అక్కడికి వెళ్లొచ్చాకే రజినీ నిర్ణయం..

Update: 2017-10-10 10:52 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతోంది. ఐతే రజినీ ఈ విషయంలో చంచల మనస్తత్వంతో ఉన్నట్లుగా కనిపించింది. ఐతే ఇప్పుడు ఆయన రాజకీయారంగేట్రం పట్ల కొంచెం సుముఖంగానే ఉన్నట్లుగా సంకేతాలిచ్చారు. కొన్ని నెలల కిందటే రాజకీయ పార్టీని మొదలుపెట్టేలా కనిపించారు. కానీ తర్వాత కొంచెం వెనక్కి తగ్గారు. తన సమకాలీనుడైన కమల్ హాసన్ సైతం రాజకీయారంగేట్రానికి సిద్ధమవడంతో రజినీ పునరాలోచనలో పడ్డట్లుగా వార్తలొచ్చాయి. ఐతే అభిమానులేమో రజినీ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తాడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రజినీ ఏదో ఒక నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాల్సిన స్థితి ఉన్నాడు.

ఐతే తన జీవితంలో ఏ ముఖ్యమైన నిర్ణయం అయినా తీసుకోవడానికి ముందు రజినీకి హిమాలయాల పర్యటన చేయడం అలవాటు. ఇప్పుడు కూడా ఆయన అదే బాటలో సాగబోతున్నట్లు సమాచారం. తన కొత్త సినిమా ‘కాలా’ షూటింగ్ ను త్వరలోనే ముగించి రజినీ హిమాలయాలకు వెళ్లబోతున్నారట. అక్కడ కొన్ని రోజుల పాట ప్రశాంతంగా గడిపి.. ధ్యానం చేసి.. ఆ తర్వాత తన రాజకీయ అరంగేట్రంపై ఓ నిర్ణయానికి వస్తారట రజినీ. కాబట్టి ఇంకో నెల రోజుల తర్వాత కానీ రజినీ భవిష్యత్ పై ఏ నిర్ణయం వెలువడకపోవచ్చు. హిమాలయాలకు వెళ్లడం రజినీకి ఎప్పట్నుంచో అలవాటు. అక్కడ రజినీ ఇటీవలే భూమి కూడా కొన్నారట. అది ఆయన పేరిట రిజిస్టర్ కూడా అయిందట. అక్కడ సాధువుల కోసం ఆశ్రమం నిర్మించి వాళ్లకు అన్ని సౌకర్యాలూ కల్పించాలని రజినీ యోచిస్తున్నట్లు సమాచారం.
Tags:    

Similar News