క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌ను...ర‌జ‌నీకాంత్ మొండిప‌ట్టు

Update: 2020-01-21 13:47 GMT
సినీనటుడు రజనీకాంత్ ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. జనవరి 14న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ‘తుగ్లక్’ అనే పత్రికా సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకలకు రజనీ హాజరయ్యారు. అక్కడి ప్రసంగంలో 1971లో ద్రావిడ ఇయక్కం నాస్తికుడు తందై పెరియార్‌ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని అన్నారు. ఈ వ్యాఖ్యలను తప్పు పడుతూ ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ అధ్యక్షుడు మణి ఈ నెల 17 న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రజనీకాంత్‌ వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని - క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని అన్నారు.

తాను విన్నది - పత్రికల్లో వచ్చిందే చెప్పానని ర‌జ‌నీకాంత్ పున‌రుద్ఘాటించారు. తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని అన్నారు. ‘నాపై ఎవరెన్ని కేసులు పెట్టినా నేను సారీ చెప్పను. నేనేమీ కల్పించి మాట్లాడలేదు. మీడియాలో ఏం రాశారో వాటి గురించే మాట్లాడాను. కావాలంటే ఆధారాలు చూపిస్తాను’ అన్నారు. కాగా, ర‌జ‌నీకాంత్ కామెంట్ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  డీఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ... పెరియార్ వంటి వ్యక్తుల గురించి మాట్లాడే ముందు రజనీకాంత్ ఓసారి ఆలోచించాలని అన్నారు. ``నా స్నేహితుడు రజనీకాంత్ రాజకీయ నాయకుడు కాదు, అతను నటుడు. పెరియార్ వంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు, ఆలోచించి, ఆపై మాట్లాడాలని నేను అతనిని కోరుతున్నాను” అని స్టాలిన్ అన్నారు.

కాగా, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ర‌జ‌నీకాంత్‌ కు ఊహించిన ఆఫ‌ర్ ఇచ్చారు. ``‘తుగ్లక్’ అనే మ్యాగజైన్‌లో చో రామస్వామి పెరియార్ గురించి పబ్లిష్ చేశారు. నేను రజినీకాంత్‌ తరఫున మాట్లాడటంలేదు కానీ.. ఆయన పెరియార్ గురించి ఏం చెప్పారో అదంతా నిజమే. రజినీకాంత్ ఇదే మాటపై నిలబడితే.. న్యాయస్థానంలో ఆయన తరఫున నేను వాదిస్తాను’ అని తెలిపారు.



Tags:    

Similar News