తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ తన పొలిటికల్ జర్నీపై పూర్తి స్పష్టతతో ఉన్నట్లుగా కొద్దికాలం క్రితం వరకు ప్రకటనలు చేసినప్పటికీ...మునుపటి క్లారిటీ ఆయనలో లోపించిందా? పొలిటికల్ జర్నీ గురించి ఆశించిన స్థాయిలో దూకుడు కనిపించకపోవడం వెనుక వ్యూహం ఉందా లేదా పరిస్థితులే కారణమా? ఇది ప్రస్తుతం తమిళనాడు రాజకీయవర్గాల్లో చర్చనీయమైన అంశాలు. ఇప్పటికే పార్టీ పరమైన బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌లో బిజీగా ఉన్న రజనీ తమిళనాడు అసెంబ్లీకి ఆర్నెల్లలో ఎన్నికలు వచ్చినా తాను ఆ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజకీయ పార్టీ ప్రకటన జాప్యం అవడం కొత్త సందేహాలకు, చర్చకు తావిస్తోంది.
మక్కల్ మన్రం అనే వేదికను రజనీకాంత్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వ్యవస్థలోని తప్పిదాలను సరి చేసేందుకు తాను స్థాపించే రాజకీయ పార్టీ సహాయకారిగా ఉంటుందని రజనీకాంత్ అన్నారు. `జాతీయోద్యమం నుంచి ఇప్పటి వరకు తమిళనాడు పలు పోరాటాల్లో ముందు వరుసలో నిలిచింది. మరోసారి మనం అదే పరిస్థితిలో ఉన్నాం. రాజకీయ విప్లవం రావాల్సిన అవసరం ఉంది` అని అన్నారు. తన రాజకీయ పార్టీకి సంబంధించి అభిమానుల కోసం మొబైల్ యాప్ - వెబ్ సైట్ - ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల్లో రాజకీయ విప్లవం రావాల్సిన అవసరం ఉన్నదని రజనీకాంత్ పేర్కొన్నారు. ఏప్రిల్ 14(శనివారం)న పార్టీ పేరు వెలువడుతుందని.. ఆ రోజునే భారీ ఎత్తున సభ జరుగుతుందని రజనీకాంత్ సన్నిహిత వర్గాలు ప్రచారం చేశాయి.
అయితే అలాంటిదేమీ జరగకపోవడంతో తలైవా పొలిటికల్ ఎంట్రీపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడు ప్రజలు కావేరి జలాల కోసం తీవ్రంగా ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చెన్నై ఐపీఎల్ మ్యాచ్లను సైతం అడ్డుకున్నారు. ఈ క్రమంలో కావేరి వివాదం, ఇంకా అనేక అంశాలపై ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న తరుణంలో పార్టీ ఏర్పాటుకు ఇది సరైన సమయం కాదని మక్కల్ మన్రం ఇన్‌చార్జ్‌లు రజనీకి సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో పార్టీ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోందని సమాచారం. నూతన సంవత్సరానికి కొన్ని గంటల ముందు రాజకీయ పార్టీని ప్రకటించి, త్వరలో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ఫ్యాన్స్ నిరీక్షణకు ఎప్పుడు తెరదించుతారో వేచిచూడాల్సిందే.