జూన్ తర్వాతే రద్దు లెక్కలు చెబుతారట

Update: 2017-02-09 04:58 GMT
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాదు.. ప్రపంచ దేశాలన్నీ విస్మయంతో చూసిన ఉదంతంగా పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని చెప్పాలి. కలలోకూడా ఊహించని ఈ నిర్ణయాన్ని అమలు చేయటమే కాదు.. ప్రధాని మోడీ చెప్పిన రీతిలో.. నగదు కష్టాలు తాత్కాలికమేనని.. ఏటీఎంల నుంచి విత్ డ్రా సమస్యల నుంచి త్వరలోనే ఊరట లభిస్తుందని ఆయన చెప్పినట్లే పరిణామాలు ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకోవటం తెలిసిందే.

సంక్రాంతి పండగ తర్వాత నుంచి ఏటీఎం కష్టాలకు తెర పడటమేకాదు.. మరో నెలలో ఎంత మొత్తం కావాలంటే అంత మొత్తం విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించనున్నట్లు ఆర్ బీఐ తాజాగా ప్రకటించిన వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. దానికి సంబంధించిన లెక్కల్ని ఇప్పటివరకూ చెప్పలేదు.

పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దాదాపు రూ.లక్ష నుంచి రూ.2లక్షల కోట్ల వరకూ నల్లధనాన్ని చెలామణీలో లేకుండా చేసే వీలుందన్న వాదనలు వినిపించింది. అదెంత నిజమన్న విషయం పెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్ బీఐకి చేరిన పాత కరెన్సీ లెక్క చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. రిజర్వ్ బ్యాంకు తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం జనవరి 27నాటికి దాదాపు రూ.9లక్షల కోట్లకు పైగా కొత్తనోట్లను చెలామణిలోకి తీసుకొచ్చిన విషయాన్ని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆర్ బీఐకి పాత నోట్లు ఎంతమొత్తంలో చేరాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.అయితే.. పాత నోట్ల లెక్కలు మొత్తంగా బయటకు రావాలంటే జూన్ తర్వాతేనని చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రవాసులు తమ దగ్గరి పాత నోట్లను మార్చుకోవటానికి జూన్ వరకూ టైం ఉన్న నేపథ్యంలో.. గడువు ముగిసిన తర్వాతే లెక్కలన్నీ పక్కాగా బయటకు వస్తాయని ఆర్ బీఐ చెబుతోంది. సో.. పెద్దనోట్ల రద్దు ప్రయోజనం ఎంతన్న విషయంలో స్పష్టత రావాలంటే జూన్ వరకూ వెయిట్ చేయాల్సిందేనన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News