‌రించారు. ఇక రెండో అంశానికి వ‌స్తే... కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా రాహుల్ త‌ల్లి సోనియా గాంధీ సుదీర్ఘ కాలం పాటు కొన‌సాగుతున్నారు. సోనియా అధ్య‌క్షురాలిగా వ్య‌వ‌హ‌రించినంత కాలం ఏ ఒక్క‌రు కూడా ఆ ప‌ద‌విలో కొన‌సాగలేదు. ఈ లెక్క‌న కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం పాటు అధ్య‌క్షురాలిగా కొన‌సాగిన నేత‌గా సోనియా రికార్డే సృష్టించారు. ఇంత కాలం పాటు ఆమె అధ్య‌క్షురాలిగా ఎలా కొన‌సాగ‌గ‌లిగారంటే... పార్టీ వ్య‌వ‌హారాల‌పై క‌మాండ్‌తో పాటు నేత‌ల‌కు ల‌క్ష్మ‌ణ రేఖను సోనియా గీయ‌గ‌లిగారు. ఆ రేఖ‌ను ప‌క్కాగా అమ‌లు చేయ‌గ‌లిగారు కూడా. అంటే సోనియాకు పార్టీపై ఉన్నంత ప‌ట్టు మ‌రే నేత‌కు లేద‌న్న మాటే. మ‌రి ఇదే విష‌యంలో రాహుల్ గాంధీ విషయానికి వ‌స్తే... రాహుల్ మాట‌ను ప‌ట్టించుకునే నాథుడే పార్టీలో క‌నిపించ‌రు. అంతా సోనియా పాటే పాడ‌తారు త‌ప్పించి రాహుల్ ఆదేశాల‌ను అస్స‌లు లెక్క‌చేయ‌ర‌నే వాద‌న కూడా ఉంది. ఈ క్ర‌మంలో రాహుల్ పార్టీకి చీఫ్‌ గా బాధ్య‌త‌లు చేప‌డితే లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇక మూడో విష‌యానికి వ‌స్తే... ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌న్ని కూడా అమ‌ల్లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌నే తీసుకుంటే.. అధికార స‌మాజ్ వాదీ పార్టీతో జ‌ట్టు క‌ట్టాల‌న్న‌ది రాహుల్ నిర్ణ‌య‌మే. ఆ ఎన్నికల్లో ఎస్పీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మ‌ట్టి క‌రిచింది. ఇక త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పంజాబ్ ఎన్నికల ప్ర‌చారానికి వెళ్లిన రాహుల్‌... లేడీస్ టాయిలెట్ లోకి ప్ర‌వేశించి విమ‌ర్శ‌ల పాల‌య్యారు.  అంటే రాహుల్ గాంధీ ఏం చేసినా కూడా పొర‌పాట్లే జ‌రిగిపోతున్నాయి. ఇలాంటి నేత‌కు కాంగ్రెస్ పార్టీ చీఫ్ ప‌ద‌వి ఇస్తే... ఇక అంతే సంగ‌తులు అన్న వాద‌న వినిపిస్తోంది. నాలుగో అంశానికి వ‌స్తే... ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి రాహుల్ ఇమేజీని డ్యామేజీ చేయ‌డంలో న‌రేంద్ర మోదీ ఏమాత్రం అల‌క్ష్యం వ‌హించ‌డం లేదు. ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా భూత‌ద్దంలో చూపించేస్తున్న మోదీ... రాహుల్‌ ను నిజంగానే విష‌యం తెలియ‌ని నేత‌గా చూపించేస్తున్నారు.

ఇక చివ‌రిది ... ఐదో అంశం విష‌యానికి వ‌స్తే... బీజేపీలోని ప్ర‌తి ఒక్క‌రు కూడా ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్లుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు, ఆ మాట‌కు వ‌స్తే... కాంగ్రెస్ పార్టీలోని నేత‌ల్లో మెజారిటీ వారంతా ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్లే. మ‌రి రాహుల్ విష‌యం ఏంటని అడిగితే... ఆయ‌నో పార్ట్ టైం పొలిటీషియ‌న్ అనే స‌మాధానం వ‌స్తోంది. ఈ మాట‌ను జనంలోకి తీసుకెళ్ల‌డంలో బీజేపీ ఎప్పుడో విజ‌యం సాధించేసింది. మీడియా ముందుకు వ‌స్తున్న ప్ర‌తి బీజేపీ నేతా... ఈ విష‌యంపై ఫోక‌స్ చేయ‌డం మాత్రం మ‌రువ‌డం లేద‌ట‌. మ‌రి ఇన్నిఅంశాల‌ను విపులంగా ప‌రిశీలించిన మీద‌ట కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేత‌గా రాణిస్తారా? అంటే... డౌటేన‌న్న మాటే వినిపిస్తోంది. మ‌రి రాహుల్ డౌటే అయితే... రెండోసారీ ప్ర‌ధాని మోదీనే క‌దా.
Tags:    

Similar News