రజినీ సార్.. ఇలా అయితే ఎలా నెట్టుకొస్తారు?

Update: 2017-07-05 07:53 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ తెరమీద హీరోయిజాన్ని ఓ రేంజిలో పండిస్తారు. చాలా అగ్రెసివ్ గా కనిపిస్తారు. ఎంతటి వాళ్లనైనా ఢీకొంటారు. మెడలు వంచుతారు. కానీ నిజ జీవితంలో మాత్రం చాలా సాత్వికంగా కనిపిస్తారు. వినమ్రత ప్రదర్శిస్తారు. ఎవ్వరినీ నొప్పించాలని అనుకోరు. ఐతే తెర మీద ఉన్నట్లే నిజ జీవితంలో ఉండాలని ఎవ్వరూ కోరుకోరు. అది సాధ్యం కాదు కూడా. కానీ అవసరానికి తగ్గట్లుగా అప్పుడప్పుడూ దూకుడు చూపించడమూ అవసరమే. కొన్నిసార్లు పోరాట ధోరణి కూడా అవవర్చుకోవాలి. అందులోనూ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలని అనుకున్నపుడు కూడా సాత్వికంగా.. వినమ్రంగా ఉండాలని.. డిప్లమాటిగ్గా వ్యవహరించాలని చూస్తే జనాలకు సరైన ఇండికేషన్ వెళ్లదు.

ఇంకొన్ని నెలల్లోనే రజినీ రాజకీయారంగేట్రం చేయాలనుకుంటున్న సంగతి ఖరారైపోయింది. ఈ విషయంలో ఎవరికీ సందేహాల్లేవు. రజినీకి అలాంటి ఉద్దేశాలున్నపుడు దానికి తగ్గట్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం.. కొంచెం దూకుడు పెంచడం అవసరం. ప్రస్తుతం జీఎస్టీ విషయంలో తమిళ సినీ పరిశ్రమ ఎంత వ్యతిరేకత చూపిస్తోందో.. ఎంత దూకుడుగా వ్యవహరిస్తోందో తెలిసిందే. అక్కడ తీవ్ర స్థాయి ఆందోళనకు సిద్ధమవుతున్నారందరూ. ఇలాంటి సమయంలో రజినీ మౌనం గురించి టి.రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీకెందుకు రాజకీయాలంటూ దుమ్మెత్తిపోశాడు. ఆ తర్వాతైనా రజినీలో చురుకుదనం రావాలి కదా. కానీ ఆయనేం చేశారో చూడండి. దయచేసి జీఎస్టీ విషయంలో మా విన్నపాన్ని మన్నించండి అంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నట్లుగా ఒక ట్వీట్ పెట్టారు. ఇలాంటి సందర్భాల్ని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని నిలదీయడం.. డిమాండ్ చేయడం లాంటివి చేస్తే రజినీ ఇమేజ్ పెరిగేది. కానీ ఆయన మాత్రం తమిళనాట బలహీనంగా ఉన్న ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్లుగా ట్వీట్ పెట్టి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలా సుతి మెత్తని తీరుతో రాజకీయాల్లో రజినీ ఎలా నెట్టుకొద్దామని అనుకుంటున్నారో ఏమిటో?


Tags:    

Similar News