బబ్బ‌రూ!.. ఇవేం వ్యాఖ్య‌లండీ బాబూ!

Update: 2019-04-27 16:32 GMT
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు హోరా హోరీగానే సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఘాటు వ్యాఖ్య‌లు కూడా విన‌బ‌డుతున్నాయి. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు ఏ ఒక్క పార్టీ నుంచి మాత్ర‌మో వ‌స్తున్నాయ‌నుకోవ‌డానికి లేదు. అన్ని పార్టీల‌దీ అదే దారి. అస‌లు తాము ప్ర‌స్తావిస్తున్న ప్ర‌త్య‌ర్థులు పురుషులా? మ‌హిళ‌లా? అన్న విష‌యాల‌ను మ‌రిచేసి మాట్లాడి పెంట పెంట చేస్తున్నారు. తాజాగా అదే త‌ర‌హాలో కాంగ్రెస్ పార్టీ నేత‌ - సినీ న‌టుడు రాజ్ బ‌బ్బ‌ర్... తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి - ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని ఉద్దేశించి కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లే చేశారు.

మోదీ కుర్తా కొల‌త‌లు దీదీకి ఎలా తెలిశాయంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న త‌న ప‌రువుతో పాటు పార్టీ ప‌రువును కూడా బ‌జారుకీడ్చార‌న్న వాద‌న వినిపిస్తోంది. బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్‌ కు వ‌చ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌మ‌త త‌మ‌కు ప్ర‌త్య‌ర్థి అయినా... ఏటా త‌న‌కు స్వీట్లు - కుర్తాలు పంపిస్తుంటార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్య‌ల్లో రాజ‌కీయ వైరం మిన‌హా మ‌రేమీ లేద‌నే చెప్పాలి. అయితే ఇప్పుడు రాజ్ బ‌బ్బ‌ర్ ఆ వ్యాఖ్య‌ల‌ను ఆధారం చేసుకుని దీదీని కించ‌ప‌రిచేలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీతో అంత‌గా వైర‌మేమీ లేకుండానే సాగుతున్న దీదీ ప‌ట్ల బ‌బ్బ‌ర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను క‌ల‌క‌ల‌మే రేపుతున్నాయి.

అయినా బ‌బ్బ‌ర్ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *ప‌శ్చిమ బెంగాల్ స్వీట్లు - కుర్తాల‌కు ఫేమ‌స్ క‌దా. అయితే దీదీ ఇప్ప‌టిదాకా ఆ రెంటినీ త‌మ‌కు గానీ - మ‌రెవ‌రికి గానీ కానుక‌లుగా పంపించ‌లేదు. ఎవ‌రికైనా వీటిని ఆమె ఒక్క మోదీకి మాత్ర‌మే పంపుతున్నారు. మోదీ కుర్తా కొల‌త‌లు తెలిస్తేనే క‌దా ఆయ‌న‌కు దీదీ కుర్తాలు పంపుతారు* అంటూ బ‌బ్బ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ మ‌హిళా నేత అని కూడా చూడ‌కుండా బ‌బ్బ‌ర్ త‌న నోటికి వ‌చ్చిన‌ట్టుగా చేసిన ఈ వ్యాఖ్య‌లు పెను దుమారాన్నే రేపేలా క‌నిపిస్తున్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.


Tags:    

Similar News