భార్య, కొడుకు వల్లే బొజ్జల పదవి పోయిందా?

Update: 2017-04-02 10:25 GMT
ఏపీలో తాజాగా మంత్రి పదవి పోగొట్టుకున్న బొజ్జల కృష్ణారెడ్డి తీవ్ర ఆవేదనకు గురయిన సంగతి తెలిసిందే. అయితే.. పూర్తిగా పట్టు కోల్పోవడం వల్లే ఆయనపై వేటు వేశారని చెబుతున్నారు. ముఖ్యంగా అటవీశాఖలో బొజ్జల ప్రమేయం పూర్తిగా లేకుండా పోయిందని, అంతా ఆయన కుమారుడే నడిపిస్తున్నారని.. ఇక నియోజకవర్గం సంగతులన్నీ ఆయన భార్య చూసుకుంటున్నారని.. ఇదంతా చంద్రబాబుకు పదేపదే ఫిర్యాదులు అందడంతో ఇలా వేటేశారని తెలుస్తోంది.
    
అటవీశాఖలో ఏదైనా పని కావాలన్నా,  లేకుంటే శ్రీకాళహస్తిలో ఏవైనా టెండర్లు కావాలన్నా  బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కలవాల్సిన పనే ఉండేది కాదట..  నేరుగా వెళ్ళి ఆయన కుమారుడు, భార్యను కలిస్తే చాలు. అంతా నిమిషాల్లో జరిగిపోయేవట. పేరుకే అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అయినా పెత్తనం మొత్తం కొడుకు, భార్యలదే. వీరు చెప్పిందే వేదం.. దాంతో ఇష్టారాజ్యం పెరిగిపోయిందని.. చివరకు మంత్రి పదవికే ఎసరొచ్చిందని తెలుస్తోంది.
    
నిజానికి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బొజ్జల అంటే చంద్రబాబుకు ఎంతో ఇష్టం. అందుకు కారణం కూడా ఉంది. 2003 అక్టోబర్‌ 1వ తేదీన జరిగిన అలిపిరి బాంబు దాడిలో చంద్రబాబు తో పాటు  బొజ్జల కూడా ప్రమాదానికి గురై గాయాలపాలయ్యారు. అప్పటి నుంచి బొజ్జల అంటే చంద్రబాబుకు మంచి స్నేహమే ఉంది. దీంతో చంద్రబాబుకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు.
    
అంతవరకు బాగానే ఉన్నా ఆ తరువాత అసలు కథ మొదలైందని చెబుతారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడిగా ఉన్న బొజ్జల  కుమారుడు సుధీర్ రెడ్డి , బొజ్జల భార్య బృందమ్మ పెత్తనం ఎక్కువైందట.  అటవీశాఖకు సంబంధించిన ఎలాంటి పనులన్నా సుధీర్‌ రెడ్డిని కలిస్తే చాలు.. చాలా సులువుగా అయిపోతుంది. దానికొక లెక్క కూడా ఉంటుంది. అది గుర్తు పెట్టుకోవాలి.. అని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఇక బృందమ్మ అయితే అంతా ఫోన్లోనే నడిపిస్తారని అంటారు.  శ్రీకాళహస్తి మాత్రమే కాదు.. హైదరాబాద్‌లో కూడా ఏ పనైనా చేయగల సామర్థ్యం ఆమెది అని చెబుతుంటారు. ఇలా తల్లీ కొడులు ఇద్దరూ కలిసి బొజ్జలను డమ్మీ చేసేశారట.. అదే ఇప్పుడు బొజ్జల కొంప ముంచడంతో ముగ్గురూ కలిసి లబోదిబో మంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News