ఉర్జిత్ ప‌టేల్ అడ్ర‌సెక్క‌డ‌?

Update: 2016-11-24 07:05 GMT
నవంబర్‌ 8న రూ 500 - రూ 1000 నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన మరుక్షణం తెరపైకి వచ్చిన ఉర్జీత్‌ పటేల్‌ ఇక అప్పటి నుంచి ఎక్కడా కనిపించక‌పోవ‌డంపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో కరెన్సీ సంక్షోభం నెలకొని సామాన్యులు చిల్లర కష్టాలు ఎదుర్కొంటుంటే ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జీత్‌ పటేల్‌ నుంచి ఉలుకూ పలుకూ లేదు. నోట్ల దుమారం సుప్రీం కోర్టును తాకి - దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న వేళ ఏకంగా బ్యాంక్‌ యూనియన్ల నేతలే ఆర్‌ బీఐ గవర్నర్‌ ఉర్జీత్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తుండటం గమనార్హం.

నోట్ల కొరతతో దేశం హాహాకారాలు పెడుతుంటే అనునయించడ‌మో - త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు ప్ర‌క‌టించాల్సిన కీలక అధికారి నోరు మెదపక‌పోవ‌డంతో ఏమిట‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నారు.  ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయంపై ఊర్జిత్‌ కు ముందస్తు సమాచారం ఉన్నా అందుకు అనుగుణమైన ప్రణాళిక రూపకల్పన - అమలులో ఘోరంగా విఫలమయ్యారని ప్రస్తుత సంక్షోభం కళ్లకు కడుతున్నదని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. జనసామాన్యాన్ని - ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే ఇలాంటి పెద్ద నిర్ణయాలను సహజంగా ముందస్తు కసరత్తుతో అత్యంత జాగ్రత్తగా తీసుకుంటారు. ఎలాంటి పరిస్థితి తలెత్తినా సర్దుబాటు చేసుకునేందుకు ప్రజలకు తగినంత సమయమిస్తారని న్యూయార్క్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కు సలహాదారుగా వ్యవహరించే కార్నెల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ హకెట్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ఉర్జీత్‌ పటేల్‌ స్వభావరీత్యా మెతక వైఖరి ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దుతో చేపట్టిన దూకుడు నిర్ణయానికి మరింతగా ఊతమిచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్ర‌ణాళిక లేని నోట్ల ర‌ద్దుతో త‌న‌కు ఒకింత చెడ్డ‌పేరు వ‌చ్చిన నేప‌థ్యంలో మీడియాకు దూరంగా ఉండాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి ఉర్జిత్‌ కు ఆదేశాలు వెల్లి ఉంటాయ‌నే చ‌ర్చ కూడా సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News