మోడీ స‌ర్కార్ ఓకే అంటే.. రూ.200 నోటు

Update: 2017-04-04 04:35 GMT
ఇప్ప‌టివ‌ర‌కూ రూ.100 త‌ర్వాత రూ.500 నోటు మాత్ర‌మే చ‌లామ‌ణిలో ఉంది. అయితే.. ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో.. స‌రికొత్త ప్ర‌తిపాద‌న ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని మోడీ తీసుకున్న నిర్ణ‌యం నేప‌థ్యంలో.. నోట్ల కొర‌త తీవ్రంగా ఉంది. నోట్లకు బ‌దులుగా ప్లాస్టిక్ మ‌నీని.. ఆన్ లైన్ లావాదేవీల్ని ప్రోత్స‌హించేందుకు మోడీ స‌ర్కారు ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా.. ఫ‌లితాలు మాత్రం అంతంత‌మాత్రంగానే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ర‌ద్దు చేసేసిన వెయ్యి రూపాయిల స్థానంలో కొత్త నోటులేవీ రాక‌పోవ‌టం తెలిసిందే.

ఇప్ప‌డు చెలామ‌ణిలో ఉన్న పెద్ద నోట్ల‌ను చూస్తే.. రూ.2వేలు.. రూ.500.. రూ.100 మాత్ర‌మే. రెండు వేల నోటుకు రూ.500 నోటుకు మ‌ధ్య‌లో మ‌రో నోటు లేక‌పోవ‌టంలో తీవ్ర ఇబ్బందుల‌కుగురి అవుతున్నారు. ఈ కార‌ణంగా చిల్ల‌ర స‌మ‌స్య త‌ర‌చూ ఎదుర్కొనే ప‌రిస్థితి. దీన్ని అధిగ‌మించ‌టానికి రిజ‌ర్వ్ బ్యాంక్ కొత్త ఆలోచ‌న చేసింది. తాజాగా ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు వీలుగా రూ.200 నోటును మార్కెట్లోకి తీసుకురావాల‌న్న భావ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ప‌నులు ఇప్ప‌టికే మొద‌లైన‌ట్లుగా తెలుస్తోంది. త‌మ ప్ర‌తిపాద‌న‌ను మోడీ స‌ర్కారుకు పంపిన‌ట్లుగా చెబుతున్నారు. రూ.200 నోట్ల‌ను తీసుకురావాల‌న్న ఆర్‌ బీఐ ప్ర‌తిపాద‌న‌కు మోడీ స‌ర్కారు సానుకూలంగా స్పందించిన ప‌క్షంలో రూ.200 నోటు రావ‌టం ఖాయ‌మంటున్నారు. ఈ నోటు కానీ మార్కెట్లోకి వ‌స్తే.. చిల్ల‌ర నోట్ల స‌మ‌స్యకు ప‌రిష్కారం అవుతుంద‌ని.. పెద్ద నోటు కాక‌పోవ‌టంతో న‌ల్ల‌ధ‌నం పెరిగిపోతుంద‌న్న భ‌యాందోళ‌న‌లు చెందాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని చెబుతున్నారు. మ‌రి.. రూ.200 నోటుకు మోడీ స‌ర్కారు ఓకే చెప్పేస్తారా? అదే జ‌రిగితే.. డినామినేష‌న్‌ కు సంబంధించి పెను మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంటుంది. బ్యాంకు ఏటీఎం మొద‌లు.. చాలానే మార్పులు చోటు చేసుకుంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News