ఆ ఎమ్మెల్యే అంత రేటు పలికారా?

Update: 2016-03-13 10:33 GMT
విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే... దాన్ని ఆయన ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా టీడీపీ తనను డబ్బుతో కొనాలని ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.

జీసీసీలో ఉద్యోగిగా పనిచేసిన పీడిక రాజన్నదొర ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీలో చేరి మళ్లీ గెలిచారు. అయితే... ఇటీవల టీడీపీ ఆపరేషన్ ఆకర్షలో భాగంగా ఆయన టీడీపీ గూటికి చేరుతారని ప్రచారం జరిగింది. ఇప్పుడాయన తనకు ఎవరు ఎంత ఆఫర్ చేసిందీ చెప్పడంతో కథకు ఎక్కడో అడ్డం తిరిగిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

టీడీపీ నాయకులు తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆయన చెప్పారు. తొలుత రూ.5 కోట్లు ఇస్తామని చెప్పిన టీడీపీ నేతలు అనంతరం ఆ రేటును మరింత పెంచారని వెల్లడించారు. రూ. 5 కోట్లకు తాను స్పందించకపోయే సరికి రూ. 15 కోట్లతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు టీడీపీ నేతలు సిద్ధమన్నారని రాజన్నదొర చెప్పారు. ఆఖరికి రూ. 30 కోట్లు ఇచ్చేందుకు టీడీపీ నేతలు ముందుకొచ్చారని వెల్లడించారు. అయితే తాను లొంగలేదని వివరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాలూరులో కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రలోభాలకు లొంగి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందని వివరించారాయన. అధికార పార్టీలో ఇమడలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు. రాజన్న దొర నిజంగా డబ్బుకు లొంగకపోవడం గొప్ప విషయమే కాగా కొందరు మాత్రం రూ.30 కోట్ల కంటే ఆయన ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని... పైగా మంత్రి పదవి కూడా అడగడంతో టీడీపీ దానికి అంగీకరించలేదని... అక్కడే డీల్ తేడాకొట్టిందని స్థానిక టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.
Tags:    

Similar News