అమ‌రావ‌తిలో రియ‌ల్ మంద‌గ‌మ‌నం.. కార‌ణమేంటంటే?

Update: 2019-06-17 08:56 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని అమ‌రావతిలో తాజా ఎన్నిక‌ల ముందు నాటి వ‌ర‌కు రియ‌ల్ ఎస్టేట్ ఓ రేంజిలో ఉండేది. రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌క ముందు ఎక‌రం రూ.10 నుంచి రూ.15 ల‌క్ష‌లుంటే... రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించాక ఈ ధ‌ర అమాంతంగా రూ.1.5 కోట్ల దాకా వెళ్లింది. అలా ఒక్క‌సారిగా లేచిన రియ‌ల్‌... ఇప్పుడు మాత్రం క్ర‌మంగా త‌గ్గిపోతోంద‌ట‌. ఇప్పుడు ఎక‌రం రూ.1 కోటి అన్నా కూడా కొనే నాథుడే క‌నిపిండ‌చం లేద‌ట‌. ఎందుకు?  కొత్త ప్ర‌భుత్వం అధికార ప‌గ్గాలు చేప‌ట్టినందుకేనా? అన్న కోణంలో ప‌లు పుకార్లు వినిపిస్తున్నాయి గానీ... అస‌లు కార‌ణం మాత్రం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలే ఈ త‌రుగుద‌ల‌కు కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. వైసీపీ అధినేత - కొత్త సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్టిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... అమ‌రావ‌తిలో రాజ‌ధానిని నిర్మించ‌ర‌ని ఓ వ‌ర్గం బాగానే ప్ర‌చారం చేసింది.

అయితే ఎన్నిక‌ల‌కు ముందే... తాను అధికారంలోకి వ‌చ్చినా... అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని నిర్మాణాన్ని చేప‌డ‌తాన‌ని - ఇందులో ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేద‌ని కూడా జ‌గ‌న్ తేల్చి చెప్పేశారు. ఇక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన త‌ర్వాత కూడా అమ‌రావ‌తిని త‌ర‌లించే ప్ర‌సక్తే లేద‌న్న కోణంలోనే ఆయ‌న సాగుతున్నారు. అంతేకాకుండా రాజ‌ధాని ప‌రిధిలో ఇప్ప‌టిదాకా జ‌రిగిన నిర్మాణాలు - కొనసాగుతున్న ప‌నులు - నిర్మాణాల‌ను ఎలాంటి ఆటంకం లేకుండానే సాగేలా జ‌గ‌న్ స‌ర్కారు చ‌ర్య‌లు చేప‌డుతోంది. మొత్తంగా ప‌రిస్థితి అంత‌గా భ‌య‌ప‌డేలా లేదు గానీ... ఎందుక‌నో రియ‌ల్ భూమ్ బాగా త‌గ్గుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయినా రాజ‌ధాని త‌ర‌లించ‌ట్లేద‌ని స్వ‌యంగా జ‌గ‌న్ చెప్పిన త‌ర్వాత కూడా అమ‌రావ‌తిలో రియ‌ల్ భూమ్ త‌గ్గుతోందంటే నిజంగానే ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిందే.

గ‌తంలో పంట పొలాలున్న భూముల్లో కొత్త‌గా భ‌వ‌నాలు వ‌చ్చేస్తున్నాయి. రాజ‌ధాని నిర్మాణంలో చంద్ర‌బాబు స‌ర్కారు శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న‌ సింగిల్ ఇటుక కూడా వేయ‌కున్నా... ఇప్ప‌టిదాకా క‌ట్టిన నిర్మాణాల‌న్నీ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న క‌ట్టిన‌వే. తాత్కాలిక నిర్మాణాలు క‌ట్టిన‌ప్పుడే రియ‌ల్ భూమ్ ఆకాశాన్నంటితే... ఇప్పుడు బంప‌ర్ మెజారిటీతో కొత్త‌గా అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్ స‌ర్కారు బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత రియ‌ల్ భూమ్ బాగా త‌గ్గిపోయిన‌ట్లుగా చూపుతున్న వైనం నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లిగించేదే. అయితే ప‌రిస్థితిని కాస్తంత లోతుగా చూస్తే... ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా... ఎక్కడైనా రియ‌ల్ భూమ్ బాగా ప‌డిపోవ‌డం సాధార‌ణ‌మే. ఈ క్ర‌మంలోనే ఈ ద‌ఫా ఎన్నిక‌లు సుదీర్ఘంగా జ‌ర‌గ‌డంతో ఎలాంటి ప్ర‌త్యేక కార‌ణాలు లేకుండానే అమ‌రావ‌తి రియ‌ల్ భూమ్ త‌గ్గింది.

ఇక జ‌గ‌న్ స‌ర్కారు అధికార బాధ్య‌త‌లు చేప‌ట్టి ఇంకా 20 రోజులు కూడా కాలేదు. అప్పుడే జ‌గ‌న్ అమరావ‌తిని త‌ర‌లించేస్తార‌న్న భ‌యాందోళ‌న‌ల‌తోనే అమ‌రావతిలో రియ‌ల్ భూమ్ ప‌డిపోయింద‌ని చెప్ప‌డం క‌రెక్ట్ కాద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా ఒక్క‌సారి మాట ఇస్తే త‌ప్ప‌ని వ్య‌క్తిగా జ‌గ‌న్ త‌న‌దైన ముద్ర సంపాదించుకున్నారు. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తిని జ‌గ‌న్ త‌ర‌లించ‌డం దాదాపుగా అసాధ్య‌మే. కొత్త ప్ర‌భుత్వం బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ప్రాథ‌మ్యాలు మాత్రం కాస్తంత మార‌డం స‌హ‌జ‌మే క‌దా. ఈ నేప‌థ్యంలోనే అమ‌రావ‌తి విష‌యంలో జ‌గ‌న్ ప్రాధమ్యాలేమిట‌న్న విష‌యం తేలే దాకా రియ‌ల్ భూమ్ స్త‌బ్దుగానే ఉండే అవ‌కాశాలున్నాయి. ఆ త‌ర్వాత గ‌తంలో మాదిరే రియ‌ల్ ఎస్టేట్ ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మేన‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News