షాకుల బొనాంజా చిదంబ‌రానికే ఎందుకు?

Update: 2018-03-06 07:42 GMT
దేశంలో త‌ప్పుల‌న్నీ చిదంబ‌రం.. ఆయ‌న కుటుంబ స‌భ్యులే చేసిన‌ట్లుగా సీన్ ఎందుకు ఆవిష్కృత‌మ‌వుతోంది?  కుంభ‌కోణాల‌కు పాల్ప‌డిన నేత‌లు చాలామందే ఉన్నా.. తంబి ఫ్యామిలీ చుట్టూనే ఉచ్చు బిగుసుకుంటోంది ఎందుకు? ఒక‌టి త‌ర్వాత ఒక‌టి చొప్పున తెర మీద‌కు వ‌స్తున్న కుంభ‌కోణాలు చిదంబ‌రం ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎందుకిలా? అంటే.. చిదంబ‌రం మాష్టారు చేతులారా చేసుకున్న‌దేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎద‌వ ప‌నులు చేసేట‌ప్పుడు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి. అధికారం త‌మ‌కే శాశ్వితం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దు.

ఏపీలోని రాయ‌ల‌సీమ‌లో ఒక చిత్ర‌మైన రాజ‌కీయం న‌డుస్తూ ఉంటుంది. ఫ్యాక్ష‌న్ ఒక‌ప్పుడు బ్ర‌హ్మండంగా ఉండేద‌ని చెప్పే క‌ర్నూలు మొద‌లు.. అనంత‌పురం వ‌ర‌కూ ఇప్పుడు రాజ‌కీయం ఒకే తీరులో ఉంటుంది.

అధికారంలో ఏ పార్టీ నేత ఉన్నా స‌రే.. తాము చేసే కాంట్రాక్టుకు సంబంధించిన వాటా అధికార‌ప‌క్షానికి ఇంత‌.. విపక్షానికి ఇంత అన్న‌ది అన‌ధికారిక రూల్ మాదిరి న‌డిచిపోతుంది. దీంతో.. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు ప‌వ‌ర్ కోసం ఫైట్ చేసుకోవ‌ట‌మే కానీ.. ఒక‌సారి ఎన్నికల తంతు ముగిసిన త‌ర్వాత ఎవ‌రి వ్యాపారం వారిదే. ఎవ‌రి దందా వారిదే. కాకుంటే.. ముందే అనుకున్న‌ట్లు ఎవ‌రి వాటాలు వారికి ప‌క్కాగా లెక్క పాటిస్తుంటారు.

ఈ త‌ర‌హా రాజ‌కీయం ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. తాము ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు మ‌రెవ‌రూ పైకి రాకూడ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. అవ‌త‌ల వారు మ‌ళ్లీ కోలుకోకుండా పాతాళానికి తొక్కేయాల‌న్న అత్యాశే లేనిపోని చిక్కుల్ని తెచ్చి పెడుతోంది. కేసులు.. కోర్టులు అంటూ ఉరుకులు పెడుతున్న చిదంబ‌రం ఒక‌ప్పుడు ఇదే రీతిలో త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులైన మోడీ.. అమిత్ షాల‌కు చుక్క‌లు చూపించారు. రాజ‌కీయంగా వారిని దెబ్బ కొట్టేందుకు త‌న‌కున్న విశేష అధికారాన్ని విశేషంగా వాడేశార‌న్న ఆరోప‌ణ ఉంది.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు క‌దా. త‌మ‌కు చుక్క‌లు చూపించిన వారికి అంత‌కు రెట్టింపు చుక్క‌లు చూపించే మైండ్ సెట్ ఉన్న మోడీ షాల ద్వ‌యం ఇప్పుడు పవ‌ర్ పంజాను విసురుతున్న‌ట్లు చెబుతారు. సెకండ్ ట‌ర్మ్ వ‌ర‌కూ ఢోకా లేద‌న్న ఆలోచ‌న మొన్న‌టి వ‌ర‌కూ ఉండ‌టంతో చ‌ట్టాన్ని మ‌రింత ప‌దును తేల్చి.. చిదంబ‌రం తంబి చేసిన త‌ప్పుల్ని ఒక్కొక్కటిగా తెర మీద‌కు తెస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇంత‌కీ మోడీ షాల‌కు చిదంబ‌రం చూపించిన సినిమా విష‌యాన్ని గుర్తు చేసుకుంటే.. యూపీఏ హ‌యాంలో చ‌క్రం తిప్పిన చిదంబ‌రం.. 2002 గోద్రా అల్ల‌ర్లు మొద‌లు.. అనేక ఎన్ కౌంట‌ర్ల‌ను ఆయ‌న చుట్టుముట్టేలా చేశార‌ని చెబుతారు. ఇష్ర‌త్ జ‌హాన్ కేసు మొద‌లు న‌లుగురు కాల్చివేత‌.. 2005లో ఉగ్ర‌వాది సాహ్ర‌బుద్దీన్ షేక్ ఎన్ కౌంట‌ర్ లాంటివి చాలానే ఉన్నాయ‌ని చెబుతారు. గుజరాత్ లో బీజేపీ ప్రాభ‌వాన్ని.. మ‌రీ ముఖ్యంగా మోడీ షాల‌ను తొక్కేయాల‌న్న దూరాలోచ‌న‌తో చిదంబ‌రం చేసిన ప‌నులు.. ఇప్పుడు ఆయ‌న మెడ‌కు చుట్టుకుంటున్న‌ట్లు చెబుతున్నారు.

యూపీఏ హ‌యాంలో చిదంబ‌రం గారి హ‌వా ఒక రేంజ్లో సాగింది. ఏపీకి అన్యాయం చేసే విష‌యంలోనూ త‌న‌దైన మార్క్ ప్ర‌ద‌ర్శించిన చిదంబ‌రం మీద‌.. అనేక అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. తెల్ల లుంగీ.. మ‌ల్లెపువ్వులాంటి చొక్కా వేసుకొనే చిదంబ‌రం మాష్టారి మ‌న‌సు అంత తెల్లగా.. సింఫుల్ గా ఉండ‌ద‌ని చెబుతారు. అదే.. ఆయ‌న‌పై మోడీషాలు  ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేసేలా చేసింద‌ని చెబుతారు. మ‌రీ.. వ్య‌వ‌హారంలో ఎవ‌రిది పైచేయి అవుతుంద‌న్న‌ది కాల‌మే డిసైడ్ చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News