ఆఫ్రికా ఖండానికి విస్తరించిన రవిప్రకాష్‌ మోసాలు!

Update: 2019-10-10 07:21 GMT
మెరుగైన సమాజం ముసుగులో  వెలిచాటి రవిబాబు అలియాస్‌ టీవీ9 రవిప్రకాష్‌ చేసిన మోసాలు ఇపుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆకర్షించే నినాదంతో ఆయన చేసిన మోసాలు   ఖండాంతరాలకు వ్యాపించాయి. లక్షల్లో జీతాలు తీసుకునే ఆయన ఆఫ్రికా ఖండంలో కేబుల్‌ నెట్‌ వర్క్‌ ను తక్కువ పెట్టుబడితో కొనుగోలు చేయటం వెనుక ఎంత పెద్ద గోల్ మాల్‌ నడిచిందో బహిర్గతమౌతోంది. టీవీ నెక్స్ట్‌... ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలో వేగంగా విస్తరిస్తున్న కేబుల్‌ టీవీ సంస్థ. ఇది మెరుగైన సమాజం కోసం పోరాడే రవిప్రకాష్‌ సొంత సంస్థ. దీని నెల ఆదాయం రూ. 1.70 కోట్లు. ఖర్చులు పోను యజమానికి రూ. కోటి నికరంగా ఆదాయం తెచ్చి పెడుతుంది ఈ సంస్థ. నెలకు రూ. కోటి అంటే ఏడాదికి రూ. 12 కోట్లు లాభాలు తెస్తున్న సంస్థ అన్నమాట. ఈ సంస్థ ఆఫ్రికా దేశాల్లో తెలుగు  వారు అధికంగా నివసించే ఘన - బోట్సువానా - ఇధియోపియా - కెన్యా - జాంబియా తదితర దేశాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రవిప్రకాష్‌ విదేశాల్లో వ్యాపారాలు చేసుకోకూడదా - వాటిని ఖండాంతరాలకు విస్తరించ కూడదా? అలా చేస్తే తప్పేంటి? వ్యాపారాలతో కోట్లు సంపాదించుకోకూడదా - ఇతరులు  చేస్తే ఒప్పు ... మెరుగైన సమాజం రవిప్రకాష్‌ చేస్తే తప్పా అని ఏ సామాన్య మానవుడికైనా అనుమానం రావచ్చు. ... అందులో ఎలాంటి సందేహం లేదు. అలా  రావటం కూడా సహజం.

ఎవరు ఎక్కడ ... ఏ ఖండంలో... చివరకు జన సంచారం లేని అంటార్కిటికా ఖండంలో వ్యాపారం చేసుకున్నా ఎవరికి వీసమెత్తు అనుమానం రానక్కర్లేదు. అభ్యంతరం అసలు  ఉండక్కర్లేదు. అయితే మనం చేసే వ్యాపారాన్ని   కొనుగోలు  చేసిన తీరు అనుమానాస్పదంగా ఉంటేనే అనుమానాలు - అభ్యంతరాలు  వస్తాయి ఎవరికైనా. కంపాలా సిటీ కేబుల్‌ పేరుతో టీవీ నెక్స్ట్ సేవలనందిస్తోంది . ఇది ఒక్కో కనెక్షన్‌ కు నెలకు రూ. 1700 మన కరెన్సీలో వసూలు  చేస్తోంది. అదే ఉగాండా కరెన్సీలో అయితే 85 వేల షిల్లాంగులు . ఇక్కడ మనం ఒక రూపాయికి అక్కడ 50 షిల్లాంగులు  చెల్లిస్తారు. ఈ సంస్థకు సగటున 10వేల కనెక్షన్లున్నాయని అనుకున్నా ..  నెకు రూ. 1.70 కోట్లు వసూలు  అవుతుంది. అందులో రూ. 70 లక్షలు  అన్ని ఖర్చులు  పోనూ రూ. కోటి నికరంగా రవిప్రకాష్‌ కు మిగుతుందని ఉగాండా కేబుల్‌ వ్యాపార వర్గాల అంచనా. ఎలా చూసినా ఏడాదికి రూ. 12 కోట్లు ఎక్కడికి పోవు. 

కంపాలా సిటీ కేబుల్‌ సంస్థను పుష్కర కాలం  క్రితం ఉగాండాలో  ఎంఎస్‌ పార్ధసారధి 34 శాతం - ఏ. సతీష్‌ కుమార్‌ - బి.ఆర్‌. శ్రీ లక్ష్మి 33 శాతం వంతున వాటాతో ప్రారంభించారు. కొద్ది రోజులకు సతీష్‌ కుమార్‌ తన వాటాను  బర్కత్‌ ఆలీ - బీఎస్‌ రమేష్‌ బాబు - అమీర్‌ ఆలీ జాసన్‌ కు అమ్మారు. 2009 నవంబర్‌ 27న కంపాలా సిటీ కేబుల్‌ లిమిటెడ్‌ లోకి ఎంఎస్‌ పార్ధసారధి - బర్కత్‌ ఆలీ - అమీర్‌ ఆలీ జాసన్‌ - బీఎస్‌ రమేష్‌ బాబు పేరుతో ఉన్న 2.35 లక్షల షేర్లను 40 కోట్ల షిల్లాంగులు... అంటే మన రూపాయల్లో 80 లక్షలు వెచ్చించి ఆర్పీ కొనుగోలు చేశారు. అదే రోజున సీహెచ్‌ వీఆర్‌ సుబ్బారావు కూడా 16 కోట్లకు పైగా షిల్లాంగులు చెల్లించి (మన కరెన్సీలో రూ. 34 లక్షలు) 23,850 షేర్లు కొన్నారు. మెజారిటీ షేర్లు కొన్న ఆర్‌పీ ఆ కంపెనీలో షేర్లే లేని రమేష్‌ బాబు - వేముపాటి శ్రీధర్‌ - సీహెచ్‌ వీఆర్‌ సుబ్బారావు - శింగిరి మధుసూధన్‌ ను డైరెక్టర్లుగా చేర్చుకున్నారు.

సుబ్బారావు  రూ. 34 లక్షలతో 23,850 షేర్లు కొంటే... రూ. 80 లక్షలతో రవిప్రకాష్‌ 2.35 లక్షల షేర్లు కొన్నారు. సుబ్బారావు కొన్న ఒక్కో షేర్‌ ధర రూ. 140 అయితే మన మెరుగైన సమాజం ఆర్‌పీ కొన్న షేర్‌ ధర రూ. 35. అంటే ఆర్‌ పీకి రూ. 105 తక్కువకు ఒక్కో షేర్‌ లభించింది. ఇద్దరూ ఒకేరోజు షేర్లు ఒకే ధరకు కొనాలి. ధరలో ఇంత వ్యత్యాసం ఎందుకుంది. ఒక్కో షేర్‌ను ఆర్‌పీ కూడా రూ. 140కి కొంటే  రూ. 3.29 కోట్లు చెల్లించాలి. ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఉన్న వారికి ఆర్‌పీపై అంత ప్రేమ ఎందుకుంటుంది. ఏదో ఒక రకంగా వారికి ఉపయోగపడితే తప్ప. ఒకవేళ ఆర్‌ పీ రూ. 80 లక్షలు అధికారికంగా చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని హవాలా రూపంలో - మనీ లాండరింగ్‌ ద్వారా చెల్లించారా...? ఈ ప్రశ్నన్నింటికీ సమాధానం రావాలంటే లోతైన విచారణ జరగాల్సిందే. ఏడాదికి రూ. 12 కోట్లు ఆదాయం వచ్చే వ్యాపారాన్ని ఎవరైనా ఇతరులకు అమ్మాలంటే  సాధారణంగా  5 రెట్లు ఎక్కువకు విక్రయిస్తారు. ఆ లెక్కన రూ. 60 కోట్లు ఆర్‌పీ బృందం చెల్లించాలి. అయితే వారు చెల్లించింది రూ. 80 లక్షలు మాత్రమే. ఇంత తక్కువకు  షేర్ హోల్డర్లు అమ్మటం వెనుక ఏం జరిగింది - ఒకవేళ ఆర్‌ పీ మొత్తం చెల్లించి ఉంటే ఎలా చెల్లించారో ఇపుడు తేలాల్సి ఉంది

ఆర్‌ పీ పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు ఏమీ కాదు. తొలుత ఓ చిన్న పత్రికలో - ఆ తరువాత సిటీ కేబుల్‌ లో - అక్కడి నుంచి జెమినీ టీవీలోకి వచ్చి  జీతంతో  ఉద్యోగాలు చేశారు. 2003లో టీవీ9లో 10 శాతం వాటాతో డైరెక్టర్‌ గా చేరి ఇటీవలనే తొగించబడ్డారు. కొద్ది రోజు క్రితం బ్రేక్‌ ఈవెన్‌ లోకి వచ్చిన టీవీ9లో ఎంత డైరెక్టర్‌ అయినా వందల కోట్లు సాధించటం ఎలా సాధ్యం అన్నది ఇపుడు అందరినీ వేధిస్తున్న అనుమానం. టీవీ9లో అందరు ఉద్యోగులతో పాటు ఆర్‌ పీకి జీతంతో పాటు బోనస్‌ వచ్చి ఉంటుంది. జీతం - బోసస్‌ తో కాలం  వెళ్లబుచ్చే ఆర్‌ పీ ఆఫ్రికా ఖండంలో కేబుల్‌ వ్యవస్థను విస్తరించటంతో పాటు త్వరలో డీటీహెచ్‌(డైరెక్ట్‌ టు హోం) వ్యాపారంలోకి రూ. 200 కోట్ల  పెట్టుబడితో వస్తానని చెప్తున్నారంటే అంత డబ్బు ఎలా వచ్చింది - కేబుల్‌ వ్యాపారం ఎలా వచ్చిందనేది సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అంశాలు .
   

Tags:    

Similar News