కరుణాకర ఇంట పెళ్లికి రామోజీ వెళ్లారు

Update: 2015-10-30 05:02 GMT
ఎప్పుడో కానీ వార్తల్లోకి రాని రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఈ మధ్య తరచూ వార్తల్లోకి వస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు. కొద్ది రోజుల క్రితం రామోజీ ఫిలిం సిటీ వచ్చి తనను కలిసి.. తన కుమారుడి వివాహానికి హాజరుకావాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేత భూమాన కరుణాకర్ రెడ్డి ఆహ్వానించటం తెలిసిందే. ఆ సందర్భంగా భూమాన కరుణాకర్ రెడ్డితో పాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఉండటం సంచలనం రేకెత్తించింది.

నాడు పిలిచిన ఆహ్వానానికి రామోజీ సానుకూలంగా స్పందించారు. తాజాగా జరిగిన వివాహ మహోత్సవానికి రామోజీ హాజరయ్యారు. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన భూమాన ఇంట జరిగిన పెళ్లికి రామోజీరావు స్వయంగా వెళ్లటం ఆసక్తికరంగా మారింది. తన ఇంటికి వచ్చి మర్యాదగా పిలిచిన భూమాన ఆహ్వానాన్ని మన్నించిన రామోజీ.. తన హాజరుతో జగన్ అండ్ కో స్నేహహస్తానికి తాను సంతోషంగా ఉన్న సంకేతాన్ని పంపినట్లైంది.

ఇక.. ఈ వివాహ మహోత్సవంలో మరిన్ని విశేషాలు చోటు చేసుకున్నాయి. ఈ పెళ్లికి ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు వియ్యంకుడు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ .. మాజీ కేంద్రమంత్రి చిరంజీవి..  ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ తదితరులు హాజరయ్యారు. ఇక.. మరో ప్రముఖ మీడియా సంస్థ అధినేత.. ఆంధ్రజ్యోతి ఎండీ అయిన వేమూరి రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు. భూమాన ఇంట పెళ్లికి అన్ని రాజకీయ వర్గాలతో పాటు.. భిన్న కోణాలకు చెందిన ప్రముఖులు హాజరు కావటం ఒక విశేషంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News