మ‌న జ‌డ్జిలు సైకిళ్ల మీద కోర్టుకు వ‌చ్చారు

Update: 2016-01-02 10:00 GMT
ఆ దేశాధ్య‌క్షుడు అంత సింపుల్ గా ఉన్నాడు.. ఈ దేశంలో ఆ ప్ర‌ముఖుడు అలా చేశాడంటూ చాలామంది గురించి చాలా విష‌యాలు వింటుంటాం. చ‌దువుతుంటాం. విదేశాల దాకా ఎందుకు.. దేశంలోనే కొంద‌రు ముఖ్య‌మంత్రులు చాలా సింఫుల్ గా ఉంటారు. అదేం చిత్ర‌మో కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వీవీఐపీల్లో అలాంటి వైఖ‌రి క‌నిపించ‌ద‌న్న విమ‌ర్శ ఉంది.

అయితే.. ఇందుకు భిన్నంగా తాజాగా రంగారెడ్డి జిల్లా కోర్టు జ‌డ్జిలు.. సిబ్బంది అంతా సైకిళ్ల మీద కోర్టుకు రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.  ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు.. కాలుష్యాన్ని త‌గ్గించేందుకు ఎవ‌రికి వారు.. ఎంతోకొంత మేర ప్ర‌య‌త్నం చేయాల‌న్న ల‌క్ష్యంతొ తాజాగా ఒక నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

ప్ర‌తి నెల ఒక రోజు కోర్టు సిబ్బంది అంతా సైకిళ్ల మీద రావాల‌ని నిర్ణ‌యించారు. మార్పు ఎక్క‌డో ఒక చోట మొద‌లు కావాల‌ని చెబుతారు. అలాంటి మార్పునే.. రంగారెడ్డి జిల్లాకోర్టు న్యాయ‌మూర్తులు.. సిబ్బంది స్టార్ట్ చేశార‌ని చెప్పాలి. అయితే.. ఈ వ్య‌వ‌హారంలో ఒకే ఒక్క స‌మ‌స్య ఉంటుంది. కోర్టుకు ద‌గ్గ‌ర‌గా ఇళ్లున్న వారికి తాజా నిర్ణ‌యం వ‌ల్ల ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. దూరంగా ఉండే వారు మాత్రం ఇబ్బంది ప‌డే అవ‌కాశం ఉంది. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నా.. మార్పుకోసం మ‌నోళ్లు చేసిన ప్ర‌య‌త్నం కొత్త స్ఫూర్తి అవుతుంద‌న‌టంలో సందేహం లేదు.
Tags:    

Similar News