సరికొత్త వెయ్యి నోటు వచ్చేస్తుందట

Update: 2016-11-28 04:26 GMT
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్న తర్వాత.. వెయ్యినోట్ల రద్దు శాశ్వితమన్న మాట వినిపించింది. ఇందుకు తగ్గట్లేగా వెయ్యి నోటు ప్రస్తావన ఎవరూ తీసుకురాని పరిస్థితి. భవిష్యత్తులో వెయ్యినోటు చలామణీలోకి తీసుకొచ్చే అవకాశం లేదన్న మాటల్ని బీజేపీ నేతల నోట వినిపించింది కూడా.అయితే.. వెయ్యినోటు విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లుగా చెబుతున్నారు.

రద్దు నేపథ్యంలో కరెన్సీ నోట్ల విషయంలో తీవ్ర కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. నోట్ల కొరతను తగ్గించేందుకు వీలుగా వెయ్యినోటును మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందని.. అప్పుడే కరెన్సీ కష్టాలు తగ్గుతాయన్న భావనను రిజర్వ్ బ్యాంక్ వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. మార్కెట్లో చలామణీలో ఉన్న 14.5 లక్షల కోట్ల రూ.వెయ్యి.. రూ.500నోట్లలో ఇప్పటివరకూ రూ.8లక్షల కోట్ల మొత్తం డిపాజిట్ల రూపంలో జమ అయినట్లు చెబుతున్నారు.

ఈ మొత్తానికే మార్కెట్లో నగదులభ్యత ఎంతగా తగ్గిపోయిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన మొత్తంలో మరికొంత మొత్తం వచ్చిన పక్షంలో.. అందుకు సరిపడా కొత్తనోట్లను మార్కెట్లోకి పంప్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిల్లర నోట్ల సమస్యలు తీవ్రం అవుతోంది. రూ.2వేల నోటు రాకతో.. చిన్న నోట్ల అవసరం మరింత పెరిగింది. మరోవైపు రూ.500 నోట్లు తక్కువగా విడుదల కావటం.. రూ.వెయ్యి నోటు లేకపోవటంతో అయితే రూ.2వేలు లేదంటే రూ.100 అన్నట్లుగా మారింది.

దీంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నోట్ల కొరతను అధిగమించటానికి కొత్త రూ.వెయ్యినోట్లను మార్కెట్లోకి విడుదల చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని.. నోట్ల కొరత దీర్ఘాకాలం కొనసాగకుండా చెక్ పెట్టొచ్చన్న భావన వ్యక్తమవుతోంది. నోట్ల కొరతకు చెక్ పెట్టే అంశంపై ఆర్ బీఐ అధికారుల చేస్తున్నవాదనలపై కేంద్రం దృష్టి సారించిందని.. వెయ్యి నోటును తిరిగి తీసుకొచ్చే విషయంపై చర్చలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.అన్ని అనుకున్నట్లే జరిగితే  కొత్త వెయ్యినోటు వచ్చేఅవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News