బ‌య‌ట ఒక‌లా.. లోప‌ల మ‌రోలా ర‌విప్ర‌కాశ్‌

Update: 2019-06-10 05:24 GMT
అప‌రిచితుడు సినిమా గుర్తుందా?  అందులో హీరో ను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారి పాత్ర‌లో ప్ర‌కాశ్ రాజ్ చాలా దారుణంగా హింసిస్తాడు. ఈ సంద‌ర్భంగా హీరోలోని అప‌రిచితుడు బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే. ఆ సంద‌ర్భంగా హీరో పాత్ర ధారి విక్ర‌మ్ యాక్ష‌న్ ను మ‌ర్చిపోలేం. అత‌గాడి వేరియేన్స్ ను ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌కాశ్ రాజ్ పాత్ర‌ధారి.. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్టీఆర్.. ఏఎన్నార్.. చాలామంది న‌టుల్ని చూశాం కానీ.. ఇన్ని వేరియేష‌న్స్ ఏందిరా? అంటూ వ్యాఖ్యానిస్తాడు.

ఇంచుమించు అలాంటి ప‌రిస్థితే పోలీసులు తాజాగా ర‌విప్ర‌కాశ్ ఎపిసోడ్ లో ఎదుర్కొంటున్న‌ట్లుగా చెబుతున్నారు. ప‌లు నేరారోప‌ణ‌ల‌తో ప్ర‌స్తుతం పోలీసుల విచార‌ణ ఎదుర్కొంటున్న ఆయ‌న పోలీసుల ద‌గ్గ‌ర వ్య‌వ‌హ‌రించే తీరుకు.. విచార‌ణ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత మీడియాతో మాట్లాడే తీరుకు ఏ మాత్రం పొంత‌న ఉండ‌టం లేదంటున్నారు.

ఎన్ని ప్ర‌శ్న‌లు వేసినా స‌మాధానం చెప్ప‌క‌పోవ‌టం.. ఉన్న‌ట్లుండి బ‌ల్ల మీద ప‌డుకోవ‌టం.. సంబంధం లేని ఆన్స‌ర్లు ఇవ్వ‌టం.. టీవీ9 ఇప్ప‌టికి త‌న‌దేన‌ని చెప్ప‌టం.. త‌ప్పులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న అంశాల‌పై ఏ మాత్రం స్పందించ‌క‌పోవ‌టం లాంటి వాటితో పోలీసుల‌కు చిరాకు తెప్పిస్తున్న ఆయ‌న‌.. బ‌య‌ట‌కు రాగానే మీడియా మైకుల ముందు మాత్రం మీడియా ఐక్య‌త వ‌ర్థిల్లాలి. జ‌ర్న‌లిస్టుల అంతా ఒక్కేట అన్న‌ట్లుగా నినాదాలు ఇవ్వ‌టం.. పెట్టుబ‌డి దారీ వ‌ర్గం.. ఆర్థిక దోపిడీ అంటూ.. సంప‌న్నులు దుర్మార్గం.. అంటూ క‌మ్యునిస్టు పార్టీల త‌ర‌హాలో మాట్లాడుతున్న వైనం పోలీసుల‌కు ఒక ప‌ట్టాన అర్థం కావ‌ట్లేదంటున్నారు.

పోలీసుల విచార‌ణ‌ను ర‌విప్ర‌కాశ్ వ్యూహాత్మ‌కంగానే ఎదుర్కొంటున్నార‌న్న భావ‌న‌ను పోలీసు ఉన్న‌తాధికారులు వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. విచార‌ణ‌లో చెప్పిన మాట‌ల‌కు సంబంధించిన డాక్యుమెంట్లు తేవాల‌ని పోలీసులు చెప్పినా.. ఇప్ప‌టికి తేన‌ట్లుగా తెలుస్తోంది. అటు సైబ‌రాబాదా పోలీసులు.. ఇటు బంజారాహిల్స్ పోలీసులు విచారించినా ఒక‌టే తీరును ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ రోజు (సోమ‌వారం) కోర్టులో ర‌విప్ర‌కాశ్ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ సాగ‌నుంది. కోర్టు ఆదేశాల‌కు అనుగుణంగా ఆయ‌న‌పై త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News