ఏపీ లేఖలను చెత్తబుట్టలో పడేయండి

Update: 2016-06-25 11:38 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసే లేఖలను ఏమాత్ర పట్టించుకోవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం తన అధికారులను ఆదేశించింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేరుగా పదవ షెడ్యూల్ సంస్థల అధిపతులకు లేఖలు రాసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.  ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) రాజీవ్ శర్మ పదవ షెడ్యూల్‌ లోని కార్యాలయాల అధిపతులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆస్తులు - అప్పుల వివరాలు తెలియజేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖలకు స్పందించవద్దని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాస్తున్న లేఖలను అసలు పట్టించుకోవలసిన అవసరం లేదంటూ రాజీవ్ శర్మ 126 షెడ్యూల్ 10 సంస్థల అధిపతులకు సర్క్యులర్ జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి కొన్ని సంస్థలకు లేఖలు వచ్చిన సంగతి తమ దృష్టికి వచ్చిందని సిఎస్ తెలిపారు. ఆయా సంస్థలకు నేరుగా లేఖలు రాయడం సమంజసం కాదని సిఎస్ పేర్కొన్నారు.

ఇప్పటికే కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి - డిండి ప్రాజెక్టుల విషయంపై ఇరు రాష్ట్రాలు పరస్పరం మాటల దాడిని కొనసాగిస్తున్నాయి. తాజాగా విభజన చట్టంలోని పదో షెడ్యూల్ సంస్థలకు చెందిన ఆస్తులపైనా ఏపీ లేఖలను చించి పడేయండన్నట్లుగా తెలంగాణ సీఎస్ సూచనలివ్వడంతో వివాదం ముదురుతోంది.  9 - 10వ షెడ్యూళ్ల కింద ఉన్న సంస్థలు ఇరు రాష్ట్రాలకు చెందినవేనని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కాస్తంత ఊపిరి పీల్చుకున్న ఏపీ సర్కారు ఆ సంస్థల్లోని తన వాటాని చేజిక్కించుకునేందుకు రంగంలోకి దిగింది. ఆ నేపథ్యంలోనే కొన్ని శాఖలకు లేఖలు రాసింది.  ఆ సంస్థల్లోని నిధులు - ఇతర వివరాలు కోరుతూ తెలంగాణ సర్కారుకు - ఆయా సంస్థల అధిపతులకు లేఖలు రాసింది. ఈ లేఖలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను కూడా చంద్రబాబు సర్కారు జత చేసింది. అయితే ఈ లేఖలను తెలంగాణ సర్కారు తప్పుబడుతూ ఏమాత్రం పట్టించుకోవద్దని చెప్పడంతో కయ్యానికి కాలు దువ్వినట్లయింది.
Tags:    

Similar News