సరిలేరు మీకెవ్వరు...!

Update: 2019-11-21 08:59 GMT
వారిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల అవుతున్నాయి అంటే ..బరిలో ఎవరున్నా కూడా తప్పుకోవాల్సిందే ..లేకపోతే ఆ సునామి ముందు మునిగిపోవాల్సిందే. ఈ విషయం చాలా సందర్భాలలో నిరూపితమైంది. ఒకరు లోకనాయకుడు ..మరొకరు స్టైల్ కి రారాజు. వయస్సు పెరిగేకొద్దీ అందరికి అలుపొస్తే .. వీరికి మాత్రం ఊపొస్తుంది. నటనలో వీరికి మించినవారు లేరు అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు లోక నాయకుడు కమల్ హాసన్ కాగా - మరొక సారు సూపర్ స్టార్ రజినీకాంత్. 

వీరిద్దరూ ఇప్పటికి సినిమాలలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే కమల్ - రజిని మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. నాలుగు దశబ్దాలుగా స్నేహానికే పరిమితమైన ఈ ఇద్దరు ఇప్పుడు రాజకీయంగా ఒకే గూటికి చేరబోతున్నారు. ప్రజల కోసం కలిసి పని చేసేందుకు సిద్ధమని కమల్ - రజనీ చేసిన కామెంట్లు తమిళనాడు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే - డీఎంకే లని మట్టి కరిపించేందుకు సరికొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

1996 నాటి ఎన్నికల సమయంలో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజనీకాంత్‌ చేసిన  సంచలన వ్యాఖ్యలు ..ఒక్కసారిగా  రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు కారణం అయిన విషయం తెలిసిందే. రజిని మాటలకి తమిళ ప్రజలు ఆ ఎన్నికలలో అన్నాడీఎంకే కి చుక్కలు చూపించారు. ఆ సమయంలో  ఇక రజనీ రాజకీయం ప్రవేశం  ఖాయమే అని  అందరూ అంచనా వేశారు. కానీ - ఆలా జరగలేదు. 2017 డిశంబరు  31వ తేదీన చెన్నై కోడంబాక్కంలో రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానుల సమక్షంలో 'నాన్‌ అరసియల్‌ కు వరువదు ఉరుది’ (నేను రాజకీయాల్లో రావడం ఖాయం) అంటూ   ప్రకటించారు. కానీ , ఆ మాట చెప్పి చాలా రోజులు కావొస్తున్నా కూడా రజిని పూర్తిగా రాజకీయాలలోకి రాలేదు.

రాజకీయాల జోలికే రాకుండా సినిమాలకు పరిమితమైన కమల్‌ హాసన్‌ అకస్మాత్తుగా రాజకీయ ప్రవేశం చేసి మక్కల్‌ నీది మయ్యం పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలలో పార్టీ తరపున ఎవరు గెలవనప్పటికీ భారీ స్థాయిలో ఓట్లు పడ్డాయి. దీనితో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, కమల్‌ హాసన్‌ జన్మదిన వేడుకల్లో రజనీ ఉత్సాహంగా పాల్గొన్నారు. రజనీ - కమల్‌ లు రాజకీయ అజ్ఞానులని సీఎం ఎడపాడి ఇటీవల ఒక సభలో చేసిన విమర్శలకు ఈ నెల 17వ తేదీన జరిగిన కమల్‌ జన్మదిన సభలో రజనీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి అవుతానని ఎడపాడి ఏనాడైనా  కలగన్నారా.. అలానే వచ్చే రోజుల్లో ఏమైనా జరగొచ్చు అని చెప్పుకొచ్చారు.   ఇద్దరు కలిసి నడుస్తాం అని ప్రకటించడంతో ఈ  ప్రకటన రాజకీయాల్లో కొత్త చర్చకు తెరదీసింది. ఇద్దరూ వేర్వేరు పార్టీలతో కలిసి పనిచేస్తారా - కమల్‌ పార్టీలో రజనీ చేరుతారా - ఇద్దరూ కలిస్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? ఇలా అనేక కోణాల్లో రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరు కలిస్తే సరిలేరు మీకెవ్వరు అనాల్సిందే..


Tags:    

Similar News