మోడీ స‌ర్కారు ఏం చేయ‌ట్లేదో వెంక‌య్య చెప్పారా?

Update: 2017-12-07 05:08 GMT
తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరికే ఉండ‌ద‌ని చెబుతుంటారు. ఈ పోలిక చెప్పినంత‌నే చిన్న‌బుచ్చుకుంటారు కానీ.. ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య విష‌యంలో ఇది నిజమ‌ని చెప్పాలి. ఇక్క‌డ‌.. వెంక‌య్య‌ను అవ‌మానించ‌ట‌మో.. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌విని త‌క్కువ చేయ‌ట‌మో మా ఉద్దేశం ఎంత‌మాత్రం కాదు. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌విలో వెంక‌య్య లాంటి  నేత కూర్చోవ‌టంలోనే అస‌లు ఇబ్బంది అంతా. ఈ రోజున క్రియాశీల రాజ‌కీయాల్లో ఉన్న నేత‌లు.. అత్యున్న‌త స్థానాల్లో ఉన్న నేత‌ల‌తో పోలిస్తే.. వెంక‌య్య‌లో చురుకుద‌నం పాళ్లు వంద శాతం ఎక్కువ‌. ఆ విష‌యంలో రెండో మాట‌కు తావు లేదు.

చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఎన్నో వ్య‌వ‌హారాల్ని ఒంటి చేత్తో చ‌క్క‌బెట్టే వెంక‌య్య లాంటి నేత‌ను తీసుకుపోయి ఉప రాష్ట్రప‌తి కుర్చీలో కూర్చోబెడితే ఇబ్బందే. నోటికి తాళం వేసిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఎంతో అవ‌స‌ర‌మైతే త‌ప్పించి మాట్లాడ‌లేని రాజ్యాంగ ప‌ద‌వితో పాటు.. ఒక‌వేళ మాట్లాడినా ఎంత‌వ‌ర‌కు అంటే అంత వ‌ర‌క‌న్న‌ట్లుగా మాట్లాడాల్సిన ప‌రిమితుల మ‌ధ్య ఉండిపోయే ప‌ద‌విలో వెంక‌య్య లాంటి జెట్ స్పీడ్ నేత స‌రిపోరు.

అందుకేనేమో.. ఉప రాష్ట్రప‌తి కుర్చీలో కూర్చున్న కొద్ది రోజులు కామ్‌ గా ఉన్న వెంక‌య్య‌.. ఈ మ‌ధ్య‌న దాన్ని ప‌క్క‌న పెట్టేశారు. కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎంత‌లా టూర్లు వేసేవారో.. ఉప రాష్ట్రప‌తిగా కూడా ఆయ‌న వీలైనంత‌వ‌ర‌కూ బిజీబిజీగానే ఉంటున్నారు. వీలైన‌న్ని కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతున్నారు. అదే స‌మ‌యంలో కేంద్రంలో జ‌రుగుతున్న లోటుపాట్ల‌ను త‌న‌దైన శైలిలో మార్చి చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ప్ర‌ధాని మోడీకి త‌న ఆలోచ‌న‌ల అవ‌స‌రాన్ని తెలియ‌జేయ‌ట‌మే కాదు.. త‌న‌తో భేటీ అయితే మంచిద‌న్న సంకేతాన్ని వెంక‌య్య మాట‌లు ఉన్నాయా? అన్న సందేహాన్ని క‌లిగించేలా ఉన్నాయి.

పెద్ద‌నోట్ల ర‌ద్దుతో దేశానికి క‌లిగిన ప్ర‌యోజ‌నాల్ని.. ఆ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన త‌ర్వాత బ్యాంకుల్లో జ‌మ అయిన బ్లాక్ మ‌నీ వివ‌రాల్నిఆర్ బీఐ త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌. నిజానికి.. ఆయ‌న కూర్చున్న  కుర్చీలో ఉన్న వ్య‌క్తి ఈ త‌ర‌హా వ్యాఖ్య చేయ‌టం చాలా అరుదు. కాకుంటే.. ఈ మాట చెప్పింది వెంక‌య్య కావ‌టంతో ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

తాజాగా త‌న వ్యాఖ్య‌తో వెంక‌య్య ఏదైనా సందేశాన్ని ఇచ్చారా? అంటే అవున‌నే చెప్పాలి. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం కార‌ణంగా ప్ర‌భుత్వానికి వ‌స్తున్న చెడ్డ‌పేరును వెంక‌య్య దృష్టికి వ‌చ్చింద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌రిగే డ్యామేజ్  ను కంట్రోల్ చేయ‌టానికి వీలుగా  వెంక‌య్య చేసిన సూచ‌న లాభిస్తోంద‌న్న మాట చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న‌తో భేటీ కావ‌టం ద్వారా త‌మ స‌ర్కారు ఎక్క‌డెక్క‌డ ఏమేం త‌ప్పులు చేస్తుంద‌న్న విష‌యాన్ని తాను చెప్ప‌గ‌ల‌న‌న్న మాట‌ను త‌న వ్యాఖ్య ద్వారా మోడీకి సందేశాన్ని ఇచ్చి ఉంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అవినీతికి అడ్డుక‌ట్ట వేసి.. బెడ్రూం..బాత్రూంల‌లో దాచిన న‌ల్ల‌ధ‌నాన్ని బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ద్వారా చలామ‌ణిలోకి తీసుకురావ‌టం పెద్ద‌నోట్ల ర‌ద్దు ఉద్దేశంగా చెప్పిన వెంక‌య్య‌.. బ్యాంకుల‌కు వ‌చ్చిన ధ‌నంలో న‌ల్ల‌ధ‌నం ఎంత‌?  తెల్ల‌ధ‌నం ఎంత‌న్న విష‌యాన్ని ఆర్ బీఐ తేల్చి ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. ఉప రాష్ట్రప‌తి హోదాలో ఉన్న వ్య‌క్తి ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తారా? అన్న‌ది ప్ర‌శ్న అయితే.. ఇదంతా ఎవ‌రికోసం.. ఏసందేశం కోస‌మ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News