మోడీ మొనగాడితనాన్ని ప్రశ్నించి కాంగ్రెస్ తప్పు చేస్తుందా?

Update: 2020-08-16 01:30 GMT
కొంతమందికి కొన్ని ఇమేజ్ లు ఉంటాయి. వాటిని ప్రశ్నించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. ఎవరేం అన్నా.. ఎన్ని విమర్శలు చేసినా ఫర్లేదు కానీ.. ఒక ప్రముఖుడికి ఉండే బలాన్ని ప్రశ్నించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎక్కడి దాకానో ఎందుకు ప్రధాని నరేంద్రమోడీ విషయానికే వద్దాం. ఆయనకు సంబంధించి మీరు విమర్శలు చేస్తే చాలామంది ఒప్పుకోరు. అదే ఆయనలో జాతీయభావన అన్నది నేతిబీర అన్న మాట అని చూడండి.. చాలా తీవ్రమైన పరిణామాల్ని చవిచూడాల్సి వస్తుంది. ఎందుకంటే.. మోడీ అంటేనే జాతీయభావానికి కేరాఫ్ అన్న విశ్వాసం దేశ ప్రజల్లో ఎంతగా ఉందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని సందేహంగా చూపించే ప్రయత్నం చేసే వారి పట్ల ఆగ్రహం మాత్రమే కాదు.. అలాంటి వారి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న భావన వ్యక్తమవుతూ ఉంటుంది.

అలాంటప్పుడు మోడీని విమర్శించాలన్నా.. ఆయన మాటల్ని తప్పు పట్టాలన్నా ఏం చేయాలి? ఆయన్ను ఏ విషయంలో అయితే ప్రజల నమ్మకం తక్కువగా ఉంటుందో ఆ విషయాన్ని ప్రస్తావిస్తే ఫలితం ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని గుర్తించటంతో కాంగ్రెస్ పార్టీ నేతలంతా తరచూ మిస్ అవుతుంటారు. మోడీని విమర్శించేందుకు కాంగ్రెస్ ముఖ్యులు ఎంచుకునే అంశాలన్ని తరచూ బ్యాక్ ఫైర్ కావటానికి కారణం ఇదే.

తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మీడియా ముందుకు వచ్చారు. ఎర్రకోట వద్ద జాతీయపతాకాన్ని ఎగురవేసి.. దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన వైనంపై ఆయన స్పందించారు. మోడీ వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. చైనా పేరు ఎత్తటానికి జంకుతున్నారని ఎద్దేవా చేశారు. దేశ సార్వభౌమత్వానని సవాల్ చేసే వారికి ఎల్ ఓసీ మొదలు ఎల్ఏసీ వరకూ సైన్యం ధీటైన సమాధానం ఇచ్చిందని మోడీ వ్యాఖ్యానించారని.. కానీ చైనా పేరు ఎత్తటానికి అధికారపక్షం భయపడుతుందన్నది ఆయన మాట.

ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశాధినేత అయినా దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే క్రమంలో ఒక దేశం పేరును ప్రస్తావించి హెచ్చరికలు చేస్తారా?ఒకవేళ చేసినా ప్రత్యేక సమయాల్లో మాత్రమే చేస్తారు. అది కూడా చాలా తక్కువ సమయాల్లోనే అన్నది మర్చిపోకూదు. అయినా.. చైనా లాంటి దేశాన్ని ఉద్దేశించి ఏదైనా హెచ్చరికలు చేయాల్సి వచ్చినప్పుడు.. చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా? చుట్టూ ప్రపంచ దేశాలు భారత దేశ ప్రధాని నోటి నుంచి వచ్చే మాటల్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తారన్న విషయాన్ని రణదీప్ సూర్జేవాలా లాంటి వారికి తెలీదా?

ఇంతలా మోడీని తిట్టినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అన్నది కూడా సందేహమే. ఎందుకంటే.. కాంగ్రెస్ ప్రధానుల్లో ఎవరూ కూడా మోడీ మాదిరి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నది లేదన్నది మర్చిపోకూడదు. మోడీకి ఉన్న ఇమేజ్ ను వదిలేసి.. ఆయన్ను ప్రజలు ఏ విషయంలో అయితే బలంగా విశ్వసిస్తారో.. అదే అంశాన్ని ప్రస్తావించటం వల్ల సాధించేది శూన్యమన్న విషయం కాంగ్రెస్ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. లేదంటే.. మరింత కాలం విపక్ష హోదాలోనే ఉండాల్సి వస్తుంది.
Tags:    

Similar News