పెళ్లిళ్ల‌కు భారీ ఖ‌ర్చు వద్ద‌న్న ఎంపీ తీరు తెలిస్తే షాకే

Update: 2017-02-19 05:55 GMT
శ్రీ‌మంతులు తమ స్థాయిని చాటుకోవడం కోసం ఆర్భాటంగా పెళ్లిళ్లు చేసే సంప్రదాయానికి ఇకపై చెక్ పెట్టడానికి ప్రయత్నాలు మొదలైన సంగ‌తి తెలిసిందే. పెళ్లికి ఎంతమందిని ఆహ్వానించాలి, వడ్డించే ఆహార పదార్థాలపై పరిమితి విధిస్తూ, అలాగే 5 లక్షలకు పైగా పెళ్లికోసం ఖర్చు చేసే వారు కొంతమొత్తాన్ని పేద అమ్మాయిల పెళ్లిళ్ల కోసం విరాళంగా ఇచ్చేలా చేసేందుకు ఒక బిల్లును లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. బిహార్ ఎంపి పప్పూయాదవ్ భార్య - కాంగ్రెస్ ఎంపి రంజీత్ రంజన్ ప్రవేశపెట్టన ఈ బిల్లును రాబోయే లోక్‌ సభ సమావేశాల్లో ప్రైవేట్ సభ్యుడి బిల్లుగా చర్చకు చేపట్టే అవకాశం ఉంది. అయితే రంజీత్ రంజన్ వివాహం మాత్రం క‌ళ్లు తిరిగే రీతిలో జరిగిందని తాజాగా వెలుగులోకి వచ్చింది.

గురివింద తన నలుపు ఎరుగనట్టు బీహార్ కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రాజన్ తీరు ఉంద‌ని అంటున్నారు. పెళ్లిళ్లకు భారీగా ఖర్చు పెట్టేవారు పదిశాతం సుంకం కట్టాలని ఇటీవల ప్రైవేట్‌మెంబర్ బిల్లును ప్రతిపాదించిన ఈ మహిళా ఎంపీ పెళ్లి ఖర్చు ఎంత అయిఉంటుందా అని ఆరా తీస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. 1994లో వివాదాస్పద నేత పప్పూయాదవ్‌తో జరిగిన ఆమె పెండ్లికి భూలోకమంత పీటవేసి ఆకాశమంత పందిరి వేశారట. అతిథులేమో లక్షమంది దాకా వచ్చారట. వందల సంఖ్యలో వంటవాళ్లు తినుబండారాలు తయారు చేశారు. 200 ఎకరాల్లో పెండ్లి వేడుకలు జరిగాయని జనసత్తా పత్రిక వెలుగులోకి తెచ్చింది. కాగా, ఈ బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా రంజీత్ మాట్లాడుతూ పెళ్లిళ్లపై ఆర్భాటాన్ని, వృథా ఖర్చును తగ్గించి, సింపుల్‌గా వివాహాలను జరుపుకోవడాన్ని ప్రోత్సహించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహ బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు పెళ్లిళ్ను విలాసవంతంగా జరపడం, భారీ ఎత్తున ఖర్చు చేయడం దేశంలో పెరిగిపోతోందని ఆమె అన్నారు.

‘ఈ రోజుల్లో పెళ్లిళ్లు అనేవి జనం తమ సంపదను చూపించుకోవడానికి గుర్తుగా మారిపోతున్నాయి. ఫలితంగా పేద కుటుంబాలు పెళ్లిళ్లపై భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. సమాజానికి ఇది ఎంతమాత్రం మంచిది కాదు’ అని ఆమె అన్నారు. ఒక వేళ ఏ కుటుంబమైనా పెళ్లి కోసం 5 లక్షలకన్నా ఎక్కువ ఖర్చు చేయాలనుకుంటే సదరు కుటుంబం ఆ మొత్తాన్ని ముందుగానే ప్రభుత్వానికి తెలియజేయాలని, ఆ మొత్తంలో 10 శాతం పేదలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉండే కుటుంబాల అమ్మాయిల పెళ్లిళ్లు జరిపించడం కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వాలని ఈ బిల్లు పేర్కొంటోంది. ఒక వేళ ఈ బిల్లు  చట్టరూపం ధరించే అన్ని పెళ్లిళ్లను పెళ్లి జరిగిన 60 రోజుల్లోగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇక పెళ్లికి కానీ, ఆ తర్వాత జరిగే రిసిప్షన్ కోసం ఎంతమంది బంధుమిత్రులను ఆహ్వానించాలి, ఏయే వంటకాలు వడ్డించాలో కూడా ప్రభుత్వం నిర్ణయించవచ్చని, ఎందుకంటే ఆహార పదార్థాల వృధాను అరికట్టాలంటే ఇది అవసరమని కూడా ఆ బిల్లులో పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News