పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ఎందుకంటే...!

Update: 2019-08-21 07:58 GMT
ఏ ప్రాజెక్టు నిర్మాణానికైనా కావాల్సింది అనుమతులు.... రాష్ట్రానికి జీవగడ్డగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 14 అనుమతుల్లో కీలకమైన 10 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి సాధించారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ. ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు. 90 విడతలు వర్చువల్‌ రివ్యూ(సీఎం కార్యాలయంలో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా) - మరో 30 విడతలు నిర్మాణ ప్రాంతంలో పర్యటించటం ద్వారా ప్రతి సోమవారాన్ని పోలవరం రోజుగా చేశానని చెప్పుకుని హడావిడి చేయటం  తప్ప మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ  లేదు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి తన అనుకూల నిర్మాణ సంస్థకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ లు ఇవ్వటం - జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణానికి అవసరమైన స్థలం అప్పగించకపోవటంలో మాత్రం చంద్రబాబు ముందున్నారు. అసెంబ్లీ లోపల - బైట అప్పటి జలలవనరుల శాఖ మంత్రి మాట్లాడుతూ రాసిపెట్టుకోండి 2018 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని పలుమార్లు ప్రకటనలు చేశారు. అవి ప్రకటనలు గానే మిగిలిపోయాయి తప్ప ఆచరణలో పని మాత్రం ముందుకు సాగలేదు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటి నుంచి ఎంత వేగంగా చేసినా పూర్తి కావటానికి మరో రెండు సంవత్సరాలు పడుతుంది. ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఈ పనులు పూర్తి కావాలంటే సమర్ధవంతమైన - అనుభవజ్ణులైన సిబ్బంది ఉన్న సంస్థకు పనులు అప్పగించటమే ఏకైక మార్గంగా భావించిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులను  రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఐదున్నర దశాబ్ధాల క్రితం పోలవరం ప్రాజెక్టును నిర్మించాలనే ఆలోచన వచ్చింది. అయితే అది కార్యరూపం టి. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాల్చింది. ఆయన శంకుస్థాపన చేసినా  పనులు జరిగింది లేదు. 1995 నుంచి 2005 వరకూ ఎనిమిదిన్నర ఏళ్ల పాటు సీఎంగా కొనసాగిన చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు మరోసారి  శంకుస్థాపన  చేసినా  పనులు అడుగు ముందుకు పడలేదు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి తన స్వహస్థాలతో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులతో పాటు మరో తొమ్మిది రకాల అనుమతులను కేంద్రం నుంచి తీసుకొచ్చారు. ఆ తరువాత దశాబ్ధకాలంలో మరో రెండు అనుమతులు మాత్రమే బాబు ప్రభుత్వం సాధించింది. ఏ ప్రాజెక్ట్‌ నిర్మించాలన్నా ఇంజలనీరింగ్‌ యంత్రాంగం ముఖ్యంగా - ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయం - అనుబంధ ఇంజనీరింగ్‌ వ్యవస్థలు - ముంపు బాధితులు పునరావాస - పునర్‌ నిర్మాణ పనులకు ప్రత్యేక  కమిషనర్‌ కార్యలయాన్ని వైఎస్‌ ఏర్పాటు చేయటంతో పాటు ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధనకు అవసరమైన సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అప్పట్లోనే సమర్పించారు.
 
పోలవరం  ప్రాజెక్టు నిర్మాణానికి  ప్రధానమైన అడ్డంకి  గోదావరి నదికి వరద. ప్రస్తుతం గోదావరికి వరద వచ్చింది. అది తగ్గుముఖం పట్టి తిరిగి పనులు చేపట్టాలంటే నవంబర్‌ మాసం సరైన సమయం. ఈలోగా రివర్స్‌ టెండరింగ్‌ కు నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం అన్ని రకాల సాధన  సంపత్తి కలిగిన సంస్థలను ఎంపిక చేసి నిర్మాణ బాధ్యతలు అప్పగించాలి. పోలవరం ప్రాజెక్ట్‌ లో కీలకమైన జలాశయంతో పాటు జలల విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి 2009లో టెండర్లు పిలిస్తే అప్పటి ధరలు తమకు గిట్టుబాటు కావని ఎవ్వరూ ముందుకు రాలేదు.  2012లో ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్థతో పాటు మరికొన్నింటికి అప్పటి ప్రభుత్వం టెండర్ల ద్వారా అప్పగించింది. కాలగమనంలో ఆ సంస్థ ఆర్ధికంగా దివాళా తీయటంతో పోలవరం నిర్మాణ పనులను మరో సంస్థకు అప్పగించటంతో పాటు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ను కూడా భారీగానే అప్పగించారు. మరో రెండు సంస్థలు ఇందులో ఆ తరువాత భాగస్వామ్యం అయ్యాయి.

వైఎస్‌ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ  ప్రాజెక్టుకు రూ. 5135 కోట్లు ఖర్చు చేస్తే ఆ తరువాత  2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకూ 11537 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఇప్పటి వరకూ 16673 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకూ ఖర్చు చేసిన 11537 కోట్లలో కేంద్రం ఇప్పటి వరకూ 6727 కోట్లు విడుదల చేసింది. కేంద్రం మీరు చేసిన ఖర్చుకు సంబంధించిన బిల్లులు పంపండి మేం నిధులు విడుదల చేస్తాం అంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ పని చేయకపోవటంతో  ఇప్పటి వరకూ సింహభాగం నిధులు కేంద్రం నుంచి విడుదల కాలేదు. కేంద్రం నిధులు వేగవంతంగా విడుదలైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవకాశం ఉంది.

పోలవరం ప్రాజెక్టులో ఇంకా నాలుగు కోట్ల ఘనపు మీటర్ల మట్టి పని - 20 కోట్ల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ పని చేయాల్సి ఉంది. ప్రాజెక్టులో అవసరమైన నిర్మాణాలు 140 వివిధ దశల్లో ఉంటే మరో 208 ఇంకా ప్రారంభించనే లేదు. హెడ్‌ వర్క్స్‌ లో నాలుగు ప్యాకేజీ పనులు నత్తకు నడక నేర్పిస్తుంటే - జల విద్యుత్‌ కేంద్రం పనులు ఇంత వరకూ ప్రారంభమే కాలేదు. జల గ్రౌటింగ్‌ - డయాఫ్రం వాల్‌ వంటి మట్టి పనులు మాత్రమే ఇప్పటి వరకూ పూర్తయ్యాయి. స్పిల్‌ వే - స్పిల్‌ ఛానల్‌ - అప్రోచ్‌ ఛానల్‌ - పైలెట్‌ ఛానల్‌ - ఎడమ గట్టు పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇక కీలకమైన స్పిల్‌ వే - స్పిల్లింగ్‌ బేసిన్‌ - స్టిల్‌ ఛానల్‌ వంటి కాంక్రీట్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయిన వెంటనే గత ప్రభుత్వం చేపట్టిన  ఇంజనీరింగ్‌ పనులపై అధ్యయనానికి  నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారించి పోలవరం పనులు అంతంత మాత్రం గానే జరిగాయని -  2300 కోట్లు కాంట్రాక్టర్లకు అదనంగా ఏఏ రూపంలో - ఏఏ పద్దుల కింద చెల్లించి అవ్యాజ్యమైన ప్రేమ చూపించారో  తమ నివేదికలో వివరంగా పేర్కొంది.

ప్రాజెక్ట్‌ హెడ్‌ వర్క్‌ పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి రెండు సంస్థలకు అప్పగించారు. ఇందులో ఈ ఏడాది ఆగస్టు నాటికి మూడు - వచ్చే ఏడాది జూలై నాటికి మరొకటి పూర్తి కావాలి. ఈ పనులు ఇప్పటి నుంచి యుద్ధ ప్రాతిపదికన చేపడితేనే పూర్తి కావటానికి  మరో రెండేళ్లు పడుతుంది. అంటే ఇప్పటి వరకూ ఆ పనులు ఎంత వేగంగా జరిగాయో అర్ధం అవుతుంది.

పోలవరం జల విద్యుత్‌ కేంద్రం పనులకు 2017 జలనవరిలో టెండర్లు పిలిచి డిసెంబర్‌ లో ఖరారు చేసి 322 కోట్లు అడ్వాన్స్‌ రూపంలో చెల్లించారు.  పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాకపోవటంతో ప్రాజెక్ట్‌ లోని స్పిల్‌ వే - రాక్‌ ఫిల్‌ డ్యాం - కాపర్‌ డ్యాం - గేట్లు బిగించటం వంటి పనులను ప్రభుత్వం రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్లింది. పోలవరం ప్రధాన జలలాశయం నిర్మాణ  కాంట్రాక్టర్‌ - జల విద్యుత్‌ కేంద్రం కాంట్రాక్టర్‌ ఒక్కరే అయినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. జల విద్యుత్‌  కేంద్రం నిర్మాణానికి స్థలం అప్పగించని ప్రభుత్వం నిర్మాణ సంస్థకు మాత్రం రూ. 787 కోట్లను అడ్వాన్స్‌ రూపంలో చెల్లించటం  గమనించ దగ్గ విషయం.  పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యి అందుబాటులోకి రావాలంటే అన్ని పనులను ఒకే ప్యాకేజి కిందకు తీసుకొచ్చి ఒకే కాంట్రాక్టర్‌ కు అప్పగించాలని నిపుణుల కమిటీ సూచించటంతో  ఏపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్లింది.
 




Tags:    

Similar News