‘కన్నా’పై పార్టీకి మాత్రం సూపర్ కాన్ఫిడెన్స్?

Update: 2018-05-14 15:30 GMT
ఆయన ఆరెస్సెస్ సిఫారసుతో రాలేదు. ఆయనకు పదవి ఇవ్వకపోతే ఆరెస్సెస్ కన్నెర్ర చేసే పరిస్థితి లేదు. పోనీ కులం అనుకుందామా అంటే.. ఆయనతో పాటూ పరిశీలించిన మిగిలిన పేర్లు కూడా అదే కులానికి చెందినవే. పోనీ, తొలినుంచి భాజపా జెండా మోసిన నాయకుడా అనుకుంటే.. మొన్నటికి మొన్న కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్తు అంధకారం అని భయం పుట్టిన తర్వాత పార్టీలోకి వచ్చిన వ్యక్తి... మరి ఇన్ని లోపాలు బహిరంగంగా కనిపిస్తున్నప్పుడు... భాజపా జాతీయ నాయకత్వం కన్నా లక్ష్మీనారాయణకు ఎందుకు అధ్యక్ష కిరీటం కట్టబెట్టింది? ఇలాంటి సందేహం మామూలు పాఠకులకు ఎవరికైనా కలుగుతుంది! కానీ దీనికి భాజపా అగ్ర నాయకత్వం వద్ద కూడా మంచి సమాధానమే ఉన్నదని తెలుస్తోంది.

కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ రాజకీయాల్లో తలపండిపోయిన వ్యక్తి. నేదురమల్లి జనార్దనరెడ్డి - కోట్ల విజయభాస్కరరెడ్డి - వైఎస్ రాజశేఖర రెడ్డి - రోశయ్య - కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఉద్ధండులు సీఎంలుగా ఉండగా ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచి భాజపాలోకి వలస వచ్చిన నేతల్లో కావూరి సాంబశివరావు - పురందేశ్వరి లాంటి వారు ఎందరున్నప్పటికీ.. తెరవెనుక రాజకీయాలు నడపడం, ప్రత్యేకించి రాష్ట్ర రాజకీయాలకు అవసరం అయ్యే వ్యూహ ప్రతివ్యూహాల చతురత కన్నాకు బాగా ఉన్నదనే భాజపా నాయకత్వం భావించినట్లు సమాచారం. పైగా ఎటూ ఒకే సామాజిక వర్గానికి చెందిన పేర్లను పరిశీలించినప్పుడు.. అనుభవాన్ని, చాణక్య తెలివితేటలను ప్రాతిపదికగా తీసుకుంటే తప్పేముంది అనేది వారి ఆలోచన.

సోము వీర్రాజు పేరును కూడా చివరి వరకు పరిశీలించినప్పటికీ.. దూకుడుగా మాట్లాడడం తప్ప.. మందిని పోగేయడంలో ఆయనకున్న టేలెంట్ సరిపోదని.. రాష్ట్రనాయకుడిగా చాలరని పార్టీ భావించినట్టు తెలుస్తోంది. అందుకే కన్నా చేతిలో పగ్గాలు పెట్టి... ఆయన వలస నేత అయినప్పటికీ, ఇటీవల పార్టీని వీడిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్న వాడే అయినప్పటికీ.. ఆయనకు సహకరించేలా.. మిగిలిన వారినందరినీ బుజ్జగించే పనిలో పార్టీ నాయకత్వం పడినట్లుగా తెలుస్తోంది. సోము వీర్రాజు అలిగిన సంగతి అందరికీ అర్థమవుతోంది. కానీ.. బయట పడకుండా అలిగిన నాయకులు ఇంకా చాలామందే పార్టీలో ఉన్నారు. అయితే వీరందరినీ బుజ్జగించడం పెద్ద పని కాదని పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్లు సమాచారం.  
Tags:    

Similar News