నుపుర్ శ‌ర్మ త‌ల తెస్తే ఆస్తి ఇస్తా.. వీడియో వైర‌ల్

Update: 2022-07-05 03:46 GMT
బీజేపీ బ‌హిష్కృత నేత నుపుర్ శ‌ర్మ ఒక టీవీ డిబేట్ లో మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాడ‌ని రాజ‌స్థాన్ లోని ఉద‌యపూర్ లో కొద్ది రోజుల క్రితం ఒక టైల‌ర్ క‌న్హ‌య్య‌లాల్ ను ప‌ట్ట‌ప‌గ‌లే అత‌డి షాపులోనే ఇద్దరు కిరాత‌కంగా హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని సైతం చంపుతామ‌ని బెదిరించారు.

దీంతో ఉద‌యపూర్ లో హింస చెల‌రేగింది. పోలీసులు క‌ర్ఫ్యూ విధించడంతోపాటు 144 సెక్ష‌న్ విధించారు. అలాగే ఇంట‌ర్నెట్ రాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు. భారీ ఎత్తున పోలీసుల‌ను రంగంలోకి దించారు. ఈ హ‌త్య‌ను ప‌లు ముస్లిం సంస్థ‌ల‌తో స‌హా హిందూ సంస్థ‌లు ఖండించాయి.

ఇప్ప‌టికీ నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌పై ముస్లింల ఆగ్రహం చ‌ల్లార‌డం లేదు. త‌న‌పై వ‌స్తున్న బెదిరింపుల నేప‌థ్యంలో ఇటీవ‌లే నుపుర్‌ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. త‌న వ్యాఖ్య‌ల‌పై దేశ‌వ్యాప్తంగా న‌మోదైన ఫిర్యాదుల‌న్నింటిని విచార‌ణ కోసం ఢిల్లీకి బ‌దిలీ చేయాల‌ని ఆమె విన్న‌వించారు. మ‌రోవైపు ఇప్ప‌టికీ త‌న‌ను, త‌న కుటుంబ స‌భ్యుల‌ను చంపుతామ‌ని బెదిరిస్తున్నార‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

కాగా ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల వ‌ల్లే రాజ‌స్థాన్ లోని ఉద‌య‌పూర్ లో టైల‌ర్ ను దుండ‌గులు హ‌త్య చేశార‌ని పేర్కొంది. ఇప్ప‌టికైనా నుపుర్ శ‌ర్మ దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆదేశించింది.

మ‌రోవైపు మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మపై తాజాగా రాజస్థాన్ కు చెందిన‌ వ్యక్తి ఒక‌రు వివాదాస్పద వీడియో విడుదల చేశారు. నుపుర్ శర్మ తల నరికి చంపిన వారికి తన ఇల్లు, ఆస్తులను బహుమతిగా ఇస్తానని రాజస్థాన్‌ లోని అజ్మేర్‌కు చెందిన ఓ వ్యక్తి వివాదాస్పద వీడియోను విడుదల చేశాడు.

ఈ వివాదాస్పద వీడియోను విడుదల చేసిన వ్యక్తిని సల్మాన్ చిస్తీగా పోలీసులు గుర్తించారు. వీడియో వైరల్ అయిన తర్వాత అదనపు పోలీసు సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ తనకు ఈ వీడియో వాట్సాప్ ద్వారా అందిందని తెలిపారు. నిందితుడు సల్మాన్ చిస్తీ దర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్నాడని, అతడిని త్వరలో అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Full View

Tags:    

Similar News