కనగరాజ్ కు మరోసారి పదవి.. ఈసారి మరేం జరుగుతుందో?

Update: 2021-11-30 08:30 GMT
కొన్నిసార్లు అంతే.. ఎన్నిసార్లు ప్రయత్నించినా పాజిటివ్ ఫలితం ఉండదు. అలా అని ప్రయత్న లోపం కూడా ఉండదు. కానీ.. ముడిపడదు. ఎంతలా ట్రై చేసినా.. ఏదో ఎదురుదెబ్బ తగులుతూనే ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి వైఎస్ మాదిరి ఒక అలవాటు ఉంది. ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే.. దాన్ని పూర్తి చేసే వరకు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుంటారు. అంతేకాదు.. వైఎస్ లో కనిపించే మరో లక్షణం.. తనను నమ్ముకున్న వారికి.. తనను నమ్మి ముందుకు వచ్చిన వారిని ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలిపెట్టటానికి అస్సలు ఇష్టపడరు. నిజానికి ఈ గుణమే మిగిలిన నేతలకు వైఎస్ ను భిన్నంగా నిలిపింది. ఇదే లక్షణం జగన్ కు ఒక వరంగా మారిందని చెప్పాలి.

జస్టిస్ కనగరాజ్ పేరు గుర్తుందా? ఎక్కడో విన్నట్లుందే అంటారా? తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తిని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎంపిక చేసుకొని ఆయన్ను ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారిగా నియమించటం తెలిసిందే. అప్పటి ఎస్ఈసీ విషయంలో పొసగని నేపథ్యంలో ఆయన్ను తమిళనాడు నుంచి ప్రత్యేకంగా ఏపీకి తీసుకొచ్చారు. అయితే.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన్ను ఆ పదవి నుంచి పక్కన పెట్టాల్సి వచ్చింది. నమ్మి వచ్చిన వారిని వదిలేయటం ఇష్టం లేని జగన్.. ఆ తర్వాత ఆయనకు పోలీస్ కంప్లైంట్ అథారిటీకి ఛైర్మన్ పదవి కట్టబెట్టారు.

దీనిపైనా కోర్టును ఆశ్రయించటం.. అక్కడి ఆదేశాలు భిన్నంగా రావటంతోఆయన్ను ఆ పోస్టు నుంచి పక్కక పెట్టక తప్పలేదు. ఇలా వరుస పెట్టి రెండుసార్లు ఎదురుదెబ్బలు తగిలినా.. విడిచిపెట్టకుండా ముచ్చటగా మూడోసారి మరో పదవిని కట్టబెట్టిన వైనాన్ని చూస్తే.. జగన్ కమిట్ మెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేం. తాజాగా ఆయన్ను పీడీ డిటెన్షన్ చట్టంఅమలు కోసం ప్రతి రాష్ట్రంలో ఒక సలహా మండలి ఉండాలి.

ఇప్పుడాయన్ను అందులో సభ్యుడిగా ఎంపిక చేశారు. ఆ పదవికి ఛైర్మన్ గా ఉమ్మడి రాష్ట్రంలో జడ్జిగా పని చేసిన రిటైర్ అయిన జస్టిస్ సంజీవరెడ్డి అనే 85 ఏళ్ల పెద్దాయనకు ఛైర్మన్ పదవిని కట్టబెట్టి.. సభ్యుడిగా మాత్రం కనగరాజ్ కు అవకాశం ఇచ్చారు. మరి..ఈసారైనా ఆ పదవి ఉంటుందా? మళ్లీ తేడా కొడుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒకసారి తాను కమిట్ అయ్యానుకాబట్టి ఆయనకు ఏదో ఒక స్థిరమైన పదవిని ఇచ్చే వరకు వదలకూడదన్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.మరి..ఈసారైనా ఆయన పదవి ఉంటుందా? మరెవరైనా కోర్టును ఆశ్రయిస్తారా? అన్నది కాలమే సమాధానం ఇవ్వగలదు.
Tags:    

Similar News