నదుల అనుసంధానం పై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా సంచలన వ్యాఖ్యలు

Update: 2022-02-16 06:31 GMT
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదలు కొని.. పలువురు ముఖ్యమంత్రులత్ పాటు  ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లు తరచూ ప్రస్తావించే ‘నదుల అనుసంధానం’పై సంచలన వ్యాఖ్యలు చేశారు వాటర్ మ్యాన్  ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన  రాజేంద్రసింగ్. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చను తెర మీదకు తీసుకొచ్చాయి. నదుల అనుసంధానం పేరు వెనుక అసలు కారణం వేరే ఉందంటూ ఆయన కొత్త అంశాలను ప్రస్తావిస్తున్నారు.

రాష్ట్రాలకు నీళ్లపై.. నదులపై ఉన్న హక్కుల్ని లాక్కొని బడా వర్గాలకు కట్టబెట్టటమే నదుల అనుసంధానం అసలు ఉద్దేశమన్నారు. నదులపై రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన పలు అంశాల్ని వెల్లడించారు. ఏడా వేస్టుగా సముద్రంలో కలిసే నీటిని ప్రాజెక్టుల ద్వారా.. తరలించటం వల్ల ప్రయోజనం చేకూరుతుందన్న వాదనలో తప్పు ఉందన్నది ఆయన వాదన.

గోదావరి నుంచి ప్రతి ఏడాది మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతుంటాయని.. కావేరీ నీటి కొరతను తీర్చటానికి నదుల అనుసంధానం సాయం చేస్తుందన్న ప్రతిపాదనను ఆయన తప్పు పట్టారు. నదుల అనుసంధానం చేపడితే ఇప్పటికే ఉన్న నదులన్నీ దెబ్బ తింటాయని.. నదులపై రాష్ట్రాలకు ఉన్న హక్కుల్ని కాలరాయటమే ఈ పథకం లక్ష్యంగా ఆయన వ్యాఖ్యానించారు.

అనుసంధానంతో నదుల సహజత్వం దెబ్బ తింటుందని.. ఎక్కడికక్కడ నీటి వనరులను కాపాడుకుంటూనే భూగర్భ జలాల్ని పెంచుకునే ప్రయత్నం చేయాలన్నారు. కావేరి బేసిన్ లో నీటి కొరతకు కారణం.. అక్కడ పండించే వాణిజ్య పంటేనని చెప్పారు. ఒక టీఎంసీ నీటితో తెలంగాణలో 12 వేల ఎకరాలు సాగు అవుతుంటే.. కావేరీ పరివాహక ప్రాంతాల్లో అదే టీఎంసీ నీటితో కేవలం మూడు వేల ఎకరాలు మాత్రమే సాగు అవుతున్నట్లు పేర్కొన్నారు.

నదుల అనుసంధానం వద్దని తాను మొదటి నుంచి వాదిస్తున్నాని.. ఈ విధానంతో సామాజిక.. ఆర్థిక.. సాంస్కతిక అంతరాలు ఏర్పడి దేశం సంక్షోభంలోకి వెళుతుందన్నారు. నీటి ప్రైవేటీకరణలో భాగమే నదుల అనుసంధానం ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు. నీళ్లు అవసరమే కానీ అత్యాశ పనికి రాదన్న ఆయన.. ‘గంగమ్మ ఆదాయంగా మారకూడదు. గంగానది 11 రాష్ట్రాల్లో.. పలు దేశాల్లో ప్రవహిస్తుంది. గంగానది అనుసంధానం ప్రతిపాదించినా జరగలేదు.రాజస్థాన్ లో తక్కువ వర్షపాతం ఉంది. అక్కడ 12 నదుల పునరుజ్జీవనం చేశాం. అలాంటివే దేశం మొత్తం జరగాలి’ అని పేర్కొన్నారు.

తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల గురించి ఆయన అభిప్రాయాన్ని కోరినప్పుడు.. తాను పెద్ద ప్రాజెక్టులకు వ్యతిరేకమన్నారు. గోదావరి నదిని 200 కిలోమీటర్ల మేర పునరుజ్జీవనం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును చూసినప్పుడు ఆనందం కలిగిందన్నారు.  దేశానికి ఆదర్శంగా నిలిచేలా వాటర్ యూనివర్సిటీని తెలంగాణలో ఏర్పాటు చేయాలన్నఆయన.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ వాటర్ యూనివర్సిటీ లేదన్నారు.

నీటి అవసరాన్ని.. ప్రాధాన్యాన్ని భావితరాలకు తెలిపేలా పరిశోధనలు జరగాలన్నారు. హరితహారం.. ఇంటింటికీ నీరిచ్చే మిషన్ భగీరథ.. చెరువుల పునరుద్ధరణ చేపట్టిన మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాల నేపథ్యంలోనే తమ సదస్సుకు హైదరాబాద్ ను ఎంచుకున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ కు తప్పక ఆనందాన్ని కలిగించటమే కాదు.. ప్రస్తుతం జాతీయ రాజకీయాల మీద గురి పెట్టిన వేళ ఇచ్చిన కితాబును రానున్న రోజుల్లో ప్రస్తావించటం ఖాయం.

Tags:    

Similar News