రాజ‌ధాని స్వాప్నికుడిపై రాళ్ల‌దాడి.. ఎందుకీ ప‌రిస్థితి..?

Update: 2019-11-28 14:30 GMT
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం అహ‌ర‌హం శ్ర‌మించార‌న్న పేరు ఒక‌ప‌క్క‌ - గ‌డిచిన ఐదేళ్లు ఏం చేశార‌న్న ప్రశ్న మ‌రోప‌క్క‌.. వెర‌సి ప్ర‌పంచ మేధావిగా - రాజ‌కీయ అప‌ర చాణిక్యుడిగా పేరున్న మాజీ సీఎం చంద్ర‌బాబుకు ఉక్కపోత త‌ప్ప‌డం లేదు. ఆయ‌న హ‌యాంలోనే ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని పెంచి పెద్ద‌చేసి.. ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయాల‌నుకున్న మాట వాస్త‌వం. అయితే, ఉద్దేశం ఎప్పుడూ మంచిదే అయినా.. కార్యాచ‌ర‌ణ కు వ‌చ్చే స‌రికి మాత్రం దానికి అనేక రాజ‌కీయాలు మొగ్గ తొడ‌గ‌డం.. పార్టీలో నేత‌ల దూకుడు కార‌ణంగా అనేకానేక వివాదాలు చుట్టుముట్టాయి. ఫ‌లితంగా భూముల విష‌యం నుంచి పెట్టుబ‌డులు వ‌ర‌కు కూడా వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి.

రైతుల నుంచి 33 వేల ఎక‌రాల‌ను స‌మీక‌ర‌ణ ప‌ద్ధ‌తిలో తీసుకున్న రికార్డు చెరిగిపోక‌పోయినా.. ఆ త‌ర్వాత రైతుల‌కు స‌రైన విధంగా స‌మ‌యానుకూల న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న‌ది నిర్వివాదాంశం. ఇక‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని తీసుకువ‌చ్చి శంకుస్థాప‌న అయితే చేయించ‌గ‌లిగారు కానీ, అమ‌రావ‌తికి ఇటుక‌లు పేర్చ‌డంలో ఆయ‌న సాయాన్ని అందిపుచ్చుకోలేక పోయారు. ఫ‌లితంగా మూడు అడుగులు ముందుకు ప‌ది అడుగులు వెన‌క్కి చందంగా అమ‌రావ‌తి రాజ‌ధాని మారిపోయింది. అదే స‌మ‌యంలో విప‌క్షంగా ఉన్న అప్ప‌టి వైసీపీ కూడా స‌హ‌జంగా లేవనెత్తే వివాదాంశాల‌కు చంద్ర‌బాబు స‌మాధానం ఇవ్వ‌లేక పోవ‌డం కూడా ప‌రిస్థితిని దారుణానికి చేర్చింది.

అప్పు ఇస్తాన‌న్న ప్ర‌పంచ బ్యాంకు క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న అనంత‌ర‌మే త‌ప్పుకొంద‌న్న విష‌యాన్ని టీడీపీ నేత‌లు దాచాల‌ని ప్ర‌య‌త్నించినా దాగ‌లేదు. కొంద‌రు రైతులు ముఖ్యంగా ఓ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు ఇక్క‌డ పురిగొల్పిన ఉత్సాహం వెనుక పూర్తిగా రాజ‌కీయ కార‌ణాలే ఉన్నాయ‌నేది వాస్త‌వం. దీనిని కాద‌ని ఖండించ‌లేని ప‌రిస్థితి చంద్ర‌బాబుకు వెంటాడింది. దీంతో అమ‌రావ‌తిపై నీలి నీడలు నేడు కాదు.. నాడే(బాబు హ‌యాంలో) ముసురుకున్నాయి. నేడు అవి మ‌రింతగా ఊడ‌లు దిగాయి. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు అక్క‌డ ప‌ర్య‌టించి ఏం చెప్పాల‌ని అనుకుంటున్నా.. ఎవ‌రూ వినేందుకు సిద్దంగా లేర‌నేది వాస్త‌వం.

నాడు ఐదేళ్లు అధికారంలో ఉండి.. 2017లో శంకుస్థాప‌న చేసి.. ప్ర‌పంచ స్తాయిలో న‌వ‌ న‌గ‌రాల‌ను నాణ్యంగా క‌ట్టిస్తాన‌న్న హామీలు మాట‌ల‌కే ప‌రిమితం కావ‌డం - తాత్కాలిక‌ స‌చివాల‌యం - అసెంబ్లీలు చిన్న‌పాటి వ‌ర్షాల‌కే నీటి మ‌డుగులు ఎత్తడం వంటివి బాబు పాల‌నా ద‌క్షత‌లో `మ‌చ్చ‌`తున‌కలు కాకుండా పోతాయా ?  ప్ర‌స్తుత వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఆరు మాసాలు కూడా పూర్తికాక‌ముందుగానే రాజ‌ధానిని నిర్మించాల‌ని పోరు పెడుతున్న తీరుపై ప్ర‌జ‌ల్లో సానుభూతి లేకుండా పోవ‌డానికి గ‌డిచిన మూడేళ్ల పాల‌న అద్దం ప‌డుతోంది. స్వ‌యంకృతం - అలివిమీరిన సామాజిక వ‌ర్గ అభిమానం.. చంద్ర‌బాబును మైన‌స్ చేసిన త‌రుణంలో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌పై మాట‌ల‌కు బ‌దులు రాళ్లు ప‌డుతుండ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌ను ప్ర‌స్ఫుటం చేస్తోంద‌న‌డంలో సందేహం లేదు.



Tags:    

Similar News