మోడీ ఎంత గుట్టుగా పని పూర్తి చేశారంటే

Update: 2016-12-29 17:55 GMT
పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి యాభై రోజులైనా.. ఇప్పటికీ రచ్చ ఓ లెక్కకు రాలేదు. నోట్ల రద్దు పేరిట ప్రధాని మోడీ భారీ కుంభకోణానికే తెర తీశారన్న ఆరోపణల్నికాంగ్రెస్ పార్టీ చేయటమేకాదు.. కొత్త సంవత్సరం తొలి వారం నుంచి దేశ వ్యాప్తంగా నిరసనలు పెద్ద చేయనున్నట్లు ప్రకటించింది. అయిన వాళ్లకు ముందే చెప్పేసి మరీ.. వారందరికి ప్రయోజనాన్ని చేకూర్చిన తర్వాతే తాపీగా నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా ఆరోఫిస్తున్నారు విపక్ష నేతలు.

ఇదిలా ఉంటే.. ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. పెద్దనోట్లను రద్దు చేస్తున్న విషయాన్ని మోడీ ఎంత గుట్టుగా ఉంచారంటే.. ఈ మొత్తం ప్రక్రియకు గుండెకాయ లాంటి ఆర్ బీఐకి కూడా తాను నిర్ణయాన్ని ప్రకటించటానికి మూడు గంటల ముందు మాత్రమే వెల్లడించారట. ఆ విషయాన్ని ఆర్ బీఐ అధికారికంగా చెబుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశ ప్రజల్లో ఎంత మంది స్వాగతించారు? ఎంతమంది వ్యతిరేకించారన్న విషయాన్ని తాము రికార్డు చేయలేదని ఆర్ బీఐ ప్రకటించింది.

సమాచార హక్కు చట్టం కింద బ్లూమ్ బర్గ్ న్యూస్ సంస్థ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆర్ బీఐ.. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆర్ బీఐ కు ప్రధానమంత్రి మూడు గంటల ముందే వెల్లడించారని వెల్లడించారు. నవంబరు 8న జరిగిన రిజర్వ్ బ్యాంకు బోర్డు సమావేశంలో పెద్దనోట్ల రద్దుపై సాయంత్రం 5.30 గంటలకు నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. ఆ సమావేశంలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్.. ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు (గాంధీ.. ముంద్రా.. విశ్వనాథన్)లతో పాటు.. పలువురు ఆర్థిక నిపుణులు.. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ కూడా ఉన్నట్లుగా వెల్లడించారు. మొత్తానికి తన గుట్టుతో ఆర్ బీఐని కూడా మోడీ షాకిచ్చినట్లుగా అనిపించక మానదు.
Tags:    

Similar News