జైల్లో టీవీ వద్దనే వద్దంటున్నారు

Update: 2015-04-11 11:24 GMT
సత్యం కుంభకోణంలో దోషిగా తేలి ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లిన రామలింగరాజు అండ్‌ కో కోరిన కోర్కె జైలు అధికారులకు తలలు గోక్కునేలా చేసింది. అలా అని వారేమీ కోరకూడనటువంటి పెద్ద కోరికనేమీ అడగలేదు. ఇంకా చెప్పాలంటే.. మిగిలిన ఖైదీలకు భిన్నంగా ఉన్న సదుపాయాన్ని కూడా వద్దని అనుకోవటమే అసలు విషయం.

ఏడేళ్ల జైలుశిక్షతో జైలుకు వెళ్లిన రామలింగరాజు.. చర్లపల్లి జైలుకు వెళ్లిన తర్వాత అక్కడి అధికారులను ఒక కోరిక కోరారు. తమకు టీవీలు లేని బ్యారెక్‌లో ఉంచాలని వారుకోరారు. ఈ విషయం జైలు అధికారులకు అయోమయంలో పడేసింది. ఎందుకంటే.. అన్ని బ్యారెక్‌లకు టీవీలు ఉన్నాయి. మరి.. రామలింగరాజు అండ్‌ కో కోరిన మీదట ఏం చేయాలన్న దానిపై ఆలోచించగా.. జైల్లో రెండుమూడు టీవీలు చెడిపోయి.. టీవీ లేని బ్యారెక్‌లు ఉన్నాయని గుర్తుకొచ్చింది.

వెంటనే.. రామలింగరాజు బ్యాచ్‌ను అందులో ఉంచేలా జైలు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా టీవీలు.. న్యూస్‌పేపర్లు లాంటి వాటిని ఖైదీలు కోరుకుంటారు. కానీ.. రామలింగరాజు అండ్‌ కోలు మాత్రం అందుకు భిన్నంగా తమ కోరికను వెల్లడించారు. టీవీల్లో వస్తున్న కథనాలు ఇబ్బందికరంగా మారటంతో.. వారీ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.



Tags:    

Similar News