ఉర్జిత్ ఏకంగా ఇంటర్వ్యూనే ఇచ్చేశారు

Update: 2016-11-28 04:04 GMT
ప్రధాని మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు ఎపిసోడ్ లో అట్టర్ ప్లాప్ అయినట్లుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్  ఉర్జిత్ పటేల్ పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో ప్రధాని మోడీ పక్కనే ఉండి మాట్లాడిన ఆయన.. ఆ తర్వాత ఇప్పటివరకూ మీడియా ముందుకు వచ్చి పెదవి విప్పింది లేదు. రద్దు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కొరతకు ఉర్జిత్ పటేల్ అంచనాల్లో వచ్చిన తేడానే అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నింటికి ఆర్ బీఐ గవర్నర్ వేసుకున్న అంచనాల్లో చోటు చేసుకున్న లోపాలేనని తేల్చటమే కాదు.. ప్రధాని మోడీ ఆయనపట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న మాటలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ.. ఉర్జిత్ పెదవి విప్పటమే కాదు.. ఒక వార్తా ఏజెన్సీకి ఏకంగా ఇంటర్వ్యూ ఇచ్చేశారు. రద్దు నిర్ణయాన్ని ప్రధాని ప్రకటించిన తర్వాత ఉర్జిత్ తొలిసారి పెదవి విప్పటం ఒక విశేషమైతే.. ఆయనేం చెప్పారో చూస్తే..

నోట్ల అనంతరం చోటు చేసుకున్న సంక్షోభ పరిస్థితిని రోజూ సమీక్షిస్తున్నామన్న ఆయన.. పన్నులు చెల్లించే వారు రద్దు కారణంగా ఎదుర్కొంటున్న కష్టాల నుంచి త్వరలోనే ఉపశమనం కలిగిస్తామన్న భరోసా ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని వీలైనంత వేగంగా సాధారణ స్థితికి తెచ్చేందుకు తాము కట్టుబడి ఉంటామన్నారు. అదే సమయంలో నగదుకు ప్రత్యామ్నాయమైన కార్డులు.. డిజివాలెట్లను వాడాలన్న సూచన చేశారు. నగదు రహిత లావాదేవీలు చౌకగా.. సులభంగా మారతాయని.. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ ను ఉంచేందుకు క్యాష్ లెస్ లావాదేవీలు సాయం చేస్తాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

రద్దు నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకు ఉర్జిత్ బదులిస్తూ.. ఈ ప్రశ్నకు ఇప్పటికే ప్రధాని మోడీ సమాధానం ఇచ్చారని.. పన్ను కట్టని పెద్ద పెద్ద వారి వద్ద భారీగా నగదు ఉందని.. ఇలాంటి వారికి చెక్ చెప్పేందుకు రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వెల్లడించిన ఆయన.. రియల్ ఎస్టేట్ తరహా కొన్ని రంగాల్లో పన్ను ఎగవేతకు పాల్పడుతూ.. పెద్దనోట్లతో లావాదేవీలు జరుపుతున్న విషయాన్ని గుర్తు చేశారు. రద్దు నిర్ణయం తర్వాత తాము ప్రతి రోజూ బ్యాంకులతో సమీక్ష జరుపుతున్నామని.. క్రమక్రమంగా పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. బ్యాంకుల వద్దా.. ఏటీఎంల వద్దా.. క్యూలైన్లు తగ్గుతున్నాయని.. రోజువారీ వినియోగ వస్తువుల కొరత కనిపించటం లేదన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. దానికి పరిష్కార మార్గం సిద్ధం చేశామన్నారు.

కొత్త కరెన్సీకి తగ్గట్లు ఏటీఎంలను మార్చేందుకు వీలుగా 50వేల మంది నిపుణులను రంగంలోకి దించిన విషయాన్ని చెప్పిన ఉర్జిత్..రద్దు ఎపిసోడ్ లో బ్యాంక్ సిబ్బంది ఎంతగానో కష్టపడ్డారన్నారు. పాతనోట్లతో పోలిస్తే.. కొత్త నోట్ల సైజు.. మందంలో తేడా ఉండటాన్ని ప్రశ్నించగాఉర్జిత్ బదులిస్తూ.. దొంగ నోట్ల ముద్రణకు ఏ మాత్రం అవకాశం లేకుండా ఉండేందుకు వీలుగా కొత్త కరెన్సీలో పలు ఫీచర్లను చేర్చామని.. అందుకే పాతనోట్లతో పోలిస్తే కొత్త నోట్లు భిన్నంగా ఉన్నాయని చెప్పారు.

చెలామణిలో ఉన్న పాత కరెన్సీని తొలగించటం చాలా కష్టమైన పనిగా ఉర్జిత్ అభివర్ణించారు.జన్మకో శివరాత్రి మాదిరి కార్యక్రమంగా నోట్ల రద్దును ఆయన అభివర్ణించారు. చలామణీలో ఉన్న 86 శాతం కరెన్సీని తొలగించటం చాలా కష్టమైన అంశమని.. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు గోప్యతను పాటించామని.. నోట్ల రవాణా చాలా క్లిష్టమైన అంశంగా ఆయన చెప్పారు. పన్ను ఎగవేతదారులకు చెక్ చెప్పేందుకు.. బ్లాక్ మనీని పారదోలేందుకే రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News