బాబు - జగన్.. టికెట్ల ఆలస్యానికి కారణమిదేనా?

Update: 2019-01-16 07:15 GMT
ఖర్చుల భయానికి ఏపీలో అధికార - ప్రతిపక్షాలు అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసుకున్నాయా.? తెలంగాణలో మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ టీఆర్ ఎస్ తరుఫున నిలబడ్డ నేతలకు చుక్కలు చూపారు. వారి చేతి చమురు వదిలేలా చేశారు. ఒక్కో హైదరాబాద్ ఎమ్మెల్యే 30 కోట్ల వరకు తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టాడంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పుడు ఫిబ్రవరిలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వేయడానికి రెడీ కాగా ప్రతిపక్ష వైసీపీ - అధికార టీడీపీలు అభ్యర్థులను ప్రకటించడానికి రెడీ అయ్యి.. వెనక్కి తగ్గాయి. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయనే విషయంలో అందరిలోనూ సందిగ్ధత నెలకొంది.

తాజాగా కొందరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఇప్పుడే అభ్యర్థుల ప్రకటన వద్దని వేడుకున్నారట.. తెలంగాణలో టీఆర్ ఎస్ అభ్యర్థుల ఖర్చులను బేరీజు వేసుకున్న తర్వాత ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించవద్దని వేడుకున్నారట.. వైసీపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలో  ఎన్నికలు మేలో జరిగితే తమ ఖర్చులు అమాంతం పెరుగుతాయని.. నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థులను ప్రకటించాలని వైఎస్ జగన్ పై అభ్యర్థులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ ఎన్నికల వేళ కూడా టీఆర్ ఎస్ ముందే అభ్యర్థులను ప్రకటించడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థుల కంటే.. టీఆర్ ఎస్ అభ్యర్థులే ముందస్తుగా భారీగా ఖర్చు పెట్టారు. గ్రామాల్లో వివిధ కుల సంఘాలకు తాయిలాల కింద చందాలు.. గ్రామాల్లో కిందిస్థాయి నేతలకు ప్రచానికి వారు అడిగినంత ఇచ్చారు. ఒక్కో అభ్యర్థి ఖర్చు రోజుకు 10 లక్షల వరకూ అయ్యింది. దీంతో తెలంగాణ ఎన్నికలను చూసి ఆంధ్రా నేతలు బెదిరిపోతున్నారు. ఖర్చు భారం తగ్గించుకోవాలన్న ఒక కారణం వల్ల మరికొద్ది రోజుల పాటు ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చని సమాచారం.
   

Tags:    

Similar News