2వేల నోటు డిజైన్ వెనుక పెద్ద క‌థే ఉంది

Update: 2017-01-28 10:00 GMT

రూ.5000 - రూ.వెయ్యి నోటు ర‌ద్దు చేస్తూ న‌వంబ‌ర్ 8వ తేదీ రాత్రి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. అయితే నోట్ల కొర‌త‌తో ఒక‌వైపు జ‌నాలు స‌త‌మ‌తం అవుతుంటే రూ.2వేలు - రూ500 నోట్లు ముఖ్యంగా కొత్త 2వేల నోట్లు భారీ సంఖ్య‌లోనే వినియోగంలోకి వ‌చ్చాయి. ఈ ప‌రిణామంలో అంద‌రికీ క‌లిగిన సందేహం ఏమిటంటే... వంద రూపాయ‌ల నోట్లు - ఐదు వంద‌ల నోట్లు ముద్రించ‌కుండా రూ.2000 నోట్ల‌ను ఇంత ఎక్కువ సంఖ్య‌లో ఎందుకు ముద్రించాల్సి వ‌చ్చింది? అది కూడా పెద్ద ఎత్తున ఇప్ప‌టికిప్పుడు ఎలా ముద్రించారు అనేది. ఇలాంటి సందేహంతోనే ఓ టీవీ ఛాన‌ల్  స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద‌ వేసిన పిటీష‌న్‌ కు స్పందించిన రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇచ్చింది.

న‌వంబ‌ర్ 8న పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన కేంద్ర ప్ర‌భుత్వం - దానికి అయిదు నెల‌ల ముందే కొత్త నోట్ల‌పై నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆర్బీఐ పేర్కొంది.  రూ.2వేల నోటు డిజైన్‌ కు గ‌త ఏడాది జూన్ 7వ తేదిన కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన‌ట్లు ఆర్బీఐ వెల్ల‌డించింది. వాస్త‌వానికి కొత్త నోట్ల డిజైన్‌ కు గ‌త ఏడాది మే 19న ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఆ త‌ర్వాతే ఆ కొత్త నోట్ల‌కు కేంద్రం కూడా త‌న ఆమోదాన్ని ప్ర‌క‌టించింది. ఇదిలాఉండ‌గా కొత్త 2వేలు - 500 నోట్ల‌ను ముద్రించేందుకు ఎంత కాలం ప‌డుతుంద‌ని వేసిన ప్ర‌శ్న‌కు మాత్రం ఆర్బీఐ స‌మాధానం ఇచ్చేందుకు నిరాక‌రించింది. స‌మాచారం వెల్ల‌డించ‌డం వ‌ల్ల దేశ స‌మ‌గ్ర‌త దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని ఆర్బీఐ త‌న రిపోర్ట్‌ లో పేర్కొంది. నోట్ల ర‌ద్దుపై వేసిన మ‌రో ఆర్టీఐ ప్ర‌శ్న‌కు కూడా ఆర్బీఐ స్పందించింది. పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయాల‌ని న‌వంబ‌ర్ 8వ తేదీన కేంద్రానికి సూచ‌న చేశామ‌ని ఆర్బీఐ తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News