సీఎం ర‌మేశ్ సుడి తిరిగిపోయిన‌ట్లే బాస్!

Update: 2019-07-26 07:18 GMT
ఆర్థికంగా ఎలాంటి లోటు లేక‌పోవ‌టం పెద్ద విష‌యం కాదు. చేతిలో అంతులేని అధికారం ఉన్నా.. చుట్టూ వంద‌ల మంది పోటుగాళ్లు  ఉన్నా.. అనుకున్న ప‌నిని అనుకున్న‌ట్లుగా చేసే మొన‌గాళ్లు లేక‌పోవ‌టానికి మించి ఇబ్బంది మ‌రొక‌టి ఉండ‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ తమ వాళ్ల‌లో లేని నైపుణ్యాన్ని.. తెర వెనుక మంత‌నాల విష‌యంలో ఉన్న అస‌లుసిస‌లు క‌ళ‌ను ప్ర‌ద‌ర్శించిన సీఎం ర‌మేశ్ బీజేపీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌రోక్షంలో ఆయ‌న కార్యాల‌న్ని చ‌క్క‌దిద్దే సీఎం ర‌మేశ్‌.. సుజ‌నాలు ఈ మ‌ధ్య‌న బీజేపీలోకి వెళ్ల‌టం తెలిసిందే. అమిత్ షా మైండ్ సెట్ కు స‌రిగ్గా సూట్ అయ్యే ఈ ఇద్ద‌రికి చేతి నిండా ప‌ని దొర‌క‌ట‌మే కాదు.. తాజాగా త‌మ టాలెంట్ ను ప్ర‌ద‌ర్శించే అద్భుత అవ‌కాశం ద‌క్కింది.

స‌మాచార హ‌క్కు చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేస్తూ ప్ర‌వేశ పెట్టిన బిల్లును రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టే వేళ‌లో.. త‌మ‌కు త‌గ్గిన స‌భ్యుల బ‌లాన్ని స‌మ‌కూర్చే బాధ్య‌త‌ను అమిత్ షా కుడిభుజం భూపేంద‌ర్ సింగ్ తో పాటు సీఎం ర‌మేశ్ కు.. సుజ‌నా చౌద‌రిని అప్ప‌జెప్పారు. ద‌క్షిణాదిన ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. మ‌రికొన్ని పార్టీల అధినేత‌ల‌తో మంత‌నాలు జ‌ర‌ప‌టం.. వారిని ఒప్పించే విష‌యంలో వారు ప్ర‌ద‌ర్శించిన టాలెంట్ బీజేపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రాజ్య‌స‌భ‌లోని 240 మంది స‌భ్యుల్లో స్వ‌తంత్ర‌.. నామినేటెడ్ స‌భ్యుల‌తో క‌లిపి ఎన్డీఏకు 119 మంది స‌భ్యులు ఉన్న‌ప్ప‌టికీ బుధ‌వారం నాటితో ఐదుగురు ఎంపీల ప‌ద‌వీకాలం ముగియ‌టంతో.. బీజేపీకి అవ‌స‌ర‌మైన మెజార్టీకి ఆరుగురు స‌భ్యులు త‌క్కువ ప‌డ్డారు. దీంతో టీఆర్ఎస్.. టీడీపీ.. బీజేపీడీ.. పీడీపీ స‌హా అనేక పార్టీల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకునేందుకు వీలుగా బీజేపీ వ్యూహ‌క‌ర్త‌లు చ‌క్రం తిప్పారు.

వీరిలో సీఎం ర‌మేశ్ య‌మా చురుకుగా వ్య‌వ‌హ‌రించి.. త‌మ‌కు అవ‌స‌ర‌మైన స‌భ్యుల బ‌లాన్ని తెచ్చే విష‌యంలో స‌క్సెస్ అయ్యారు. గ‌డిచిన రెండు రోజులుగా వివిధ పార్టీల నేత‌ల‌తో మాట్లాడుతూ వ‌స్తున్న సీఎం ర‌మేశ్‌.. స‌రైన స‌మ‌యంలో ఎవ‌రెవ‌రితో మాట్లాడాల‌న్న విష‌యాన్ని బ్రీఫ్ చేయ‌టంతో పాటు.. ఎక్క‌డా ఎలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌టంలో స‌క్సెస్ అయ్యారు.

ఈ వాద‌న‌కు త‌గ్గ‌ట్లే.. బిల్లు రాజ్య‌స‌భ‌లో పాస్ అయ్యాక‌.. బీజేపీ ఎంపీలు ప‌లువురు సీఎం ర‌మేశ్ ను ప్ర‌త్యేకంగా అభినందించ‌టం చూస్తే.. పార్టీలో ఆయ‌న ప‌లుకుబ‌డి ఎంత‌లా పెరిగిందో ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి. తాజా ఎపిసోడ్ తో మోడీషాల వ‌ద్ద సీఎం ర‌మేశ్ ఇమేజ్ భారీగా పెరిగిన‌ట్లు చెబుతున్నారు. ఈ దెబ్బ‌తో ఆయ‌న సుడి తిరిగిపోయిన‌ట్లేన‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.రానున్న రోజుల్లో సీఎం ర‌మేశ్ కు పార్టీ ప‌రంగా ప్ర‌మోష‌న్ ల‌భించే వీలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
Tags:    

Similar News