నోట్ల‌రద్దు..సూప‌ర్ ఎమ‌ర్జెన్సీ ఒక్క‌టే

Update: 2016-12-27 13:38 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై ఇన్నాళ్లు గ‌రంగ‌రంగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒక్క‌తాటిపైకి వ‌చ్చాయి.  ప‌్ర‌ధాని మోడీ తీసుకున్న నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా మండిప‌డుతూ... స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన‌ అతిపెద్ద స్కాంగా దీనిని అభివ‌ర్ణించాయి. ఢిల్లీలోని కాన్‌ స్టిట్యూష‌న్ క్ల‌బ్ భ‌వ‌నంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు స‌మావేశ‌మై నోట్ల ర‌ద్దుపై చ‌ర్చించాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ - తృణమూల్ కాంగ్రెస్ - ఆర్జేడీ - జేడీఎస్ నేతలు హాజరయ్యారు. దీనికి కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నాయ‌క‌త్వం వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ నోట్ల ర‌ద్దు ఉద్దేశం ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని, డిసెంబ‌ర్ 30 స‌మీపిస్తున్నా ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు లేద‌ని అన్నారు. నోట్ల ర‌ద్దు వెన‌క అస‌లు ఉద్దేశం ఏంటో మోడీ ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని, దాని వ‌ల్ల ప్ర‌భావిత‌మైన వారికి స‌మాధానమివ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. స‌హారా - బిర్లా ముడుపుల అంశాన్ని లేవ‌నెత్తుతూ.. అవినీతిపై యుద్ధం చేస్తున్నాన‌న్న ప్ర‌ధాని.. త‌న‌పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్ప‌డం లేద‌ని రాహుల్ విమ‌ర్శించారు. నోట్ల ర‌ద్దు అవినీతిని పెంచింద‌ని చెప్పారు.  ఇక నోట్ల ర‌ద్దును మెగా స్కాంగా అభివ‌ర్ణించిన తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. ప్ర‌తిప‌క్షాల నేత‌లంద‌రం క‌లిసి కామ‌న్ మినిమ‌మ్ ఎజెండా కార్య‌క్ర‌మం రూపొందిస్తామ‌ని చెప్పారు. క్యాష్‌ లెస్ అంటూ మోడీ ప్ర‌భుత్వం బేస్‌ లెస్‌ - ఫేస్‌ లెస్‌ గా మారిపోయింద‌ని మ‌మ‌తా విరుచుకుప‌డ్డారు. ప్ర‌ధాని చెప్పిన అచ్చే దిన్ ఇవేనా అని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని చెప్పిన గ‌డువుకు ఇంకా మూడు రోజులే మిగిలుంద‌ని.. ఇప్పటికే దేశం 20 ఏళ్లు వెన‌క్కి వెళ్లింద‌ని మ‌మ‌తా అన్నారు. వాళ్ల‌కు న‌చ్చిన ప‌ని చేస్తున్నార‌ని, ఫెడ‌ర‌ల్ స్ఫూర్తిని పూర్తిగా దెబ్బ‌తీశార‌ని ఆరోపించారు. ఇది ఎమ‌ర్జెన్సీ కాదు.. సూప‌ర్ ఎమ‌ర్జెన్సీ అని మ‌మ‌తా స్ప‌ష్టంచేశారు. ప‌రిస్థితులు మెరుగుప‌డ‌క‌పోతే.. మోడీ దిగిపోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News