రాజ్యసభ సీట్ల కోసం హోరాహోరీ

Update: 2018-02-18 05:36 GMT
రాజ్యసభ ఎన్నికలకు టీడీపీలో ఇప్పటి నుంచే వేడి మొదలయింది. ఇప్పుడున్న బలం ప్రకారం ఆ పార్టీకి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే, మూడో స్థానానికీ టీడీపీ గురిపెట్టడంతో అందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.  ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని మూడోస్థానాన్నీ కొల్లగొట్టాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. దీంతో రాజ్యసభ సీట్ల కోసం కోసం భారీ స్థాయిలోనే పోటీ నెలకొంది. ప్రస్తుతం టీడీపీకి 131 - వైసీపీకి 44 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. కాగా పదవీ కాలం పూర్తి కానున్న సీఎం రమేష్‌ కు ఇప్పటి పరిస్థితి ప్రకారం రెండోసారి పొడిగించే అవకాశాలు కష్టమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
    
ఈనెలాఖరుకు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి నెలాఖరున ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. పక్కాగా గెలిచే రెండు స్థానాల కోసం టీడీపీలో గట్టి పోటీ కనిపిస్తోంది. గత 14 ఏళ్ల నుంచి టీడీఎల్పీని సమన్వయం చేస్తున్న కోనేరు సురేష్ - జూపూడి ప్రభాకర్ - ప్రతిభాభారతి వంటి నేతలు రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఆర్థికమంత్రి, తొలి తరం సీనియర్ నేత - బీసీ వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు - మాదిగ వర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, కమ్మ వర్గానికి చెందిన మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు - రెడ్డి వర్గానికి చెందిన కర్నూలు జిల్లా నేత కొండారెడ్డి రవీంద్రరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
    
యనమల చాలాకాలం నుంచీ ఢిల్లీకి వెళ్లాలని ఆశిస్తున్నారు. సీనియర్లను ఢిల్లీకి పంపించి, రాష్ట్రంలో రెండోతరం నేతలకు అవకాశం ఇవ్వాలని ఆయన గత 15 ఏళ్ల నుంచీ వాదిస్తున్నారు. గతంలో సీఎం రమేష్‌ కు రాజ్యసభ ప్రకటించే సందర్భంలో యనమల పేరు దాదాపు ఖరారయినా - ఎన్నికల్లో పార్టీకి చేసిన ఆర్థిక సేవలను దృష్టిలో ఉంచుకున్న నాయకత్వం రమేష్ వైపే మొగ్గు చూపింది. మళ్లీ ఒకసారి గరికపాటి మోహన్‌రావు, మరోసారి టీజీ వెంకటేష్‌కు అవకాశం దక్కింది. ఈసారైనా యనమలను అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి.
    
ఇక గత 14 ఏళ్ల నుంచి నాడు అధికారంలో ఉన్న వైఎస్ - కాంగ్రెస్ - జగన్‌ పై ఎదురుదాడి చేస్తున్న వర్ల రామయ్య పేరు కూడా వినిపిస్తోంది. దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమాలను ఆయనే సమన్వయం చేస్తున్నారు. గతంలో చివరి నిమిషంలో తిరుపతి ఎంపీ సీటు - మరోసారి అదేవిధంగా పామర్రు నుంచి పోటీ చేయించిన నాయకత్వం - వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరటంతో ఆయనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతోందన్న విమర్శల నేపధ్యంలో - ఆయనకు ఎంపీ సీటు ఇవ్వడం ద్వారా ఆ నిందకు తెరదించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇక ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్ల వరకూ ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి కూడా సీటు ఆశిస్తున్నారు. ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఫైళ్లు బాగా కదిలాయని, ఆవిధంగా లాబీ చేయడం వల్లే సాధ్యమైందని చెబుతున్నారు. అయితే వర్ల రామయ్య - కంభంపాటి ఇద్దరూ కృష్ణా జిల్లాకు చెందిన వారే కావడంతో - ఇద్దరిలో ఎవరికి దక్కుతుందన్నది చెప్పలేని పరిస్థితి.
    
ఈసారి రాయలసీమ రెడ్డి వర్గానికి ఒక సీటు ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. నాయకత్వం కూడా వైసీపీని సంప్రదాయంగా అభిమానించే రెడ్డి వర్గానికి సీటు ఇవ్వడం ద్వారా - జగన్‌ కు చెక్ పెట్టవచ్చన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దానికితోడు శనివారం .. వైసీపీ తన అభ్యర్థిగా ప్రభాకర్‌ రెడ్డిని తాజాగా ప్రకటించినందున, సీమ నుంచి అదే వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలన్న యోచన ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, మూడవ సీటుకు ఆ వర్గం నేతను పోటీకి దించాలని భావిస్తోందంటున్నారు. అదే జరిగితే ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో కీలకపాత్ర పోషించిన కర్నూలు జిల్లా నేత - కొండారెడ్డి రవీంద్రరెడ్డి పేరు ఖరారు కావచ్చంటున్నారు. సీమ నేతలు కూడా ఈసారి రెడ్డి వర్గానికే సీటు ఇవ్వాలని పట్టుపడుతున్నందున, రవీంద్రరెడ్డికి అవకాశాలు మెరుగుగా ఉంటాయంటున్నారు.
Tags:    

Similar News