ఇవేం మాటలు విజయసాయి.. రెచ్చగొడితే రెచ్చిపోవటమా?

Update: 2021-10-26 01:06 GMT
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో భేటీ కావటంపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పందించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై ఇటీవల దాడి జరిగింది ఎందుకో ఆ పార్టీ నేతలు దాచి పెడుతున్నట్లుగా ఆయన మండిపడ్డారు. రాష్ట్రపతితో సమావేశమైన చంద్రబాబుటీం.. ఈ విషయాన్ని చెప్పాల్సిందేనన్న ఆయన.. సానుభూతి కోసమే ఆయనీ పని చేస్తున్నారన్నారు. పార్లమెంటు మొదలు పంచాయితీ వరకు జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో సానుభూతి కోసం తాజా నాటకాల్ని ఆడుతున్నట్లుగా తప్పు పట్టారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దూషించటానికి పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని.. ఇందుకు చంద్రబాబు పార్టీ నేతల్ని ప్రేరేపిస్తున్నట్లుగా విజయసాయి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలో భాగంగా సభ్యత.. సంస్కారం లేకుండా మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేసిన విజయసాయి మాటలు ఆశ్చర్యానికి గురి చేయక మానవు.

ఎందుకంటే.. చంద్రబాబును ఆయన కుమారుడు లోకేశ్ ను ఎటకారంగా.. చదివినంతనే ఒళ్లు మండేలా.. కించిత్ గౌరవం అన్నది ఇవ్వకుండా తనకు తోచినట్లుగా తన ట్విటర్ ఖాతాలో ట్వీట్లు పోస్టు చేసే విజయసాయి ఇప్పుడీ రోజున నీతులు చెప్పటమా? అని పలువురు మండిపడుతున్నారు. ప్రజల్ని మాటలతో రెచ్చగొట్టటం అంటే ఎలా ఉంటుందో విజయసాయి ట్విటర్ ఖాతాను చూస్తే అర్థమవుతుందంటున్నారు. ఆయన ఎంతలా నిందించినా.. రెచ్చగొట్టినా ప్రజలు ఎందుకు రెచ్చిపోలేదన్న ప్రశ్నను సంధిస్తున్నారు.

చంద్రబాబు అండ్ కోకు రెచ్చగొట్టినంతనే రెచ్చిపోయేంత అభిమాన గణం లేదా? లేదంటే టీడీపీని ఫాలో అయ్యేవారిలో రెచ్చపోయే గుణం లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకరిని వేలెత్తి చూపించే ముందు.. తమ సంగతిని చూసుకోవాలన్న ప్రాధమిక అంశాన్నిపట్టించుకోని విజయసాయి.. రెచ్చగొడుతున్నారని.. రెచ్చిపోతున్నారంటూ చేస్తున్న వ్యాఖ్యల్ని విన్నోళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. రెచ్చగొట్టటంలో అప్పుడెప్పుడో పీహెచ్ డీ చేసిన విజయసాయి లాంటి వారు మాట్లాడటమా? అని ప్రశ్నిస్తున్నారు. మాట్లాడి మాటలు అనిపించుకోవటం ఎందుకు విజయ సాయి అంటున్నోళ్లు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు.
Tags:    

Similar News