రాఖీ పండుగ మ‌రిచారా ష‌ర్మిల‌క్కా !

Update: 2022-08-12 13:01 GMT
పండుగ అంటే ఏంటి ? ముఖ్యంగా అన్నా చెల్లెళ్ల అనుబంధాలు చాటే, అక్కా త‌మ్ముళ్లు అనుబంధాల‌ను పెంచే పండుగ అంటే ఏంటి ? ఇవే ప్ర‌శ్న‌లూ మీకూ ఇంకా ఇంకొంద‌రికీ కూడా క‌లిగే ఉంటాయి. అవునా కాదా ? పండుగ అంటే ఆనందాల లోతు తెలుసుకోవ‌డం.. పండుగ అంటే సంస్కృతిని ప‌రిర‌క్షించుకోవ‌డం.. ఈ పాటి తెలియ‌కుండా మ‌న నాయ‌కులు ఉంటార‌ని అనుకోలేం. త‌ప్పు కూడా ! త‌ప్ప‌కుండా వారికి భార‌తీయ సంస్కృతి గొప్ప‌ద‌నం, సంబంధిత చారిత్రక, వైదిక నేప‌థ్యం అన్నీ తెలిసే ఉంటాయి. ఉండాలి కూడా ! కానీ ఇవాళ కొన్ని రాజ‌కీయ కుటుంబాలు రాఖీ పున్న‌మికి లేదా ర‌క్షా బంధ‌న్ వేడుక‌ల‌కు ఎందుక‌ని దూరంగా ఉన్నాయి.

ఆ రోజు అన్న‌య్య క‌ష్టం త‌న క‌ష్టం అని భావించిన ష‌ర్మిల‌క్క క‌నీసం ఎందుక‌ని రాఖీ క‌ట్టేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. బ‌హుశా ! గ‌త ఏడాది కూడా ఆమె అన్న‌కు  రాఖీ క‌ట్టలేద‌నే అనుకుంటాను. (స‌బ్జెక్ట్ టు క‌రెక్ష‌న్) అదేవిధంగా ఈ ఏడాది కూడా అదేపంథాలో ఆమె త‌న పంతం నెగ్గించుకునే క్ర‌మంలో క‌నీసం ఓ ట్వీట్ కూడా చేయ‌లేదు. ఇది కూడా స‌బ్జెక్ట్ టు క‌రెక్ష‌న్.

ఇవే ఇప్పుడు కీలకం అయిన సందేహాల‌కో, అనుమానాలకో తావిస్తున్నాయి. ఎందుకంటే గ‌త కొంత కాలంగా అన్నా చెల్లెళ్ల మ‌ధ్య త‌గాదాలు ఉన్నాయ‌న్న మాట‌కు అర్థం చెప్పే విధంగానే ప‌రిణామాలున్నాయి. ఆ రోజు తాను పార్టీ కోసం చేసిన కృషి ఏదీ అక్క‌ర‌కు రాకుండా పోయింద‌న్న బాధ కూడా ష‌ర్మిల‌లో  ఉంది. అందుక‌నో ఎందుక‌నో ఆమె ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ కుటుంబానికి దూరంగా త‌న దారి తాను చూసుకుంటూ రాజ‌కీయం చేస్తున్నారు అని తెలుస్తోంది. ఆస్తుల లెక్క తేలడంలేదు క‌నుక‌నే ఈ విధంగా ఆమె త‌న దారి తాను చూసుకుంటున్నార‌ని కూడా మ‌రో స‌మాచారం లేదా అభిప్రాయం వినిపిస్తోంది.

ష‌ర్మిల‌క్క, జ‌గ‌నన్న ఈ ఇద్ద‌రూ తెలుగు రాష్ట్రాలకు సుప‌రిచితులు. అన్న కోసం త్యాగాలు చేశాను అని అంటారు అక్క. ఓ విధంగా అది నిజ‌మే కూడా ! పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు, ఫ్యామిలీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు అక్క త్యాగాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాద యాత్ర చేసి ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకున్నారు.ఆ విధంగా వైఎస్సార్ జ్ఞాప‌కాలనూ గుర్తుకు తెస్తూ, తీవ్ర భావోద్వేగాల‌కు లోనవుతూ, త‌మ త‌మ ప్ర‌సంగాలు సాగించారు. ఈ క్ర‌మంలో విజ‌య‌మ్మ కూడా ! ఇవాళ రాఖీ పూర్ణిమ. మ‌రి ! అక్క ఎక్క‌డ ? షర్మిల‌క్క ఎందుకని జ‌గ‌న్ సర్ కు రాఖీ క‌ట్ట‌లేదు ?

ఇవాళ‌ ఏపీ సీఎం ఇంటిలో రాఖీ పున్న‌మి వేడుకలు జరిగేయి. అక్క‌డికి చాలా మంది అక్క‌లు వ‌చ్చారు. చెల్లెళ్లూ వ‌చ్చారు. ఆఖ‌రికి ఓం శాంతి సిస్ట‌ర్స్ కూడా వ‌చ్చి జ‌గ‌న్ ను దీవించి వెళ్లారు. కానీ ఎందుక‌నో సొంత చెల్లాయి ష‌ర్మిల రాలేదు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తోంది. వైఎస్సార్ కుటుంబంలో ఎప్ప‌టి నుంచో  ఉన్న విభేదాలే ఇందుకు కార‌ణ‌మా అన్న అనుమానాలూ వినిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచివైఎస్సార్టీపీ పేరిట తెలంగాణ‌లో రాజ‌కీయం చేస్తున్న ష‌ర్మిల విధానం ఏదీ కూడా జ‌గ‌న్ ఆమోదం పొంది లేదు.

అస‌లు ఆ అమ్మాయికి పార్టీ పెట్ట‌వ‌ద్ద‌నే తాము చెప్పామ‌ని సజ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి అంటున్నారు. అలాంట‌ప్పుడు ఆ పార్టీకీ జ‌గ‌న్ కూ ఎటువంటి సంబంధ‌మూ ఉండ‌బోదు. అందుక‌నో ఎందుక‌నో ఇవాళ ష‌ర్మిల ఆ గూటికి చేరుకోలేక‌పోయి ఉండ‌వ‌చ్చు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ష‌ర్మిల రాఖీ క‌ట్టి మంచి బంధాలు త‌మ మ‌ధ్య ఉన్నాయి అన్న‌సంకేతాలు పంపితే ఎంత బాగుండు. ఇదే స‌మ‌యంలో కేటీఆర్ కు క‌విత‌క్క రాఖీ క‌ట్టారు. ఆనందాలు పంచుకున్నారు. కానీ ఇక్క‌డ మాత్రం సీన్ రివ‌ర్స్.
Tags:    

Similar News