పోలీస్ స్టేష‌న్‌ కు చేరిన గులాబీ నేత‌ల లొల్లి

Update: 2017-08-09 04:56 GMT
త‌మ మ‌ధ్య స‌వాల‌చ్చ ఉన్నా.. పార్టీ వేదిక‌ల మీదకు వ‌చ్చేసరికి ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని వ్య‌వ‌హ‌రించే గులాబీ నేత‌లు తాజాగా రెచ్చిపోయారు. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ గీత దాటే నేత‌ల ప‌ట్ల అధినేత ఆగ్ర‌హాన్ని మ‌ర్చిపోయారు. పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తుంటే.. వారి మ‌ధ్య‌న ఉన్న గులాబీ మంత్రి నోట మాట రాక మాన్ప‌డిపోయేలా చేసిన ఘ‌ట‌న తాజా సంచ‌ల‌నంగా మారింది. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు భిన్నంగా చోటు చేసుకున్న ఈ వైనం తెలంగాణ అధికార‌ప‌క్ష‌మైన టీఆర్ ఎస్ లో చోటు చేసుకోవ‌టం హాట్ టాపిక్ గా మారింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారపార్టీల్లో క్ర‌మ‌శిక్ష‌ణ ముచ్చ‌ట‌కు వ‌స్తే.. తెలంగాణ అధికార పార్టీలోనే ఎక్కువ‌న్న భావ‌న నిన్నటి వ‌ర‌కూ ఉంది. కానీ.. అందుకు భిన్నంగా నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ లో చోటు చేసుకున్న వైనం గులాబీ నేత‌ల‌కు షాకింగ్ గా మారింది. గ‌డిచిన కొద్దికాలంగా నేత‌ల మ‌ధ్య లొల్లి ఉన్నా.. అది బాహాటంగా బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు.. నేత‌ల మ‌ధ్య తోపులాట వ‌ర‌కూ వెళ్ల‌టం గ‌మ‌నార్హం. అదికూడా.. ఒక మ‌హిళా నేత ప‌ట్ల మ‌రో నేత అనుచితంగా ప్ర‌వ‌ర్తించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

అయితే.. ఈ లొల్లి మొత్తం టీఆర్ ఎస్ లోని బీటీ బ్యాచ్‌ కు చెందిన వారు కావ‌టం మ‌రో ఆస‌క్తిక‌ర అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కీ అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యంలోకి వెళితే..

ఈ నెల 10న పోచంపాడ్ లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌భ జ‌ర‌గ‌నుంది. ఈ స‌భ‌కు జ‌న‌స‌మీక‌ర‌ణ మీద మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో స‌మావేశం జ‌రిగింది. దీనికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయ‌క్ (కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి వ‌చ్చారు).. మాజీ ఎంపీ ర‌మేశ్ రాథోడ్ (తెలుగుదేశం పార్టీ నుంచి వ‌చ్చారు) వ‌ర్గాల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు.. ప్ర‌త్యారోప‌ణ‌లు.. దూష‌ణ‌లో చోటు చేసుకున్నాయి.

నిర్మ‌ల్ జిల్లాలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గ్రూపుల మ‌ధ్య అధిప‌త్య పోరు న‌డుస్తోంది. అయితే.. ఇలాంటి వాటికి ఆదిలోనే చెక్ పెట్టే విష‌యంలో కేసీఆర్ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌ట‌మే తాజా ప‌రిణామాల‌కు కార‌ణంగా చెబుతున్నారు. తాజా ఉదంతానికి వ‌స్తే.. జ‌న‌స‌మీక‌ర‌ణ విష‌యంలో రేఖా.. ర‌మేశ్ ల మ‌ధ్య మాటా మాటా పెరిగింది. ఒక ద‌శ‌లో భేటీలో పాల్గొన్న నేత‌ల మ‌ధ్య చిన్న‌పాటి ఘ‌ర్ష‌ణ చోటు చేసుకున్న‌ట్లుగా ఆరోపిస్తున్నారు.

త‌న ప‌క్క‌న కూర్చున్న మార్కెట్ క‌మిటీ ఛైర్మ‌న్ న‌ల్ల శ్రీనివాస్ ను ర‌మేశ్ రాథోడ్ చేయి ప‌ట్టుకొని ప‌క్క‌కు లాగార‌ని ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ ఆరోపించారు. ఇదేంట‌ని ప్ర‌శ్నిస్తే.. ఎక్క‌డ్నుంచో బ‌తికేందుకు వ‌చ్చావు.. నీ స్థానంలో నువ్వు ఉండు.. వీళ్లు వెళ్లాక నీ సంగ‌తి చెబుతానంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారంటూ ఆమె ఏకంగా పోలీస్ స్టేష‌న్‌ కు వెళ్లి ఫిర్యాదు చేయ‌టం గ‌మ‌నార్హం.  

నేత‌ల మ‌ధ్య లొల్లిని స‌ర్దిచెప్పేందుకు ప్ర‌య‌త్నించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెళ్లిన త‌ర్వాత‌..ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి.. ర‌మేశ్‌రాథోడ్ కార‌ణంగా త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఫిర్యాదు చేశారు. గ‌తంలో త‌న‌పై గ‌న్ మ‌న్ ను తోసి దౌర్జ‌న్యానికి దిగార‌ని.. మ‌హిళ అని చూడ‌కుండా అనుచితంగా వ్య‌వ‌హ‌రించార‌న్నారు. స‌మావేశంలో గొడ‌వ‌కు సంబంధించిన క్లిప్పింగ్ లు ఉన్నాయ‌న్నారు. వెంట‌నే ర‌మేశ్ రాథోడ్ ను అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేష‌న్ ఎదుట ఆందోళ‌న చేప‌ట్టారు.

ఇదిలా ఉంటే.. ఖానాపూర్ నేత‌ల మ‌ధ్య పంచాయితీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కేసీఆర్ వ‌ద్ద‌కు చేరిన‌ట్లుగా తెలుస్తోంది. జ‌రిగిన ఘ‌ట‌న‌పై ఆయ‌న సీరియ‌స్ గా ఉన్న‌ట్లు స‌మాచారం. నేత‌లు క‌ట్టు త‌ప్పి ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టంపై గుర్రుగా ఉన్న ఆయ‌న‌.. ఇద్ద‌రు నేత‌ల్ని త‌న వ‌ద్ద‌కు పిలిపించుకునే అవ‌కాశం ఉందంటున్నారు. మ‌హిళా నేత ప‌ట్ల అనుచితంగా వ్య‌వ‌హ‌రించిన వైనంపైనా.. ర‌మేశ్ రాథోడ్ తీరుపైనా మ‌రింత స‌మాచారం తెప్పించుకున్నాకే త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌ని చెబుతున్నారు. తాజా లొల్లి తెలంగాణ అధికార‌పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News