రాజ్యసభ రేసు: కేసీఆర్ మదిలో వీరిద్దరే?

Update: 2020-02-21 09:45 GMT
తెలంగాణలో ఏప్రిల్ 9న రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యసభ సీట్లు పొందిన గరికపాటి, కేకేతోపాటు కేవీపీ, ఎంఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డి, తోట సీతారామ లక్ష్మీలు దిగిపోతున్నారు. ఏపీ విభజన కావడంతో లాటరీ విధానంలో గరికపాటి, కేవీపీలు మినహా మిగతా నలుగురిని ఏపీకి కేటాయించారు. తెలంగాణ కోటాకు రెండు సీట్లు ఇచ్చారు.

తెలంగాణ కోటాలో ఖాళీ అయ్యే రెండు స్థానాలు అధికార టీఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమే.. మరీ వీరి స్థానాల్లో గులాబీ దళపతి ఎవరిని భర్తీ చేస్తారనే ఊహాగానాలకు దాదాపుగా తెరపడినట్టేనని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. పెద్దల సభకు పోవాలని ఇప్పటికే టీఆర్ఎస్ సీనియర్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు.

తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ పెద్దల సభకు ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ కు పెద్ద గురువులా ఉంటున్న కేకేకు ఈసారి కష్టమేనని తెలంగాణ రాష్ట్రసమితి వర్గాల్లో చర్చ సాగుతోంది. కొత్త వారికిస్తారా? పాత వారినే కొనసాగిస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు సీట్లకు గులాబీ బాస్ ఆల్ రెడీ పేర్లను తయారు చేసుకున్నట్టు సమాచారం.

ఈ దఫా కేకేకు చాన్స్ కష్టమేనంటున్నారు. తనకు అవకాశం కల్పించాలని కేకే తమ అధినేత కేసీఆర్ ను కోరుతున్నా ఫెడరల్ ఫ్రంట్ దృష్ట్యా తన సేవలను జాతీయ రాజకీయాలకు వాడుకోవాలని కోరుతున్నారట. కేంద్రంలో సమన్వయం చేసుకునేందుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని అడుగుతున్నాడట.. అయితే కేకేకు ఈసారి అవకాశం ఉండదని ప్రచారం సాగుతోంది. వయోభారంతోపాటు ఇతరులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో కేకేకు రెస్ట్ ఇస్తారని సమాచారం.

కేకేకు బదులు నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు ఈ దఫా రాజ్యసభ సీటు ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ ఈ ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమితో కలత చెందారని.. ఆమెను రాజ్యసభ ఎంపీని చేసి ఊరట చెందించాలని చూస్తున్నారని చెబుతున్నారు. కవిత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతోపాటు పార్టీకి పూర్తిగా దూరమైపోయారు. అందుకే ఆమెను క్రియాశీల రాజకీయాల్లో చరుకుగా ఉంచాలని రాజ్యసభ ఇవ్వడానికి రెడీ అయ్యారట.. కవిత కు వివిధ భాషలపై పట్టు, మాట్లాడే సామర్థ్యం, జాతీయ రాజకీయాలపై అవగాహన దృష్ట్యా ఆమెకు రాజ్యసభ కన్ఫం అని అంటున్నారు.

ఒక సీటు కవితకు పోను మరోసీటుకు భారీ పోటీ ఉంది. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నాయి. నాయిని, మధుసుధనాచారి ఆశిస్తున్నారు. అయితే ఎంపీ టికెట్ ఇవ్వకున్నా పార్టీకి విధేయుడిగా ఉంటూ ఇటీవల ఖమ్మం పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ కోసం పాటుపడి అభ్యర్థులను గెలిపించారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటినే రాజ్యసభకు పంపుతారని సమాచారం. ఇప్పటికే బడుగు బలహీన వర్గాలకు చాలా పదవులు ఇచ్చిన కేసీఆర్ ఈసారి రెండు రాజ్యసభ సీట్లను అగ్రవర్ణాలకు చెందిన కవిత, పొంగులేటి పేర్లను అధికారికంగా ఖాయం చేసినట్టు సమాచారం.
Tags:    

Similar News