మోడీకి బిహార్‌ లో పొగ‌పెడ్తున్నారు

Update: 2015-09-26 16:44 GMT
బిహార్ ఎన్నిక‌లు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. ఈ ఎన్నిక‌లు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి ప‌రువు కూడిన స‌మ‌స్య‌గా.....ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి స‌వాల్ గా ప‌రిణ‌మిస్తున్న స‌మ‌యంలో మ‌రో ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి ఎదురైంది. త్వరలో జరుగనున్న బిహార్‌ అసెంబ్లి ఎన్నికల్లో తమ పార్టీవారే డబ్బులు తీసుకుని మరీ టిక్కెట్లు ఇస్తున్నారని బీజేపీ ఎంపీ ఆర్‌ కె సింగ్‌ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీకోసం అంకితభావంతో పనిచేస్తున్నవారిని విస్మరించి నేరస్తులకు, నాయ‌కుల‌ బంధువులకు, డబ్బులు ఇచ్చేవారికి టిక్కెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. నిజమైన అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించి  బీజేపీ రాష్ట్ర కేడర్ క్రిమినల్స్‌ కు పార్టీ టికెట్లు కట్టబెడుతోందని దుయ్య‌బ‌ట్టారు. ఈ విషయంలో బీజేపీకి, ప్ర‌తిప‌క్ష ఆర్జేడీకి తేడా ఏముంద‌ని ఆయన ప్రశ్నించారు. క్రిమినల్స్‌ కు టికెట్లు కేటాయించి బిహార్ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని బీజేపీ కోల్పోతోందని ఆయన విమర్శించారు. టికెట్ల విష‌యంలో ఆర్జేడీకి-బీజేపీకి తేడా ఏమీ లేన‌పుడు బీజేపీకి ప్ర‌జ‌లు ఎందుకు మ‌ద్ద‌తు ఇస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. టికెట్ల విషయంలో పార్టీ కార్యకర్తలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారన్నారు.

కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అయిన సింగ్‌ 2014లో బీజేపీలో చేరారు. మూడు దశాబ్దాలుగా నిజాయితీ పనిచేసిన సింగ్‌ గత లోక్‌సభ ఎన్నికల్లో అరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఎంపీ ఆర్కే సింగ్ ఆరోపణలను కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ఖండించారు. టికెట్ల కేటాయింపు సజావుగానే జరుగుతోందని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.ఇప్ప‌టికే బిహార్ ఎన్నిక‌లు కేంద్రంగా ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాల‌న్నీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని ఇరుకున పెడ్తుండ‌గా... సొంత పార్టీ ఎంపీ ఆర్కే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయ‌డం ఆజ్యం పోసిన‌ట్ల‌యింది. ఈ స్వ‌ప‌క్ష ఆరోప‌ణ‌ల‌ను మోడీ ఎలా ఎదుర్కుంటారో చూడాలి మ‌రి.
Tags:    

Similar News