ఉర్జిత్ కు ఊపిరి ఆడనివ్వలేదట

Update: 2017-01-19 04:46 GMT
ఆర్ బీఐ గవర్నర్ పరిస్థితి దారుణంగా తయారైందని చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి కర్త.. కర్మ.. క్రియ అంతా ఎవరన్నది అందరికి తెలిసిందే. ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయానికి ఆర్ బీఐ ఓకే చెప్పాల్సి వచ్చిందన్నది పచ్చి నిజం. కానీ.. అన్నీ అందరికి తెలిసినప్పటికీ.. ఎవరికి వారు వారి.. వారి దర్మాల్ని నిర్వర్తించాల్సి ఉంటుందని.. కీలక స్థానాల్లోని వారు కొన్ని సమయాల్లో కరకుగా వ్యవహరించకపోతే ఏం జరుగుతుందన్నది ఉర్జిత్  ఎపిసోడ్ ను చూసినప్పుడు ఇట్టే అర్థమవుతుంది.

పెద్దనోట్ల రద్దు నిర్ణయం తదనంతర అంశాలపై కాంగ్రెస్ నేత ఎం. వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం ఆర్ బీఐ అధికారులను తన ముందుకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. పార్లమెంటరీ స్థాయి సంఘం ఆదేశాల నేపథ్యంలో ఆర్ బీఐ గవర్నర్ తో పాటు.. ఆర్థిక శాఖ అధికారులు సంఘం ముందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనపై స్థాయి సంఘం ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.

నగదు విత్ డ్రాయిల్స్ మీద పరిమితులు ఎప్పుడు ఎత్తి వేస్తారు? మళ్లీ పరిస్థితులు సాధారణంగా ఎప్పటికి తయారవుతాయి? పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చిన పెద్ద నోట్ల లెక్క ఎంత? లాంటి కీలకమైన ప్రశ్నల్ని సంధించారు. దీనికి ఉర్జిత్ అండ్ కో సమాధానాలు చెప్పలేకపోయిందని చెబుతున్నారు. స్థాయి సంఘం అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పలేదని.. చూస్తుండే పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై ఆర్ బీఐ అధికారులు రక్షణాత్మక వైఖరిని అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోందన్న మాట స్థాయి సంఘం అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.

సాంకేతికంగా చూసినప్పుడు పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై  ఆర్ బీఐ ఆమోద ముద్ర వేసినట్లు కనిపించినా.. అసలేం జరిగిందన్నది తెలిసిందే. అయితే.. అవన్నీ చెప్పలేని పరిస్థితి. ఒకవేళ చెప్పినా.. వ్యవస్థలు ఒప్పుకోవు. అందుకే..  ఉర్జిత్ అండ్ కో ధర్మసంకటంలో చిక్కుకుపోయినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యూహాన్ని మొత్తంగా చెప్పేయటానికి వీల్లేని పరిస్థితి ఏర్పడటం.. చెబితే ప్రభుత్వానికి ఇబ్బంది.. చెప్పకుంటే స్థాయి సంఘం నుంచి వచ్చే ప్రశ్నాస్త్రాలకు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేయాల్సినదుస్థితిగా తెలుస్తోంది. ప్రస్తుతానికి రెండో పద్ధతినే ఉర్జిత్.. ఆర్థిక సంఘ అధికారులు వ్యవహరించినట్లు సమాచారం.

అయితే.. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాల్ని ఉర్జిత్ వెల్లడించినట్లుగా చెబుతున్నారు. 2016 తొలినాళ్ల నుంచి పెద్దనోట్ల రద్దు అంశంపై ప్రభుత్వం.. ఆర్ బీఐ మధ్య చర్చలు జరుగుతున్న విషయాన్ని ఉర్జిత్ చెప్పారట. పెద్దనోట్ల రద్దు వెనుక ప్రభుత్వ ప్రధాన ఉద్దేశాన్ని ఆర్ బీఐ కూడా ఆమోద యోగ్యంగా పరిగణించిందని పేర్కొన్నారు.

పెద్దనోట్ల రద్దు అనంతరం దాదాపు రూ.9.2లక్షల కోట్లు విలువైన కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశ పెట్టినట్లుగా కమిటీకి ఉర్జిత్ వివరించారు. అయితే.. రద్దు చేసిన పెద్దనోట్లు ఎన్ని అన్న కచ్ఛితమైన లెక్కను మాత్రం ఉర్జిత్ చెప్పలేకపోయారు. తాము అడిగిన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానం రాని నేపథ్యంలో మరో దఫా ప్రశ్నించాలని స్థాయి సంఘం నిర్ణయించినట్లు చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఏమో కానీ.. ఆర్ బీఐ గవర్నర్ గా ఉర్జిత్ కు చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News