విశాల్‌ కు మ‌ద్ద‌తిచ్చిన వారు కిడ్నాప్ అయ్యారా?

Update: 2017-12-07 14:49 GMT
అవును. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఇప్పుడు ఇదే అంశం చ‌ర్చ‌నీయాంంగా మారింది. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో దిగిన విశాల్‌కు మ‌ద్ద‌తిచ్చిన వారు కిడ్నాప్ అయ్యారా? అనేది తాజాగా విశాల్ వ్య‌క్తం చేస్తున్న ఆవేద‌న‌ను బ‌ట్టి క‌లుగుతున్న సందేహం. రాజకీయ అరంగేట్రానికి కాలుదువ్విన పందెంకోడిని...అసలు బరిలోకి దిగకుండా ప్రత్యర్థులు ప‌డ‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. ఆర్కే నగర్లో పోటీకి విశాల్‌ వేసిన నామినేషన్‌ను ఈసీ‌ తిరస్కరించడం తెలిసిందే. విశాల్‌ నామినేషన్‌ను ప్రతిపాదిస్తూ చేసిన సంతకాలు అసలువి కావంటూ సుమతి, దీపన్‌ ఫిర్యాదు రావడంతో నామినేషన్‌ తిరస్కరించారు. అనంత‌రం ప‌లు ట్విస్టుల త‌ర్వాత ఆమోదించారు. అయితే ఆ త‌ర్వాతే ట్విస్ట్ జ‌రిగింది.

ఆర్కే నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నటుడు విశాల్‌ నామినేషన్ వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించడం వివాదాస్పదంగా మారింది. విశాల్‌ నామినేషన్‌ను ప్రతిపాదిస్తూ చేసిన సంతకాలు అసలువి కావంటూ సుమతి, దీపన్‌ ఫిర్యాదు రావడంతో నామినేషన్‌ తిరస్కరించారు. దీంతో ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాల్ ధర్నాకు దిగారు. అదే సమయంలో సుమతి బంధువు వేలు అనే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిన విశాల్.. అసలు విషయాన్ని తెలుసుకున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీకి దిగుతున్న మధుసూదనన్ వర్గీయులు సుమతి కుటుంబసభ్యులను బెదిరించి.. ఇలా తప్పుడు లెటర్ ఇప్పించారనే ఆడియో సారాంశం. ఆ మొబైల్‌ ఆడియో రికార్డును ఎన్నికల అధికారులకు వినిపించారు విశాల్‌. దీంతో విశాల్‌ నామినేషన్‌ను ఆమోదించారు. అయితే.. మళ్లీ కథ యూటర్న్‌ తీసుకుంది. రాత్రికి ఆ ఇద్దరు మళ్లీ ఈసీని కలిసి ఆ సంతకాలు తమవి కావని చెప్పడంతో.. ఫైనల్‌గా విశాల్‌ నామినేషన్ ఈసీ రిజెక్ట్‌ చేసింది.

అయితే ఈ ట్విస్ట్‌కు మరింత సస్పెన్స్ తోడ‌యింది. ఉప ఎన్నికల్లో తాను పోటీ చెయ్యడానికి మద్దతుగా నామినేషన్ పత్రాల్లో సంతకాలు చేసిన సుమతి, దీపన్ అడ్ర‌స్ లేరు. దీంతో త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన వారి ఆచూకి చెప్పాలంటూ విశాల్ చెన్నై నగర పోలీసులను ఆశ్రయించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ...త‌న‌కు మ‌ద్ద‌తిచ్చిన సుమ‌తి, దీప‌న్‌ను గురువారం మద్నాహ్నం 3 గంటలకు ఎన్నికల కమిషన్ ముందు హాజరుపరచడానికి తాను సిద్ద‌మ‌య్యాన‌ని విశాల్ తెలిపారు. అయితే వారి ఆచూకి క‌న‌ప‌డ‌టం లేద‌న్నారు. ఈ విష‌యంలో స‌హ‌క‌రించాల‌ని మీడియా ద్వారా విశాల్ కోరారు. అయితే..విశాల్ చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు.

నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ విష‌యంలో తనకు అన్యాయం జరిగిందంటూ విశాల్  ఈ విషయాన్ని ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అతడు తనను తాను నిరూపించుకునేందుకు ఈసీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ సమయం ఇచ్చింది. దీంతో తన నామినేషన్ పత్రాల్లో ఫోర్జరీ సంతకాలు చేసినట్టు ఆరోపించిన దీపన్, సుమతి కోసం విశాల్ చాలా ప్రయత్నించారు. వారితో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దుదామనుకున్నారు. కానీ దీపన్, సుమతి ఆచూకీ తెలీడం లేదని.. వాళ్లు ఎలా ఉన్నారో అని ఆందోళనగా ఉందని ట్వీట్ చేశారు. అనంత‌రం విశాల్‌ పోలీసుల‌ను ఆశ్ర‌యించి వారి ఆచూకి క‌నిపెట్టాల‌న్నారు. తాను ఉప ఎన్నిక‌లో పోటీ చేసినా..చేయ‌క‌పోయినా ఓకేన‌ని అయితే...త‌న‌కు స‌హ‌క‌రించిన వారికి మాత్రం ఎలాంటి ముప్పు క‌ల‌గ‌డ‌కూడ‌ద‌ని విశాల్ అన్నారు. ఉప ఎన్నిక‌లో త‌న నామినేష‌న్ విష‌యంలో ప్ర‌జాస్వామ్యం ఓడిపోయింద‌ని విశాల్ ఈ సంద‌ర్భంగా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News