2వేల నోటుపై కొత్త విష‌యం బ‌య‌ట‌కొచ్చింది

Update: 2017-12-21 05:01 GMT
ఒక నోటు చ‌లామ‌ణిలోకి రావ‌టానికి ముందు నుంచే సంచ‌ల‌న వార్త‌గా మార‌ట‌మే కాదు.. మార‌కంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా బోలెడ‌న్ని వార్త‌లు రావ‌టం రూ.2వేల నోటుకు మాత్ర‌మే చెల్లుతుంది. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసిన మోడీ స‌ర్కారు.. అప్ప‌టికి చెలామ‌ణిలో ఉన్న పెద్ద‌నోటుకు రెట్టింపు విలువ ఉన్న మ‌రింత పెద్ద నోటును విడుద‌ల చేయ‌టం తెలిసిందే.

రూ.2వేల నోటు చెలామ‌ణిలోకి రావ‌టానికి ముందు నుంచే ఈ నోటు మీద చాలానే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ నోటుకు సంబంధించి ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది ప్ర‌స్తుతానికైతే.. రూ.2వేల నోటు ప్రింటింగ్‌ను నిలిపివేసిన‌ట్లుగా చెబుతున్నారు. భారీ సంఖ్య‌లో చెలామ‌ణిలోకి రాని నోట్లు ఇంకా రిజ‌ర్వ్ బ్యాంక్ ద‌గ్గ‌ర చాలా ఉన్నాయ‌ని చెబుతున్నారు.

పంపిణీలోకి తేవాల్సిన రూ.2వేల నోట్లు భారీ ఎత్తున ఉండ‌టంతో.. ఇప్ప‌టికైతే రూ.2వేల నోటు ప్రింటింగ్‌ను నిలిపివేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. రూ.2వేల నోటు విష‌యంలో వినిపిస్తున్న ఆందోళ‌న‌ల గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు. రూ.2వేల నోటు విడుద‌ల‌లో మోడీ భారీ స్కెచ్ వేశార‌ని.. ఈ నోటు పంపిణీలోకి వ‌చ్చిన కొంత‌కాలానికి రూ.వెయ్యి నోటును ఏ రీతిలో అయితే ర‌ద్దు చేశారో.. రూ.2వేల నోటును ర‌ద్దు చేసి బ్లాక్ మ‌నీగాళ్ల‌కు భారీ షాక్ ఇస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే.. అలాంటిదేమీ జ‌ర‌గ‌ద‌న్న మాట‌ను ప్ర‌భుత్వ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

డిసెంబ‌రు 8 నాటికి ఆర్ బీఐ రూ.500 నోట్ల‌కు సంబంధించి రూ.13,324 బిలియ‌న్లు విలువ చేసే నోట్ల‌ను ప్రింట్ చేయ‌గా.. రూ.2వేల నోటు విష‌యానికి వ‌స్తే.. రూ.3654 మిలియ‌న్ల విలువైన నోట్ల‌ను ప్రింట్ చేసింది. ఈ నోట్ల విలువ రూ.15787గా చెబుతున్నారు. డిసెంబ‌రు 8నాటికి చెలామ‌ణిలోకి వ‌చ్చిన పెద్ద‌నోట్లు కాకుండా ఆర్ బీఐ ద‌గ్గ‌ర రూ.2463 బిలియ‌న్లు విలువ చేసే నోట్లు అలానే ఉన్నాయ‌ట‌. దీంతో.. రూ.2వేల నోట్ల ప్రింటింగ్‌ ను నిలిపివేసి.. చిన్న‌నోట్ల ప్రింటింగ్ మీద దృష్టి పెట్ట‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. రూ.2వేల నోటు వ‌చ్చిన త‌ర్వాత చిల్ల‌ర నోట్ల స‌మ‌స్య తీవ్రంగా ఉంది. దీన్ని తీర్చేందుకు రూ.200నోట్ల‌ను ఆర్ బీఐ ప్ర‌వేశ పెట్టిన‌ప్ప‌టికీ ఇంకా వాడ‌కంలోకి పెద్ద‌గా రాలేదు. ఇప్పుడు రూ.2వేల నోట్ల ప్రింటింగ్ నిలిపివేసి.. చిల్ల‌ర నోట్ల ప్రింటింగ్ మీద ఫోక‌స్ పెట్టిన నేప‌థ్యంలో.. చిల్ల‌ర స‌మ‌స్య రానున్న కొద్ది నెల‌ల్లో త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News