అచ్చు అమిత్ షా చెప్పిన‌ట్లే జ‌రిగింది

Update: 2017-03-15 06:35 GMT
కొన్నిసార్లు టైం అలానే ఉంటుంది. ఏం చెబితే.. అది జ‌రిగిపోతుంటాయి. బీజేపీ చీఫ్ నోట్లో నుంచి ఏ మాట వ‌చ్చినా ఇట్టే జ‌రిగిపోతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ప్ర‌చార నేప‌థ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఫలితాలు వెలువ‌డే రోజు మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు యూపీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ త‌న రాజీనామా లేఖ‌తో సిద్ధంగా ఉంటార‌ని వ్యాఖ్యానించారు. దీన్ని అప్ప‌ట్లో స‌మాజ్ వాదీ నేత‌లు కొట్టిపారేశారు. అమిత్ షా మ‌రీ ఎక్కువ‌గా ఫీల్ అవుతున్నారంటూ వ్యంగ్య‌స్త్రాలు సంధించినోళ్లు లేక‌పోలేదు.

కానీ.. చివ‌ర‌కు జ‌రిగిందేమిటో అంద‌రికి తెలిసిందే. అమిత్ షా ఒంటి గంట‌కు రాజీనామా లేఖ‌తో సిద్ధంగా ఉంటార‌ని చెబితే.. అఖిలేశ్ ప‌న్నెండు గంట‌ల‌కే రాజీనామాకు సిద్ధ‌మైపోయారు. దీంతో అమిత్ షా నోటి నుంచి వ‌చ్చే మాట‌ల‌కు విలువ పెరిగిపోయింది. తాజాగా ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాట కూడా నిజం కావ‌టం ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.

యూపీ ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌ర్లో.. సామూహిక అత్యాచారం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స‌మాజ్ వాదీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న గాయ‌త్రి ప్ర‌జాప‌తిని త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అరెస్ట్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసి.. ఫ‌లితాలు వెలువ‌డిన మూడు రోజులు గ‌డిచాయో లేదో.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌జాప‌తిని ల‌క్నో పోలీసులు అరెస్ట్ చేశారు.

స‌మాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు పోలీసుల‌కు చిక్క‌ని ఈ మంత్రి.. బీజేపీ స‌ర్కారు కొలువు తీర‌క‌ముందే.. పోలీసుల‌కు చిక్కిన వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. సామూహిక అత్యాచారం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌జాప‌తితో పాటు మ‌రో ఆరుగురు నిందితుల‌పై సుప్రీం ఇప్ప‌టికే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాలు జారీ చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు మంత్రి ప్ర‌జాప‌తితో పాటు.. ఆరోప‌ణ‌లున్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసుల గాలింపుతో అండ‌ర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయిన ప్ర‌జాప‌తి కోసం గ‌డిచిన 17 రోజులుగా పోలీసులు గాలిస్తున్నా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. సోమ‌వారం సామూహిక అత్యాచార ఉదంతంలో నిందితులైన ముగ్గురిని సెంట్ర‌ల్ ల‌క్నోలోని హ‌జ్ర‌త్ గంజ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఇది జ‌రిగిన రోజు వ్య‌వ‌ధిలోనే పోలీసులు మంత్రి ప్ర‌జాప‌తిని అరెస్ట్ చేయ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి అత్యాచారం ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వెంట‌నే ప్ర‌జాప‌తిని ముఖ్య‌మంత్రిగా ఉన్న అఖిలేశ్ ప‌క్క‌న పెట్టేశారు. అయితే.. ములాయంకు అత్యంత స‌న్నిహితుడు కావ‌టంతో ఆయ‌న్ను మంత్రివ‌ర్గంలో కొన‌సాగించాల్సి వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. యూపీకి చెందిన ఒక మ‌హిళ‌ను.. ఆమె కుమార్తెను మంత్రి అత‌ని అనుచ‌రులు సామూహిక అత్యాచారం చేసిన‌ట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News