పుత్రోత్సాహం క‌రువై.. చ‌రిష్మా.. ఉండి కూడా చ‌తికిల‌ప‌డ్డారే..!

Update: 2021-05-16 11:30 GMT
జిల్లాల‌కు జిల్లాల‌నే శాసించారు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు.. రాజ‌కీయంగా త‌మ‌కు తిరుగు లేద‌ని అనుకున్నారు. నిజానికి అలాంటి రాజ‌కీయ‌మే చేశారు. అయితే.. త‌మ సొంత బిడ్డ‌ల‌ను మాత్రం లైన్‌లో పెట్టుకో లేక పోతున్నారు. వారే.. గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు చెందిన క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌లు. ఇద్ద‌రూ కూడా సీనియ‌ర్ మోస్టులే కావ‌డం గ‌మ‌నార్హం.అంతేకాదు.. ప్ర‌తి ఒక్క విష‌యంలోనూ మేమున్నామంటూ.. ప్ర‌జ‌ల‌కు సేవ చేసిన వారే. కానీ, ఇప్పుడు వారి త‌న‌యుల‌కు రాజ‌కీయంగా నిల‌బెట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ పొలిటిషీయ‌న్‌ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంలు రాజ‌కీయాల్లో చాలా సీనియ‌ర్లు. వ‌య‌సు చేత కొంత మేర‌కు అనారోగ్యంలో ఉన్న రాయ‌పాటి.. తన కుమారుడికి రాజ‌కీయంగా మార్గం చూపించాల‌ని.. రెండేళ్లుగా భావిస్తున్నారు. నిజానికి ఈయ‌న‌కు చాలానే చ‌రిష్మా ఉంది. కానీ, ఎవ‌రూ కూడా ఈయ‌న‌ను ప‌ట్టించుకుంటున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం టీడీపీలోనే ఉన్న రాయ‌పాటి.. త‌న కుమారుడి కోసం.. అంటూ.. ఇటీవ‌ల బీజేపీ వైపు కూడా చూశార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది.

అయితే, తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక త‌ర్వాత బీజేపీ పుంజుకుంటే.. నిర్ణ‌యం తీసు కుందామ‌ని అనుకున్నారు. కానీ, బీజేపీ అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. ఇక‌, రాయ‌పాటి వార‌సుడు రంగారావుకు టీడీపీ నేత‌లు క‌లిసిరాకపోవ‌డంతో ఆయ‌న కూడా పార్టీలో యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. దీంతో ఇప్ప‌ట్లో క్లారిటీ వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీలకు. స‌త్తెన‌ప‌ల్లి సీటు విష‌యంలో బాబు క్లారిటీ ఇస్తార‌ని రాయ‌పాటి ఫ్యామిలీ ఆశ‌తో ఉంది. ఇక‌, క‌ర‌ణం విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న త‌న కుమారుడు వెంక‌టేష్‌ను రాజ‌కీయంగా దూకుడుగా చూడాల‌ని అనుకున్నారు.

ఒక‌సారి అద్దంకి నుంచి పోటీ చేయించారు. అయినా.. కూడా ఆయ‌న విజ‌యం ద‌క్కించుకోలేదు. ఇక‌, ఇప్పుడు.. వైసీపీలో ఉన్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. వైసీపీ త‌ర‌ఫున టికెట్ ద‌క్కుతుందా ? పోటీ చేయించి.. గెలిపించుకుందామా ? అంటే.. దీనికి సంబంధించిన సంకేతాలు వైసీపీ అధిష్టానం నుంచి వినిపించ‌క‌పోవ‌డం.. క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో కూడా క‌ర‌ణం ఫ్యామిలీకి క్లారిటీ లేదు. దీంతో.. ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు కూడా త‌మ పుత్రుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు విష‌యంలో టెన్ష‌న్‌తోనే ఉన్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల క‌థ‌నం.





Tags:    

Similar News