ర‌విప్ర‌కాశ్ వారి స‌రికొత్త‌ సొంత దుకాణం..

Update: 2019-07-15 09:40 GMT
తిట్టే నోరు.. తిరిగే కాలు ఊరికే ఉండ‌దంటారు. అలాంటిది ఏళ్ల‌కు ఏళ్లుగా న్యూస్ చాన‌ల్ న‌డ‌ప‌ట‌మే కాదు.. దాన్ని నెంబ‌రు వ‌న్ పొజిష‌న్లో ఉంచుతూ (మ‌ధ్యమ‌ధ్య‌లో ర్యాంకులు మారాయ‌నుకోండి) సాగ‌టం మామూలు విష‌యం కాదు. మ‌రే తెలుగు టీవీ చాన‌ల్ కు లేనంత క్రేజ్ టీవీ9కు తీసుకురావ‌టంలో ర‌విప్ర‌కాశ్ గొప్ప‌త‌నం ఉంద‌ని కొంద‌రు.. అదేమీ లేదు.. అందులో ప‌ని చేసే వారి తీరే కాస్త స‌ప‌రేటు.. అదే ఆ స్థాయిలో ఉంటానికి కార‌ణ‌మ‌ని చెబుతారు.

ర‌విప్ర‌కాశ్ గొప్ప‌త‌నంతోనే టీవీ9 నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంటే.. ఆయ‌న వెళ్లినంత‌నే ఆ స్థానం నుంచి కింద‌కు రావాలి క‌దా? అని ప్ర‌శ్నించే వారికి త‌గ్గ‌ట్లే.. ఆయ‌న ఎగ్జిట్ అయ్యాక కూడా చాన‌ల్ నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్లో ఉండ‌టం చూసిన‌ప్పుడు.. చాన‌ల్ కు ఉండే ఇమేజ్ కు.. వ్య‌క్తికి మ‌ధ్య లింకు పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట‌ను కొంద‌రు చెబుతుంటారు.

టీవీ9 చాన‌ల్ త‌న చేతి నుంచి చేజారి.. మైహోం రామేశ్వ‌ర చేతికి వెళ్లిన త‌ర్వాత ఊహించ‌ని రీతిలో ర‌విప్ర‌కాశ్ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. అన్నింటికి మించి ఈ మొత్తం ఎపిసోడ్ లో అదిరే సీన్ ఏమైనా ఉందంటే.. టీవీ9 లోగోను 99వేల కు మోజో టీవీకి అప్ప‌గించేయ‌టం. మొత్తంగా ఆ వ్య‌వ‌హారాల‌న్ని ప్ర‌స్తుతం కోర్టు ముందుకు వెళ్ల‌టం తెలిసిందే. పోలీసు కేసుల నేప‌థ్యంలో కొంత‌కాలం అండ‌ర్ గ్రౌండ్ లో ఉండి.. ముంద‌స్తు బెయిల్ కోసం తిరిగిన ర‌విప్ర‌కాశ్ కు ఈ మ‌ధ్య‌నే బెయిల్ మంజూరు కావ‌టం తెలిసిందే.

మ‌రిప్పుడు ర‌విప్ర‌కాశ్ ఏం చేస్తున్నారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆయ‌న త‌న‌దైన సొంత చాన‌ల్ కోసం శ్ర‌మిస్తున్న‌ట్లు చెబుతున్నారు. త‌న‌కు ప‌రిచ‌య‌స్తుల సాయంతో ఆర్ ప్ల‌స్ పేరుతో ఒక చాన‌ల్ ను తెర మీద‌కు తెచ్చేందుకు వ‌ర్క్ వుట్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. త‌న పాత ప‌రిచ‌యాల‌తో ఒక టీంను ఏర్పాటు చేసుకున్న ర‌విప్ర‌కాశ్‌.. వారితో క‌లిసి కొత్త చాన‌ల్ ప‌నుల్ని వేగ‌వంతం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. త్వ‌ర‌లోనే త‌న చాన‌ల్ ను లాంఛ్ చేస్తార‌నిచెబుతున్నారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ర‌విప్ర‌కాశ్ తెర మీద‌కు తేనున్న చాన‌ల్ కు ఆర్ ప్ల‌స్ పేరును క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. తెలంగాణ‌లో 2023 నాటికి బీజేపీని అధికారంలోకి తీసుకురావాల‌న్న ప్ర‌య‌త్నంలో ఉన్న ర‌విప్ర‌కాశ్‌.. అందుకు త‌గ్గ‌ట్లే బీజేపీ ప్ర‌యోజ‌నాల్ని ప‌రిర‌క్షించేలా స‌ద‌రు చాన‌ల్ నురూపొందిస్తున్న‌ట్లు చెబుతున్నారు. బీజేపీ పెద్ద‌ల ఆశీస్సుల‌తోనే ఆయ‌న కొత్త చాన‌ల్ ప‌నుల్ని వేగ‌వంతంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి.. త‌న కొత్త చాన‌ల్ గురించిన ప్ర‌క‌ట‌న ఎప్పుడు చేస్తారో చూడాలి. ఒక‌వేళ ఈ న్యూస్ నిజ‌మై.. ఆర్ ప్ల‌స్ చాన‌ల్ తెర మీద‌కు వ‌స్తే.. తెలుగు టీవీ న్యూస్ రంగంలో మ‌రిన్నిసంచ‌ల‌నాలు ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కీ.. కొత్త చాన‌ల్ వ్య‌వ‌హారం ఎంత‌వ‌ర‌కూ క‌రెక్ట్ అన్న‌ది ర‌విప్ర‌కాశే క‌న్ఫ‌ర్మ్ చేయాలి.   
Tags:    

Similar News